Kaikala Satyanarayana: స్వర్గానికి యముడు
ABN, First Publish Date - 2022-12-24T02:57:56+05:30
‘ధర్మ పరిరక్షణా దక్షుండ.. సకల పాప శిక్షణా దక్షుండ..’ అంటూ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో యమధర్మరాజుగా చిరస్థాయిగా నిలిచిపోయిన నవరసనటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (87) ఇక లేరు!
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇక లేరు
అనారోగ్యంతో స్వగృహంలో తుదిశ్వాస
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
మూడు తరాల ప్రేక్షకుల
అభిమానాన్ని పొందారు: సీఎం కేసీఆర్
ఎన్టీఆర్‌తో కలిసి 101 చిత్రాలు
యముడిగా ఎన్నో చిత్రాల్లో కైకాల
భయపెట్టి బెంబేలెత్తించే రౌద్రం చిన్నబోయింది వీరావేశంతో విరుచుకుపడే వీర రసం నీరసపడింది!వెన్నులో వణుకు పుట్టించే బీభత్సం బేలగా మారింది!భయకంపితులను చేసే భయానక రసం భావ రహితమైంది!అందరినీ నవ్వించే హాస్యం కన్నీరు పెడుతోంది!గుండెలను పిండేసే కరుణకే గుండెలు పిండేసినట్టయింది!ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టించే అద్భుతం నిశ్చలంగా మారింది!
ప్రశాంతతకు ప్రతిరూపమైన శాంతికే శాంతి కరువైంది సరససల్లాపాలలో ఓలలాడించే శృంగారం రసరహితమైంది!
..నవ రసాలూ ఇప్పుడు కన్నీటి సాగరంలో మునిగిపోయాయి నవరస నటనా సార్వభౌముడు ఇక లేడని! తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కైకాల కన్నుమూశాడని! 700కు పైగా చిత్రాలతో వెండి తెరపై విశ్వరూపం చూపించిన సత్యనారాయణ రూపం ఇక ఎప్పటికీ కనిపించదని!!
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ధర్మ పరిరక్షణా దక్షుండ.. సకల పాప శిక్షణా దక్షుండ..’ అంటూ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో యమధర్మరాజుగా చిరస్థాయిగా నిలిచిపోయిన నవరసనటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (87) ఇక లేరు! క్రూరమైన విలనీతో తనదైన శైలి వికటాట్టహాసంతో రౌద్ర, భయానక, బీభత్స రసాలను.. క్యారెక్టర్ నటుడిగా వీర, శోక, కరుణ, అద్భుత, శాంత, శృంగార రసాలను.. అలవోకగా పోషించి, మెప్పించిన ఆ లెజెండరీ నటుడు కన్నుమూశారు. అనారోగ్యంతో చాలాకాలంగా బాధపడుతున్న ఆయన.. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 700కు పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో చాలాకాలంగా వెండితెరకు దూరమై ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. గత ఏడాది అక్టోబరు చివరి వారంలో బాత్‌రూమ్‌లో కాలు జారి కింద పడడంతో ఆయన మోకాలికి గాయమైంది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయనకు కొవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స అనంతరం ఆయన ఇంటికి వచ్చినా.. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.
అప్పట్లో ఆయన పరిస్థితి విషమించినా వైద్యులు ఎంతగానో శ్రమించి ఆయన ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఏడాది జనవరిలో ఆయన కోలుకున్నా.. ఆ ప్రభావం ఆయనపై తీవ్రంగా పడింది. సత్యనారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. కైకాల మరణవార్త తెలియగానే సీఎం కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సత్యనారాయణ భౌతిక కాయానికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కైకాల అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని.. ఈమేరకు శనివారం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సినీ పరిశ్రమకు తీరని లోటు
సత్యనారాయణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఉండగా ఆయనతో కొంత కాలం కలిసి పనిచేసిన అనుభవం ఉంది.
- సీఎం కేసీఆర్
కృష్ణా జిల్లాలో పుట్టి..
కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో లక్ష్మీనారాయణ, సీతారావమ్మ దంపతులకు తొలిసంతానంగా జన్మించారు. 1951 వరకూ అమ్మమ్మ, తాతయ్య కంభంమెట్టు రామయ్య, నాగమ్మ వద్దనే పెరిగారు. 1950లో తన స్నేహితులతో కలిసి కౌతవరంలో ‘ప్రేమలీల’ అనే నాటకంలో విలన్‌గా నటించారు. అందులో తన నటనకు ప్రశంసలు రావడంతో ప్రభాకర నాట్యమండలి పేరుతో సొంతంగా నాటక సంస్థను నెలకొల్పి.. ‘కులంలేని పిల్ల’, ‘పల్లెపడుచు’, ‘ఎన్.జి.ఓ గుమస్తా’, ఎవరు దొంగ’ తదితర నాటకాలు ప్రదర్శించేవారు. సినిమాల్లో నటించాలనే కోరికతో 1956లో మద్రాసుకు వెళ్లారు. అక్కడ వేషాల వేటలో 18 నెలలు గడిచిపోయాయి. ఏ సినిమా ఆఫీసుకు వెళ్లినా.. ‘బాగున్నావు.. నీకు మంచి భవిష్యత్ ఉంది’ అనేవారే తప్ప ఒక్క వేషం ఇచ్చినవారే లేరు. విసిగి వేసారిన సమయంలో నిర్మాత డి.ఎల్.నారాయణ ఏకంగా సత్యనారాయణకు ‘సిపాయికూతురు’ చిత్రంలో హీరో వేషం ఇచ్చి, భుజం తట్టారు. రెండో చిత్రం.. ‘సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి’(1960). ఆ తర్వాత ఎవరూ హీరో వేషాలు ఎవరూ ఇవ్వకపోవడంతో దర్శకుడు విఠలాచార్య సలహాపై ‘శ్రీ కనకదుర్గ పూజా మహిమ’ (1960)లో తొలి సారిగా విలన్ పాత్ర పోషించారు సత్యనారాయణ ఇక అక్కడినుంచి సినిమాల మీద సినిమాలు... దాదాపు అన్నీ విలన్ వేషాలే. దరిమిలా ఆయన అప్పటికే తెలుగు తెరపై విలన్లుగా పాతుకుపోయినవారందరినీ దాటుకుని ముందుకు దూసుకుపోయారు. 1970 నుంచి 1990 దాకా.. దాదాపు రెండు దశాబ్దాలపాటు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒక వెలుగు వెలిగారు. శారద, నిప్పులాంటి మనిషి, మోసగాడు, తాయారమ్మ బంగారయ్య, వేటగాడు, దేవుడు చేసిన మనుషులు, ముందడుగు, మొరటోడు, యమగోల, యమలీల.. ఇలా ఆయన సినీ కెరీర్ అనే కీర్తికిరీటంలో ఎన్నో కలికితురాయిలు!!
సాత్విక అభినయంలోనూ..
కరడు గట్టిన విలన్ పాత్రలే కాదు కంట కన్నీళ్లు తెప్పించే సాత్విక పాత్రలు కూడా అద్భుతంగా పోషించి, ప్రేక్షకుల అభినందనలు అందుకొన్నారు సత్యనారాయణ. జోరుగా విలన్ వేషాలు వేస్తున్న రోజుల్లోనే.. ‘ఇది కూడా చెయ్యి’ అంటూ ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో సాత్విక పాత్ర వేయించారు ఎన్టీఆర్. అలాగే ‘శారద’ చిత్రంలో కూడా సత్యనారాయణ తన నటనతో ఏడ్పించేశారు. ‘దేవుడు చేసిన మనుషులు’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘ముగ్గురు మూర్ఖులు’ ‘ముందడుగు’ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. తెలుగులోనే కాదు.. ఇతర భాషా చిత్రాల్లో కూడా సత్యనారాయణ మెరిశారు. సుభా్‌షఘయ్ దర్శకత్వంలో వచ్చిన ‘కర్మ’ సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. ఇలా వందలాది విభిన్న పాత్రలు పోషించి, చరిత్ర సృష్టించారు!
రాజకీయాల్లో..
న్యూఢిల్లీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అద్భుతమైన నటనా ప్రతిభతో సినీరంగంలో ఒక వెలుగు వెలిగిన కైకాల సత్యనారాయణ.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఎన్టీఆర్ ఆయనకు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1996 మే 15న ఏర్పడ్డ 11వ లోక్‌సభలో మే 22న సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 11వ లోక్‌సభ 1996 మే 15 నుంచి 1997 డిసెంబరు 4 దాకా.. కేవలం 18 నెలలు మాత్రమే సాగింది.
ధూంతత... ధూంతత!!
ఆకాశం రంగేంటి..?మామూలుగా అయితే నీలంగా ఉంటుంది.పొద్దు పొడిస్తే ముద్దబంతిలా విరబూస్తుందిసూర్యుడొస్తే... ఇంకో రంగు.మబ్బేస్తే నల్లగా... వానొస్తే ఇంద్రధనస్సేగా!కైకాల సత్యనారాయణా అంతే. ఆ మాటకొస్తే... హరివిల్లులో ఏడే రంగులు. ఆయనకు రెండెక్కువ. నవరస భరితం. కామెడీ చేయాలా? సత్తిపండున్నాడు.విలనిజమా? ఆయన చూసుకొంటాడు.సపోర్టింగు రోలా..? అందులో కింగు.
రౌద్రమా.. క్రౌర్యమా.. శృంగారమా... ఇవన్నీ కాకుండా పౌరాణికమా..? ‘ఇందుగలడు, అందులేడన్న సందేహంబు వలదు..’ అన్నీ ఆయనే. అన్నిటా ఆయనే. ప్రతి నటుడికీ ఓ స్పెషలైజేషన్ అంటూ ఉంటుంది. కైకాలది సెంట్రలైజేషన్. హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, భయానకం, బీభత్సం, అద్భుతం, వీరం.. తెలుగుతెర ఈ పేటెంటు హక్కులన్నీ ఒకరి పేర రాసేసింది. ఆ పేరు...
‘కైకాల సత్యనారాయణ’.
ఎస్వీఆర్ తరవాత ఆ పోస్టు ఖాళీ అయిపోతే... కనీసం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎంతటి నటుడికైనా సరే.. గుండె ధైర్యం మొండుగా ఉండాలి. సత్తిపండు ఏకంగా ఆ సీటులోనే కూర్చుండిపోయారు. అదీ... కైకాల కెపాసిటీ. ‘ఎస్వీఆర్ తరవాత ఎవరు..?’ అంటూ చిత్రసీమ అటూ ఇటూ దిక్కులు చూళ్లేదు. నేరుగా కైకాల కళ్లలోకి చూసింది. ‘యస్.. ఐయామ్ హియర్’ అంటూ ఆ పిలుపు అందుకొన్నారు కైకాల. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున... తరాలు మారాయి. హీరోలు మారారు. వాళ్ల ముందు విలన్‌గా నిలబడి.. తెగబడి.. కలబడగలిగే ధైర్యం మాత్రం కైకాలదే. ఆరడుగుల ఎత్తు.. చింతనిప్పుల్లాంటి కళ్లు, పొడుచుకొచ్చిన కొమ్ముల్లాంటి మీసాలూ, ‘ఖంగ్’మనే కంఠం... వీటితో ఎవరైనా సరే.. విలనిజం పండిచేస్తారేమో..? కానీ కైకాల.. వీటితోనే కామెడీ చేశాడు. నవ్వించాడు.. మెప్పించాడు. కైకాల కామెడీ ఎప్పుడూ సటిల్డ్‌గా ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అసవరం ఉండేది కాదు. ఆయన ముద్దు ముద్దు మాటలు, అమాయకపు చూపు చాలు.. ‘హాస్యం’ పాదరసంలా ప్రవహించేది. ‘ఖైదీ నం.786’లో పాపారాయుడు గుర్తున్నాడా...?
‘తోటకూర.. గోంగూర.. బచ్చలకూర.. కొత్తిమీర.. కరేపాకో..’ అంటూ సుబ్బులు వేషంలో సిల్క్‌స్మిత గంపెత్తుకొస్తుంటే, మెలికలు తిరిగిపోయిన వైనం... ఎంత సరదాగా ఉంటుందో...?
‘వేటగాడు’లో నెత్తిన హ్యాటు దగ్గర్నుంచి, కాలికి బూటు వరకూ ఒకే రంగుతో మెరిసిన కైకాల గెటప్పే వింతగా ఉంటుంది. చివర్లో.. రావుగోపాల్రావు ‘ప్రాసాట’కు బలైపోయి.. ‘వద్దునాన్నో.. బుద్ది తక్కువై అడిగా’ అంటూ పొర్లుదండాలు పెడుతున్నప్పుడు పొంగి పొరలి నవ్వుతాం!
మొన్నటికి మొన్న ‘మురారి’లో పక్క పాపిట దువ్వుకొన్న సత్తిపండుని చూస్తే.. ‘మనిషంటే ఇలాక్కదా ఉండాలి. ఇంత స్వచ్ఛంగా కదా.. నవ్వాలి’ అని అనిపించకపోతే... ప్రేక్షకులుగా మనం ఫెయిల్ అయినట్టే. ‘డబ్బుకులోకం దాసోహం’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో ఆయన చేసిన తాగుబోతు పాత్రలు చూస్తే... థియేటర్లో ప్రేక్షకులకే మైకం కమ్మేస్తుంది. ‘మోసగాడు’లో కానిస్టేబుల్ రామచంద్రయ్య ‘కరుణ’ రసానికి కేరాఫ్ అడ్రస్. మనిషితనం, అందులోని మెతక గుణం... అర్థమవుతాయి. ఇదంతా ఒక ఎత్తు... ‘మొరటోడు’లో రాజు... మరో ఎత్తు! అసలు ఆ గుండెలో జాలి, కరుణ, దయ ఉన్నాయా? అనిపించేంత విశ్వరూపం. దాన్ని రౌద్రమనాలా? బీభత్సమనాలా? నవరసాలకు మరోటి జోడించో, అన్నీ కలిపో మరో పేరు పెట్టుకోవాలా..?
అన్నంటే... ‘అన్నయ్య’ంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్. వెండి తెరపై ‘బ్రదర్’ సెంటిమెంట్‌కి ఆయనే మూల విరాట్. కానీ.. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శారద’ చూస్తే... ‘కైకాల కూడా మంచి అన్నయ్యే’ అనిపించకమానదు. అన్నయ్యంటే ఎలా ఉంటాడో.. ఎలా ఉండాలో చెప్పిన పాత్ర అది. అక్కడ మరోసారి కైకాల ప్రదర్శించిన శాంత, కరుణ రస ప్రావీణ్యం చూసి ‘అద్భుతః’ అనాల్సిందే.
పౌరాణిక పాత్రలు చేయడం అందరి వల్లా కాదు. అందుకు ఓ అర్హత కావాలి. ముఖ్యంగా దుర్యోధనుడంటే.. అందరూ హడలిపోతారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఆ పాత్రల్ని ఉతికి ఆరేశారు. వారిలా మరొకరు గద పట్టుకోవాలంటే.. గుండె దడదడలాడుతుంది. అలాంటిది... ‘కురుక్షేత్రం’లో కైకాల సత్యనారాయణ రూపంలో కొత్త దుర్యోధనుడు పుట్టుకొచ్చాడు. అది కూడా.. ‘దాన వీరశూరకర్ణ’కు దీటుగా. ఎందుకంటే.. ఎన్టీఆర్ ‘దానవీరశూరకర్ణ’, కృష్ణ ‘కురుక్షేత్రం’ సినిమాలు రెండూ ఒకేసారి పోటాపోటీగా రూపుదిద్దుకొన్నాయి. ‘దాన వీర శూరకర్ణ’లో ఎన్టీఆర్ దుర్యోధనుడైతే.. ‘కురుక్షేత్రం’లో కైకాల. అంతేనా..? ‘దానవీర..’లో ఎన్టీఆర్‌కి పోటీగా భీముడి పాత్ర పోషించింది మళ్లీ.. సత్యనారాయణే. అక్కడ భీముడిగా.. ఇక్కడ దుర్యోధనుడిగా రెండింట్లోనూ మెప్పించి ‘శభాష్’ అనిపించుకొన్నాడు.
