Die back : రాష్ట్రంలో మళ్లీ విస్తరిస్తున్న డై బ్యాక్‌

ABN, First Publish Date - 2022-12-19T04:18:13+05:30

ఔషధ గుణాలు దండిగా ఉండే వేప చెట్టుకు మళ్లీ కష్టమొచ్చింది. వరుసగా ఐదో ఏడాది రాష్ట్రంలోని వేప చెట్లకు ‘డై బ్యాక్‌’ తెగులు వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Die back : రాష్ట్రంలో మళ్లీ విస్తరిస్తున్న డై బ్యాక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా ఐదో ఏడాది విస్తృత వ్యాప్తి.. పూర్తిగా ఎర్రబారి ఎండిపోతున్న చెట్లు

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఔషధ గుణాలు దండిగా ఉండే వేప చెట్టుకు మళ్లీ కష్టమొచ్చింది. వరుసగా ఐదో ఏడాది రాష్ట్రంలోని వేప చెట్లకు ‘డై బ్యాక్‌’ తెగులు వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోమోస్పిస్‌ అజాడిరక్తా, ఫుజేరియంగా పేర్కొనే జంట శిలీంధ్రాలను శాస్త్రవేత్తలు డై బ్యాక్‌ తెగులుగా పరిగణిస్తారు. ఇది సోకితే అతి తక్కువ వ్యవధిలోనే ఆకులు, రెమ్మలు, కొమ్మలు, కాండంతో సహా ఎర్రబారి చెట్టు మోడువారిపోతుంది. కర్ణాటక నుంచి రాయలసీమ జిల్లాల మీదుగా దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన డై బ్యాక్‌ తెగులు... క్రమంగా రాష్ట్రమంతటా విస్తరించినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. నిరుడు, ముందటేడు వేప చెట్ల భాగాల్లో ఉండిపోయిన ఈ తెగులు.. తాజా సీజన్‌లో మళ్లీ విజృంభిస్తున్నట్లు గుర్తించారు. గాలి, నేల ద్వారా వ్యాపించే గుణం ఉండడంతో ఈ తెగులు వ్యాప్తిని నిరోధించడం కష్టంగా మారుతోందన్న వాదనలు ఉన్నాయి.

వాస్తవానికి తొలుత ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 2018లో డైబ్యాక్‌ తెగులును గుర్తించారు. జూలై నెల రెండో పక్షంలో అక్కడక్కడ కనిపించే తెగులు.. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య వేగంగా విస్తరిస్తోంది. సుమారు 10 నుంచి 12 రకాల శిలీంధ్రాలు వేప చెట్లకు వ్యాపిస్తున్నప్పటికీ... ప్రధానంగా ఈ రెండు శిలీంధ్రాల ప్రభావమే 90 శాతం ఉంటోంది. ఈ తెగులు తొలుత ఆకులు, తర్వాత రెమ్మలు, కొమ్మలు, కాండానికి సోకి చెట్టును నిర్వీర్యం చేస్తుంది. ఎండాకాలం వచ్చే నాటికి కొన్ని చెట్లు చిగురిస్తున్నా.. చాలా వరకు చనిపోతున్నాయి. ఫలితంగా ఆయుర్వేద ఔషధాల తయారీతోపాటు గ్రామీణుల జీవనశైలిపై నేరుగా ప్రభావం పడుతోంది.

ప్రహసనంగా మందుల పిచికారీ

తెగులు సోకిన వేప చెట్లకు మందుల పిచికారీ చేయడం ప్రహసనంగా మారింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం వేప చెట్లకు శాపంగా మారింది. వేపచెట్లను పీల్చి పిప్పిచేస్తున్న డై బ్యాక్‌ తెగులును నియంత్రించటానికి 2 గ్రాముల ‘కార్బండిజమ్‌’ను గానీ, 2.5 గ్రాముల ‘మ్యాంకోజెమ్‌’ గానీ.. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేపచెట్ల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. అటవీశాఖతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానశాఖలు, గ్రామ పంచాయతీల పాలకవర్గాలు సంయుక్తంగా వేప చెట్ల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీలోని ఫామ్‌లో గత సెప్టెంబరులో వేప చెట్లకు తెగుళ్లు వ్యాపించగానే... మందులు పిచికారీ చేయించారు. దీంతో నాలుగు రోజుల్లోనే వేపచెట్లు చిగురించాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉండే వేప చెట్లకు ఎవరు మందులు స్ర్పే చేయాలనేది సమస్యగా మారింది. ఔషధ గుణాలు ఉండే వేపచెట్లు తెగుళ్ల బారిన పడి దెబ్బతింటుంటే పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేప చెట్లను కాపాడాలని కోరుతున్నారు.

మందుల పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి

నర్సరీల్లో ఉన్న మొక్కలు, చిన్న చెట్లకు శాస్త్రవేత్తలు సూచించిన పురుగు మందులు స్ర్పే చేస్తే పెద్దగా సమస్యలేవీ రావు. కానీ పెద్ద చెట్లకు స్ర్పే చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత స్ర్పే చేసే వ్యక్తులపై మందు ప్రభావం పడకుండా చూసుకోవాలి. లేకపోతే అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తుంది. వేపచెట్లకు సమీపంలో తాగునీటి వనరులు ఉంటే, పురుగుమందులు వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యమయ్యేది కాదు. నాలుగైదు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటితమై చేస్తేనే ఫలితం దక్కుతుంది.

- డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధన విభాగం డైరెక్టర్‌, జయశంకర్‌ వర్సిటీ

Updated Date - 2022-12-19T04:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising