Super Star Krishna: ఎన్టీఆర్‌తో స్నేహం.. వైరం
ABN, First Publish Date - 2022-11-16T04:11:36+05:30
కృష్ణ అజాత శత్రువు. పరిశ్రమలో అందరూ ఆయనకు స్నేహితులే. ఎన్టీఆర్‌తో అయితే.. ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది..
కృష్ణ అజాత శత్రువు. పరిశ్రమలో అందరూ ఆయనకు స్నేహితులే. ఎన్టీఆర్‌తో అయితే.. ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది.. విచిత్రమైనది కూడా. సినిమాల్లో కలిసి మెలసి పనిచేసిన ఇద్దరూ.. ఆ తరవాత పార్టీలపరంగా వేరయ్యారు. కొంతకాలం ఇద్దరికీ మధ్య గ్యాప్ కూడా వచ్చింది. అయుతే వారి స్నేహం ముందు పార్టీలు, విభేదాలు కూడా చిన్నవైపోయాయి. అందుకే గ్యాప్ వచ్చినా.. అది స్వల్పకాలమే. ఎన్టీఆర్, కృష్ణ కలిసి ఆరు సినిమాలు చేశారు. వాటిలో ‘దేవుడు చేసిన మనుషులు’ సూపర్ హిట్. ఎన్టీఆర్ అంటే కృష్ణకు, కృష్ణ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం. అయితే.. వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. మన్యం వీరుడి కథతో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకొంటూ వచ్చారు.
దానికి సన్నాహాలూ మొదలెట్టారు. అయితే అనూహ్యంగా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ప్రకటించి, షూటింగ్ మొదలెట్టారు కృష్ణ. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్... ఆ సినిమా చేయొద్దని కృష్ణకు సలహా ఇచ్చారు. కానీ కృష్ణ వినలేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, మొండి పట్టుదలతో ‘అల్లూరి సీతారామరాజు’ పూర్తి చేశారు. ఆ తరవాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓ తిరుగులేని అధ్యాయంగా నిలిచిపోయి చరిత్ర సృష్టించిందా సినిమా. అల్లూరి అంటే కృష్ణ.. కృష్ణ అంటే అల్లూరి అనేంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు కట్టబెట్టింది. సినిమా చూశాక ఎన్టీఆర్ కూడా కృష్ణని పిలిచి మెచ్చుకొన్నారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు కృష్ణ నుంచి ‘ఈనాడు’ అనే సినిమా వచ్చింది. ‘ఈనాడు’కీ తెలుగుదేశం పార్టీకీ ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే... ‘ఈనాడు’ రాజకీయ చిత్రం. అప్పటి పాలనా విధానాల్ని తూర్పారబట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకత ఏర్పడడానికి ‘ఈనాడు’ ఒకింత కారణమైంది. ఆ వెంటనే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడం టీడీపీ ప్రజంజనం సృష్టించడం తెలిసిన విషయాలే. అలా.. 1983లో తెలుగుదేశం పార్టీ జైత్రయాత్రలో పరోక్షంగా కృష్ణ కారణమయ్యారు. ముందు నుంచీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ సానుభూతిదారుడు. ఇందిరాగాంధీ మరణం ఆయన్ని బాగా కలచి వేసింది. అందుకే కాంగ్రెస్ పార్టీ కండువా భుజాన వేసుకొని, ఆ పార్టీని తెలుగునాట గెలిపించేందుకు తన వంతు కృషి చేశారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఓ సభలో ఎన్టీఆర్ అభిమానులు కృష్ణపై రాళ్ల దాడి కూడా చేశారు. ఆ సమయంలో కృష్ణ కంటికి గాయమైంది కూడా. 1986లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆదేశాలతో.. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పనితీరుపై, నాటి వివాదాంశాలపై ‘నా పిలుపే ప్రభంజనం’ పేరుతో ఓ వ్యంగ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టారు కృష్ణ. ఆ సినిమాలో పాత్రల పేర్లు కోదండరామయ్య (ఎన్టీఆర్), అల్లుళ్లు బాలాజీ (దగ్గుబాటి వెంకటేశ్వరరావు), రాంబాబు (చంద్రబాబు), కోటేశ్వరరావు (ప్రముఖ తెలుగు పత్రికాధిపతి)..
ఇలా ఉంటాయి. కోదండరామయ్య పార్టీ పేరు త్రిలింగ దేశం (తెలుగుదేశం). ఈ సినిమాకు దాసరి నారాయణరావు పదునైన సంభాషణలు రాశారు. ఎన్టీఆర్ రాజకీయాలపై కృష్ణ తీసిన మరో సినిమా ‘సాహసమే నా ఊపిరి’. 1989 మేలో విడుదలైంది. అదే ఏడాది విడుదలైన రాజకీయ చదరంగం సినిమా నేరుగా ఎన్టీఆర్‌ను ఉద్దేశించి తీసింది కాకపోయినా.. గత ప్రభుత్వం, ‘సర్వం నేనే’ పార్టీ అంటూ సూచనప్రాయంగా కొన్ని విమర్శలుంటాయి. అదే ఏడాది అక్టోబరులో వర్మ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘గండిపేట రహస్యం’ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా తీసిందే. ఆ సినిమా ఓపెనింగ్‌లోనే కృష్ణ కనపడి దాదాపు రెండు నిమిషాలపాటు ఆవేశపూరిత ప్రసంగం చేస్తారు. అయితే.. ఒకే పరిశ్రమలో ఉంటూ, కలిసి సినిమాలు చేసిన ఎన్టీఆర్, కృష్ణ.. రాజకీయపరంగా విడిపోవడం ఇద్దరి అభిమానుల్నీ కలచి వేసింది. కానీ, ఏనాడూ ఆ ప్రభావం తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై పడకుండా చూసుకోవడం ఎన్టీఆర్, కృష్ణలకే చెల్లింది. కొన్నాళ్ల తరవాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు కృష్ణ. ఆ తరవాత పార్టీల పరంగానూ ఎలాంటి గొడవలూ జరగలేదు.
Updated Date - 2022-11-16T10:50:53+05:30 IST