Shardul Thakur: శార్దూల్ ఠాకూర్‌ను కోల్‌కతాకు అమ్మేసిన ఢిల్లీ
ABN, First Publish Date - 2022-11-14T17:54:33+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 మినీ వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజీ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అమ్మేసింది. శార్దూల్ (Shardul) ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా, శార్దూల్ (Shardul Thakur) కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడినా చివరికి కోల్‌కతా దక్కించుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో శార్దూల్ (Shardul) అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచుల్లో 15 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగులోనూ ఉసూరుమనిపించాడు. 138 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు మాత్రమే చేశాడు. 2017 తర్వాత శార్దూల్ అతి చెత్త ప్రదర్శన ఇదే కావడం గమనార్హం. దీంతో ఇక లాభం లేదనుకున్న ఢిల్లీ కేపిటల్స్ అతడిని వదులుకోవాలని నిర్ణయించింది. ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అతడిని సొంతం చేసుకుంది. డీల్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.
మరోవైపు, ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉండడంతో ఫ్రాంచైజీలన్నీ బిజీగా ఉన్నాయి. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే లాకీ ఫెర్గ్యూసన్, రహమతుల్లా గుర్బాజ్‌లను గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఠాకూర్ (Shardul Thakur)ను సొంతం చేసుకుంది. ఈ ముగ్గురి చేరికతో కేకేఆర్ మరింత బలంగా మారింది.
Updated Date - 2022-11-14T17:54:35+05:30 IST