హైదరా‘బాద్‌షా’ మాగంటి
ABN, First Publish Date - 2022-01-27T14:11:58+05:30
టీఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాల

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియామకం
గ్రేటర్ నుంచి జిల్లాకు కమిటీ పరిమితం
ఇప్పటికైనా పూర్తి కమిటీలు వేస్తారా..?
మేడ్చల్‌కు శంభీపూర్ రాజు
రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ: టీఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుధవారం జిల్లాల అధ్యక్షులను ప్రకటించారు. గ్రేటర్, శివారు పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు అవకాశం దక్కింది. ఇంతకుముందు టీఆర్‌ఎ్‌సకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి నియామకం ఉండగా.. ఇప్పుడు జిల్లాకే పరిమితం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు గ్రేటర్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్/జిల్లాకు సంబంధించి ఆ తరువాత పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరగలేదు. దీర్ఘకాలం అనంతరం మాగంటి గోపీనాథ్‌కు జిల్లా బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోనూ మాగంటికి సన్నిహిత సంబంధాలున్నాయి.
పూర్తిస్థాయి కమిటీలు..
తెలంగాణ ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్ రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గతంలో మైనంపల్లిని గ్రేటర్ అధ్యక్షుడిగా ప్రకటించినా.. పూర్తిస్థాయి కమిటీల నియామకం జరగలేదు. డివిజన్, బూత్ లెవల్, బస్తీ కమిటీలూ ఏర్పాటు చేయలేదు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పార్టీ ప్లీనరీకి ముందు డివిజన్, బూత్, బస్తీ, వివిధ విభాగాల కమిటీల ఎంపిక చేపట్టారు. డివిజన్‌కు సంబంధించి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర విభాగాల కమిటీల నియామకం కొంత మేర పూర్తయ్యింది. పలు నియోజకవర్గాల్లో డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపికా వివాదాస్పదంగా మారింది. క్షేత్రస్థాయి కమిటీ ఎంపిక అనంతరం.. జిల్లా అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్న ప్రచారం జరిగినా.. హుజురాబాద్ ఉప ఎన్నిక, ఇతర కారణాలతో వాయిదా పడింది. తాజా జిల్లా అధ్యక్షుల ప్రకటనతో కమిటీల ఏర్పాటు మరోసారి చర్చనీయాంశంగా మారింది. డివిజన్, బూత్, బస్తీ, ఇతర విభాగాలకు సంబంధించి పూర్తిస్థాయి కమిటీలతోపాటు.. జిల్లా స్థాయిలోనూ ప్రధాన, అనుబంధ కమిటీల నియమాకం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘకాలంగా పార్టీలో పట్టించుకునే వారు లేక, పదవులు లేక నిరాశలో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు ఇప్పుడైనా తగిన గుర్తింపు దక్కుతుందేమో అని ఆశపడుతున్నాయి. జిల్లా స్థాయిలో ప్రధాన కమిటీతోపాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువజన, మైనార్టీ, బస్తీ తదితర అనుబం ధ కమిటీల ఎంపిక ఉం టుందని, ఇప్పుడే అధ్యక్షుడి నియామకం జరిగినందున ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమ యం పడుతుందని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
మాగంటి తనకు తానే సాటి
బంజారాహిల్స్: హైదర్‌గూడలో జన్మించిన మాగంటి అప్పటి సీఎం దివంగత ఎన్టీరామారావుపై అభిమానంతో 1983లో టీడీపీలో చేరారు. అప్పటి నుంచీ నగర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 1985 నుంచి 92 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987, 1988లో హుడా డైరెక్టర్‌గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో మొదటి సారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2015, 2016 టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం మాగంటి టీడీపీని వీడి కారెక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి విజయం సాధించారు.
పార్టీ కూర్పులో మారిన పంథా
పార్టీ కూర్పులో టీఆర్‌ఎస్ పంథా మార్చింది. గ్రేటర్ నినాదానికి స్వస్తి పలికి హైదరాబాద్‌ను జిల్లాగా గుర్తించింది. గోపీనాథ్‌ను అధ్యక్షుడిగా నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరానికి ముందు నాటి సంస్కృతిని తెరపైకి తెచ్చింది. అప్పట్లో జనాభా తక్కువ ఉండటంతో నియోజకవర్గాల సంఖ్య కూడా పరిమితంగా ఉండేది. 2001లో అప్పటి ప్రభుత్వం నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ గ్రేటర్‌గా గుర్తించింది. అప్పటి నుంచీ పార్టీలు గ్రేటర్ స్థాయిలోనే నియామకాలు చేపట్టేవి. 2007లో పునర్విభజన అనంతరం నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ శివారు నియోజకవర్గాలను రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలుగా గుర్తించాలని అన్ని పార్టీల్లోనూ వాదన మొదలైంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ తొలి అడుగు వేసింది. గ్రేటర్ అధ్యక్షుడి నియామకానికి తిలోదకాలిచ్చింది.
కేసీఆర్ నమ్మిన బంటు ‘శంభీపూర్’
దుండిగల్: మేడ్చల్ జిల్లా పగ్గాలు చేపట్టిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అత్యంత నమ్మిన బంటు. తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్‌ల అడుగులో అడుగై సాగారు. నగరం, శివార్లలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడంలో ప్రధానపాత్ర పోషించారు. వాస్తవానికి ఆయన పేరు సుంకరి రాజు ఆయన తెగువతో శంభీపూర్ గ్రామం వెలుగులోకి వచ్చింది. అనంతరం సుంకరి రాజు శంభీపూర్‌రాజుగా మారారు. 2001లో కేసీఆర్ స్ఫూర్తితో టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2002లో కుత్బుల్లాపూర్ టీఆర్‌ఎస్ యూత్‌వింగ్ కోశాధికారిగా, 2004లో రంగారెడ్డిజిల్లా పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా, 2009 నుంచి 2014 వరకు నియోజకవర్గం టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జిగా, 2015లో ఎమ్మెల్సీగా 2017లో టీఆర్‌ఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2021 నవంబర్ 14న రెండో సారి ఎమ్మెల్సీగా రాజు ఏకగ్రీవం అయ్యారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన జిల్లాను టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటలా మారుస్తానని అన్నారు.
‘రంగారెడ్డి’లో అనుభవానికి ‘పెద్దపీట’
టీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని నియమించడం వెనుక ఆయనకు గతంలో ఉన్న అనుభవమే కారణం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఆయన 15ఏళ్ల పాటు పని చేశారు. జిల్లాలో ఆయనకు మంచి పరిచయాలు ఉండడంతోపాటు టీఆర్‌ఎ్‌సలో సగం మందికి పైగా నేతలు టీడీపీ నుంచి వచ్చిన వారే ఉన్నారు. దీంతో కీలకమైన రంగారెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కిషన్‌రెడ్డికి అప్పగించారు.
Updated Date - 2022-01-27T14:11:58+05:30 IST