TRS MLAs Purchase: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్తకోణం
ABN, First Publish Date - 2022-10-31T18:27:34+05:30
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (TRS MLAs Purchase) వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (TRS MLAs Purchase) వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్‌లను తెలంగాణ సర్కార్ ట్యాప్ చేస్తోందంటూ ఈసీకి తంగేళ్ల శివ ప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (Indian Telegraph Act) ప్రకారం సెక్షన్ 5(2) నిబంధనల్లో ఫోన్ ట్యాప్ చేయడం విరుద్ధమని శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా సంచలనం సృష్టిస్తున్న మునుగోడు (Munugode) హంగామా ఒకవైపు కొనసాగుతుం డగానే.. నాలుగు వందల కోట్ల రూపాయలతో నలుగురు అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్‌కు తెర లేచింది. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టుల ఆశ చూపుతూ.. ఢిల్లీలో అధికార బీజేపీకి చెందిన ఒక అగ్రనేతతో ఫోన్‌లో మాట్లాడించే యత్నం చేసిన మధ్యవర్తులను రాష్ట్ర పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే.. పక్కాగా వల పన్ని, మొత్తం బేరసారాలనూ దాదాపు గంటన్నరపాటు ఆడియో, వీడియో రికార్డింగ్ చేసి మరీ ఆధారాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు.. దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందిగానీ.. పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన ఈ సంఘటన హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ (Moinabad) మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌ్‌సలో జరిగింది. ఫోన్ ట్యాప్ వల్లే ఫామ్‌హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2022-10-31T18:27:36+05:30 IST