ABN BreakingNews: తెలంగాణ రాజకీయాల్లో బేరసారాల కలకలం.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వలేసేందుకేనా..?
ABN, First Publish Date - 2022-10-26T22:18:01+05:30
అజీజ్‌నగర్‌లో భారీగా నగదు వెలుగుచూసిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీగా నగదును అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కు తరలించారన్న సమాచారంతో...
రంగారెడ్డి: మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో భారీగా నగదు వెలుగుచూసిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీగా నగదును అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కు తరలించారన్న సమాచారంతో సీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో పోలీసులు సదరు ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు. రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నగదుతో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు పోలీసుల కంటపడినట్టు తెలిసింది. ఈ నగదును బీజేపీ నేతల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు వ్యూహం రచించారని టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. గువ్వల బాలరాజు, హర్షవర్దన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డిలను ప్రలోభ పెట్టేందుకు యత్నించినట్లు టీఆర్‌ఎస్ ఆరోపించింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో బేరసారాలు జరిపారని, కార్లలో ఫామ్‌హౌస్‌కు నగదును తరలించారని వార్తలొస్తున్నాయి. ఈ నగదు పట్టుబడిన వ్యవహారంపై సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించామని, ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని సమాచారం వచ్చిందని సీపీ నిర్ధారించారు.
పట్టుబడ్డ ముగ్గురు కలిసి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోందని, ప్రలోభ పెట్టారన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం ఉందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే నగదుతో పాటు పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు అనుమానంగా ఉందని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఆపరేషన్ జరిపామని సీపీ పేర్కొన్నారు. పీఠాధిపతి రామచంద్రభారతి కేంద్రంగా ప్రలోభాలకు కుట్ర జరిగిందని, ఫరీదాబాద్ నుంచి రామచంద్ర భారతి వచ్చారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మధ్యవర్తిగా డెక్కన్ ఫ్రైడ్ హోటల్ ఓనర్ నందకుమార్ వ్యవహరించారని, తిరుపతి నుంచి సింహయాజులు ఇక్కడికి వచ్చారని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పుకొచ్చారు. రామచంద్రభారతి, సింహయాజులును నందకుమార్ ఇక్కడికి తెచ్చారని సీపీ వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో బేరసారాల ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు ఎమ్మెల్యేలు కాసేపట్లో ప్రగతిభవన్‌కు చేరుకుని మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని, ఎమ్మెల్యేల ముందు అమిత్‌షాతో మాట్లాడేందుకు స్వామీజీల ప్రయత్నించినట్లు సమాచారం. ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో అమిత్‌షా కార్యదర్శితో మాట్లాడినట్లు భోగట్టా. వ్యవహారాన్నంతా గంటన్నర సేపు సీక్రెట్‌గా పోలీసులు రికార్డ్ చేసినట్లు తెలిసింది. ఈ బాగోతానికి సంబంధించిన వీడియో మీడియా ఛానళ్లలో ప్రసారం కావడంతో వ్యవహారం కాస్తా బట్టబయలైంది
Updated Date - 2022-10-26T22:26:30+05:30 IST