సివిల్ సప్లయీస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
ABN, First Publish Date - 2022-10-26T00:49:11+05:30
పౌర సరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
తంగళ్లపల్లి, అక్టోబరు 25: పౌర సరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ శివారులోని పౌర సరఫరాల శాఖ గోదాంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అధికారులకు, పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మొదటి కంపార్టుమెంట్‌లో చెలరేగిన మంటలు పక్కన ఉన్న కంపార్టుమెంట్‌కు వ్యాపించకుండా ముందస్తుగా ఎక్స్‌కావేటర్‌లతో రెండు కంపార్టుమెంట్‌ల మధ్య లింక్‌ను కూల్చి వేశారు. దీంతో రెండో కంపార్టుమెంట్‌లో ఉన్న 5 లక్షల గోనె సంచులకు మంటలు వ్యాపించకుండా నష్టాన్ని నివరించారు. మొదటి కంపార్టుమెంట్‌లో నిల్వ ఉన్న 7 లక్షల డ్యామేజ్డ్ గోనె సంచులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 24 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్గి రాజుకుంటూనే ఉంది. గోదాం చుట్టూ గోడలను బద్దలు కొట్టి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రెండు అగ్నిమాపక వాహనాలతోపాటు 5 ఎక్స్‌కావేటర్‌లు, హమాలీలు మంటలను ఆర్పుతున్నారు. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డి సిబ్బందితోపాటు స్థానిక సర్పంచ్ భైరి శ్రీవాణి రమేశ్ పంచాయతీ సిబ్బంది మంటలు ఆర్పేందుకు సహకరాన్ని అందించారు.
రూ.3 కోట్ల మేర నష్టం
చిల్లులు పడిన 7 లక్షల గోనె సంచులు అగ్ని ప్రమాదంలో కాలి పోయినట్లు అధికారులు చెబుతున్నారు. చిల్లులు పడిన సుమారు 12 లక్షల గన్నీ సంచులు గోదాములోని రెండు కంపార్టుమెంట్లలో నిల్వ చేశారు. మొదటి కంపార్టుమెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 7 లక్షల గన్నీ సంచులు దగ్ధమయ్యాయి. రూ.కోటి నష్టం వాటిల్లింది. 2014 సంవత్సంరం నుంచి చిల్లులు పడిన బ్యాగులు నిల్వ చేస్తున్నారు. దీనికి టెండర్ నిర్వహించి విక్రయించాల్సి ఉంది. ఈలోగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాం పైకప్పు పూర్తిగా కాలి పోవడంతో గోడలను సైతం కూల్చివేశారు. దీంతో గోదం నష్టం సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గోనె సంచుల దగ్ధంతోపాటు దెబ్బతిన్న గోదాం నష్టం మొత్తం సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుంది. గోదాంతోపాటు గోనెసంచులకు సంబంధించి ఇన్సూరెన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2022-10-26T00:49:15+05:30 IST