జానపద కథలో విలన్ అంటే అప్పట్లో రాజనాల పేరే వినిపించేది. దాన్ని కూడా కైకాల ఆక్రమించుకొన్న వైనం ఓసారి గుర్తుంచుకోవాల్సిందే. ‘రాజకోట రహస్యం’తో కైకాల.. రాజనాలని మించిపోయే నటనా విన్యాసం ప్రదర్శించాడు. దాంతో.. రాజనాలకు కూడా ప్రత్యామ్నాయం దొరికేసినట్టైంది. ‘ఉమ్మడి కుటుంబం’లో అన్నయ్యగా ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పట్లో.. గుమ్మడి, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి లాంటి అనుభవజ్ఞులు చేయాల్సిన పాత్ర అది. అలాంటి మొండి పాత్రల్ని సైతం మెడలు వంచి సవారీ చేశాడు కైకాల. ‘జంజీర్’ని తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’ పేరుతో రీమేక్ చేశారు. ప్రాణ్ చేసిన షేర్ ఖాన్ పాత్ర చేయగల దమ్ము.. దైర్యం ఇక్కడ కైకాలకే ఉన్నాయని నమ్మి.. ఆ బాధ్యత అప్పగిస్తే... ‘ప్రాణ’ప్రతిష్ట చేసి, ఆ పాత్రకు మరింత వన్నె తెచ్చారు సత్యనారాయణ. ఇక యముండ.. అంటే ఈ తరానికి గుర్తొచ్చేది.. కచ్చితంగా సత్యనారాయణే.
‘ధర్మ పరిరక్షణా దురంధరుండ.. సకలపాప శిక్షణా దక్షుండ..’’.. అంటూ యమధర్మరాజు యమలోకంలో అడుగులేస్తుంటే... ‘యముండ..’ అని ఆయన గర్జిస్తే.. థియేటర్లు దద్దరిల్లాయి. ‘యమగోల’ నుంచి ‘యమలీల’ వరకూ యముడిగా కైకాల లీలలు చెప్పతరమా? ‘యమలీల’లో హిమక్రీములు లాగించేసిన తీరు.. నాటు బాంబుల్ని సున్నుండల్లా చేసి ఆరగించిన సీనూ.. వన్స్‌మోర్ల జాతరలు చేయించలేదూ? అంతేనా..? ‘సెహబాసులే.. నర నారీమణీ..’ అంటూ సత్యనారాయణ స్వీటు స్టెప్పులేసిన వైనాలు మరచిపోతమా..? ‘ఘటోత్కచుడు’ అవతారమెత్తి.. శత్రుమూకని చల్లాచెదురు చేసినప్పుడు ఆ వీరత్వాన్ని కళ్లల్లో నింపుకోకుండా ఉండగలమా..?
ఫలానా పాత్ర నేను పోషించాను.. అని చాలామంది నటులు చాలా గొప్పగా చెప్పుకొంటారు. నన్ను కైకాల పోషించారు... అని కొన్ని పాత్రలే గర్వంగా చెప్పుకొంటాయి. అదీ.. నటుడిగా ఆయన స్థాయి. ఏ సినిమాకీ, ఏ పాత్రకీ.. ఎప్పుడూ, ఎక్కడా నటుడిగా కైకాల సత్యనారాయణ తక్కువ చేయలేదు. ‘ఈ పాత్ర ఈయనెందుకు చేశాడు?’ అనిపించుకోలేదు. ‘చేస్తే.. సత్తిపండులా చేయాల్రా’ అనుకొన్నారంతే! ఏ నటుడికైనా... చదవాల్సిన పేజీలు కొన్నుంటాయి. తెలుసుకోవాల్సిన విషయాలు మిగిలే ఉంటాయి. కానీ... సత్యనారాయణ తన నటనా జీవితంలో ఆఖరి పేజీ వరకూ చదివేశారు. ఈతరం నటులు తెలుసుకోవాల్సిన చాలా విషయాలు నేర్పించి వెళ్లారు. ఎంతటి నటుడైనా, ఎంతటి మహోన్నతుడైనా.. జీవిత రంగస్థలంలో పాత్ర ముగించాల్సిందే. ఈరోజు సత్యనారాయణ అనే అంకానికి ‘శుభం’ కార్డు పడింది. కానీ.. ఆయన డైలాగులు, పాత్రలు, హావభావాలు, భావావేశాలు.. అన్నీ ఇప్పటికీ ఎప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. వెండి తెరకు మరో సత్యనారాయణ రావడానికి ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. మరి పుడతాడా మరో సత్తిపండు..?
యముడిగా ఎన్నో చిత్రాల్లో..
తనకన్నా ముందు ఎస్.వి.రంగారావు వంటి నటులు యుముడి పాత్రలు పోషించినా, తన నటనతో ఆ పాత్రకు వన్నె తెచ్చారు సత్యనారాయణ. యముడి పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ‘యమగోల’ చిత్రంలో ‘ధర్మపరిపాలనా రక్షకుండా.. యముండ’ అంటూ సత్యనారాయణ ప్రదర్శించిన నటన ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ‘యమగోల’తో ప్రారంభించి ‘యముడికి మొగుడు’, ‘పిట్టల దొర’, ‘యమలీల’, ‘యమగోల మళ్లీ మొదలైంది’ చిత్రాల్లో ఆయన యముడిగా నటించారు. యమధర్మరాజు పాత్రలో ఆయన నటించిన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్ భవ’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రేక్షకుల అభిమానమే అవార్డు
ఉత్తమ నటుడిగా, విలన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న సత్యనారాయణకు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలేవీ రాకపోవడం లోటే! ఇదే మాట అడిగితే.. ‘‘ఎస్వీ రంగారావు, సావిత్రి, అంజలీదేవికే ఇవ్వలేదు. నన్ను కూడా వాళ్ల లిస్టులోనే వేసి.. అవార్డు ఇవ్వలేదనిపిస్తోంది’’ అనేవారాయన. అయితే, చిత్రపరిశ్రమకు గాను ఎన్నో సేవలు అందించినందుకుగాను తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ పొందారు. 2011లో అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును పొందారు. 2018లో ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
ఎన్టీఆర్‌తో 101 చిత్రాలు
ఆ రోజుల్లో అగ్ర కథానాయకుడైన ఎన్టీఆర్ పోలికలు ఉండడం సత్యనారాయణకు బాగా కలిసొచ్చింది. దీంతో ఎన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘రాముడు- భీముడు’ సహా మరో ఆరు చిత్రాల్లో ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించే అవకాశం ఆయనకు వచ్చింది. సత్యనారాయణను సొంత తమ్ముడిగా భావించి.. ఎన్టీఆర్ ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. తన సినిమాల్లోనే కాకుండా ఇతర నిర్మాతలకూ చెప్పి మంచి వేషాలు వచ్చేలా చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే ‘శ్రీకృష్ణావతారం’ చిత్రంలో దుర్యోధనుడి పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు సత్యనారాయణ. వీరిద్దరూ కలిసి 101 సినిమాల్లో నటించారు. ఇందులో సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పోలికలు తనలో కొన్ని ఉండడం సత్యనారాయణ అదృష్టంగా భావించేవారు. ‘అన్నయ్యా’ అంటూ వినయవిధేయతలతో మెలిగేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’.
నిర్మాతగా..
సత్యనారాయణ సోదరుడు నాగేశ్వరరావుకు నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనే కోరిక ఉండేది. అందుకే ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ‘గజదొంగ’ చిత్రాన్ని తొలిసారిగా తన సమర్పణలో నిర్మించారు సత్యనారాయణ. ఈ చిత్రానికి నాగేశ్వరరావు, చలసాని గోపి నిర్మాతలు. ఆ తర్వాత రమా ఫిల్మ్స్ సంస్థను నెలకొల్పి కృష్ణ, శోభన్‌బాబులతో ‘ఇద్దరు దొంగలు’, తన కుమారులు లక్ష్మీనారాయణ, రామారావు నిర్మాతలుగా చిరంజీవితో ‘చిరంజీవి’ చిత్రాలు నిర్మించారు. శోభన్‌బాబుతో ‘అడవిరాజా’, చిరంజీవితో ‘కొదమసింహం’, అక్కినేనితో ‘బంగారుకుటుంబం’, బాలకృష్ణతో ‘ముద్దుల మొగుడు’ చిత్రాలు నిర్మించారు.
అంతమంది కలయిక.. కైకాల!
నటుడిగా సత్యనారాయణ ఎంత గొప్పవారో చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఒకసారి బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సుభా్‌షఘాయ్ సత్యనారాయణను రచయిత కమలేష్ పాండేకు పరిచయం చేస్తూ ‘అశోక్‌కుమార్, అమ్రి్‌షపురి, అంజాద్‌ఖాన్, ప్రాణ్, ప్రేమ్‌నాథ్, సంజీవ్‌కుమార్, షమ్మీకపూర్.. వీరందరూ కలసి ఒకే నటుడిగా రూపొందితే ఈయనవుతారు’ అన్నారు. ఎంత గొప్ప ప్రశంసో కదా!!
ధూంతత... ధూంతత!!
-సినిమా డెస్క్
Updated Date - 2022-12-24T04:28:15+05:30 IST