మర్రి శశిధర్‌రెడ్డిని బహిష్కరించిన కాంగ్రెస్
ABN, First Publish Date - 2022-11-19T17:34:00+05:30
మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (Marri Shashidhar Reddy)పై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి బహిష్కరించారు.
హైదరాబాద్: మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (Marri Shashidhar Reddy)పై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. పార్టీ నుంచి ఆయనను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ బహిష్కరణ వేటు వేశారు. అయితే శశిధర్‌రెడ్డి బీజేపీ (BJP)లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ (Bandi Sanjay DK Aruna)తో కలిసి శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరే విషయంపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయన.. పలువురు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే అమిత్‌షా (Amit Shah)తో భేటీ సందర్భంగా సంజయ్‌తో తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు చెబుతున్నారు.
రెండు రోజులుగా శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. బండి సంజయ్ ఇతర నేతలో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. పార్టీ మారుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఢిల్లీకి రావడం కొత్తేమీ కాదని, మనవడి స్కూల్ ఫంక్షన్‌లో పాల్గొనడానికి వచ్చానని తెలిపారు. ‘‘నేను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నా. రిటైర్డ్ కాలేదు. నేను ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారు. బీజేపీలో చేరడానికే నేను ఢిల్లీకి వచ్చానన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు’’అని ప్రకటించడం గమనార్హం.
Updated Date - 2022-11-19T18:10:19+05:30 IST