ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dharani: దోపిడీ ధరణి!

ABN, First Publish Date - 2022-12-22T02:55:17+05:30

ధరణి పోర్టల్‌ ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తుంటే... ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది. ధరణిలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, సక్సెషన్‌, నాలా కన్వర్షన్‌, విరాసత్‌ తదితర లావాదేవీల కోసం ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్లాట్‌ ఫీజులు మింగేస్తున్న ప్రభుత్వ పోర్టల్‌

స్లాట్‌ రద్దు చేసుకుంటే తిరిగిరాని డబ్బులు

గత రెండేళ్లలో రూ.వందల కోట్లు హాంఫట్‌

ప్రభుత్వానికి కాసులు.. బాధితులకు కన్నీళ్లు

4 లక్షల దరఖాస్తుల తిరస్కరణ

చాలా మందికి వాపసు కాని ఫీజు సొమ్ము

హెల్ప్‌లైన్‌ నుంచి నో ఆన్సర్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌కు చెందిన ఓ వ్యక్తి 32 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.16,500 ఫీజుతో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. పట్టాదారు ఆధార్‌ సమస్య వల్ల భూమి రిజిస్ట్రేషన్‌ కాలేదు. దీంతో సదరు వ్యక్తి స్లాట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడు. ఇది జరిగి 5 నెలలు అవుతుంది. స్లాట్‌ బుకింగ్‌కు చెల్లించిన ఫీజు ఇప్పటికీ తిరిగి రాలేదు.

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌ ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తుంటే... ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది. ధరణిలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, సక్సెషన్‌, నాలా కన్వర్షన్‌, విరాసత్‌ తదితర లావాదేవీల కోసం ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఏదైనా కారణంతో స్లాట్‌ రద్దు చేసుకుంటే కట్టిన ఫీజు వాపసు రావడం లేదు. స్లాట్‌ రద్దు చేసుకున్న తర్వాత నిమిషాల్లో సంబంధిత వ్యక్తుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులు నెలలు, సంవత్సరాలు గడిచినా జమ కావడం లేదు. ఇలా గత రెండేళ్లలో స్లాట్‌ల రద్దుతో పాటు కలెక్టర్లు రిజెక్ట్‌ చేసిన ఫైళ్ల ద్వారా సర్కార్‌ ఖజానాలోకి వెళ్లిపోయిన ప్రజల సొమ్ము వందల కోట్లలో ఉంటుంది. ఈ డబ్బులు ఏమయ్యాయనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభుత్వమే వాడేసుకుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమ డబ్బుల గురించి బాధితులు హెల్ప్‌లైన్‌ 1800కు ఫోన్‌ చేస్తే వారు చెప్పేది కూడా అవతలి వ్యక్తులు వినడం లేదు. ఇంకా డబ్బులు రాలేదు.. వచ్చాక చెప్తామంటూ ఫోన్‌ పెట్టేస్తున్నారు. స్లాట్‌ బుకింగ్‌లో కొందరు లక్షల్లో, మరి కొందరు వేలల్లో ఫీజులు చెల్లించారు. వాటి కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. ఇంకెంత కాలం ఎదురుచూడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహశీల్దారు, కలెక్టరేట్లలోని ధరణి కార్యాలయాలకు తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదని, కలెక్టర్‌ను, సీసీఎల్‌ఏ కార్యాలయాన్ని ఆశ్రయించినా ఫలితం కనిపించడం లేదని వారు చెబుతున్నారు.

దారి ఖర్చులు, సమయం వృథా అవుతున్నాయని వాపోతున్నారు. రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నామని, తమ డబ్బులకు వడ్డీ చెల్లిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ధరణి రాకముందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్లాట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు వెంటనే చెల్లించేవారు. లేదంటే మరొకరికి బదిలీ చేసే వెసులుబాటు ఉండేంది. ధరణి వచ్చాక ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకుంటే, స్టాంపు డ్యూటీ ఫీజులో 10 శాతాన్ని సర్వీసు చార్జీల కింద కట్‌ చేసుకుని మిగతా డబ్బులను తిరిగి చెల్లిస్తారు. కానీ ధరణిలో రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న తర్వాత అనివార్య కారణాలతో రద్దు చేసుకుంటే చెల్లించిన స్టాంపు డ్యూటీ, ఫీజులు వాపసు రావడం లేదు. ధరణి అందుబాటులోకి వచ్చి రెండేళ్లు దాటింది. దీని ద్వారా 26 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో 22 లక్షల లావాదేవీలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. మిగిలిన 4 లక్షల దరఖాస్తులను రిజెక్ట్‌ చేశారు. వీరిలో స్లాట్‌ను రద్దు చేసుకున్నవారు 1.5 లక్షలకు పైగా ఉన్నారు. మ్యుటేషన్‌, సక్సెషన్‌ కోసం చేసుకున్న దరఖాస్తులు రిజెక్ట్‌ అయినవారు 2.5 లక్షలకుపైగా ఉన్నారు. వీరిలో చాలామందికి తాము చెల్లించిన డబ్బులు రాలేదు. కొన్ని జిల్లాల కలెక్టర్లు మ్యుటేషన్‌, సక్సెషన్‌ లాంటి ఫైళ్లు సక్రమంగా ఉన్నా పూర్తిగా పరిశీలించకుండనే తిరస్కరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ధరణి దోపిడీకి ఉదాహరణలివే!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం తోల్‌కట్ట దగ్గర హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మ్యుటేషన్‌ కోసం ఇప్పటి వరకు మూడుసార్లు ధరణికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసినప్పుడల్లా దాదాపు రూ.11 వేల వరకు ఖర్చయింది. ఇందులో ధరణి, ఆన్‌లైన్‌ నిర్వాహకుని ఫీజులు కలిసి ఉన్నాయి. అయితే మూడుసార్లూ ఆ వ్యక్తి దరఖాస్తును రిజెక్ట్‌ చేశారు. విసుగు చెందిన ఆ వ్యక్తి మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం మానేశారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలో ఓ వ్యక్తి భూమి కొనేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. దీనికి ఫీజు కింద రూ.5 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనివార్య కారణాలతో స్లాట్‌ రద్దు చేసుకున్నాడు. ఇది జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ డబ్బులు తన ఖాతాకు జమ కాలేవని బాధితుడు పేర్కొన్నాడు.

సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి భూమి రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2 లక్షలు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఏదో కారణంతో స్లాట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నాడు. రెండేళ్లు అవుతున్నా చెల్లించిన డబ్బులు తిరిగి రాలేదు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు రూ.1.65 లక్షలు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. స్లాట్‌ను రద్దు చేసుకోగా... పది నెలలైనా డబ్బులు రాలేదు.

కోటలు దాటిన మాటలు

ధరణి పోర్టల్‌ను తెచ్చే ముందుకు ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్‌ ప్రూఫ్‌ వ్యవస్థ అని పేర్కొంది. సిటిజన్‌ ఫ్రెండ్లీ అని, భూ లావాదేవీలకు వన్‌-స్టాప్‌ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపింది. భూమి అమ్మిన వారి నుంచి కొనుగోలు చేసిన వారికి వెంటనే బదిలీ అవుతుందని, కొత్త పాస్‌ పుస్తం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పోస్టులో ఇంటికొస్తుందని వివరించింది. మ్యుటేషన్‌, సక్సెషన్‌ కోసం అర్జీ పెట్టుకుంటే ఇట్టే పని పూర్తవుతుందని, రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుంటే నిమిషాల్లో జరిగిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అధికారులు చెప్పారు. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది.

Updated Date - 2022-12-22T02:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising