హైదరాబాద్‌లో క్యాపిటల్యాండ్ డేటా సెంటర్
ABN, First Publish Date - 2022-12-07T02:41:19+05:30
హైదరాబా ద్‌లో మొత్తం రూ.6,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఇందులో రూ.1,200 కోట్ల పెట్టుబడితో కొత్తగా డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
1,200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
మరో 5వేల కోట్లతో ప్రస్తుత కేంద్రం విస్తరణ
మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబా ద్‌లో మొత్తం రూ.6,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. ఇందులో రూ.1,200 కోట్ల పెట్టుబడితో కొత్తగా డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో దీన్ని ఏర్పాటుచేస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆఫీస్ విస్తరణ పనుల కోసం మరో రూ.5వేల కోట్లను వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డేటా సెంటర్ ఏర్పాటు, పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం 2.50 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్... ఐదేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఈవో సంజీవ్ దాస్‌గుప్తా తెలిపారు. అంతేగాక ప్రస్తుతం నగరంలో తమకున్న 60లక్షల చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాల్లో రూ.5వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. నవీ ముంబైకి చెందిన గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ డెవల్‌పమెంట్ సైట్‌ను గతేడాది కొనుగోలు చేయడం ద్వారా తమ కంపెనీ భారత్‌లో డేటా సెంటర్ మార్కెట్‌లోకి ప్రవేశించిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్ రెండొదని తెలిపారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే తాము ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని సీఈవో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్థి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటన్నారు. ఇతర ఐటీ, అనుబంధ రంగాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
Updated Date - 2022-12-07T02:41:20+05:30 IST