సబ్సిడీ గొర్రెలేవి?
ABN, First Publish Date - 2022-11-23T00:23:43+05:30
సబ్సిడీ గొర్రెల పథకం ఆశావహులకు అందని ద్రాక్షగా మారుతున్నది. మూడేళ్ల క్రితమే పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ గొర్రెలను పంపిణీ చేయకపోవడంతో పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకున్నారు.
- మార్గదర్శకాలు జారీ చేయని ప్రభుత్వం
- ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సబ్సిడీ గొర్రెల పథకం ఆశావహులకు అందని ద్రాక్షగా మారుతున్నది. మూడేళ్ల క్రితమే పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటికీ గొర్రెలను పంపిణీ చేయకపోవడంతో పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకున్నారు. నాలుగు మాసాల క్రితం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీపీ) ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ముందుకు రావడంతో గొల్ల, కుర్మలకు మళ్లీ ఆశలు రేకెత్తాయి. ఇప్పటి ధరలకు అనుగుణంగా యూనిట్ ధరలను పెంచిన ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దశల వారీగా లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా ధనాన్ని రెండు మాసాల నుంచి చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 1200మందికి పైగా లబ్ధిదారులు వాటా ధనాన్ని డీడీల రూపంలో చెల్లించి గొర్రెలను ఎప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో సబ్సిడీ గొర్రెల పథకాన్ని తీసుకవచ్చింది. ఈ పథకం కింద ప్రాథమిక గొర్రెల సహకార సంఘంలో సభ్యులై ఉండి, 18 ఏళ్లు నిండిన వారందరికీ యూనిట్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 21,143 మంది లబ్ధిదారులను గుర్తించగా వీరందరికీ రెండు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గ్రామసభలు నిర్వహించి డ్రా తీసింది. డ్రాలో పేర్లు వచ్చిన వారందరికీ అదే ఏడాది సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి తర్వాత ఏడాది ఇస్తామని ప్రకటించారు.
ఫ ఊరిస్తున్న రెండో విడత
జిల్లాలో 2018లో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కానీ రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చారు. నిధుల కొరత వల్ల పథకాన్ని ముందుకు తీసుక వెళ్లలేదు. అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో మాత్రం సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. జూలై నెలలో ఎన్‌సీడీసీ నుంచి ప్రభుత్వానికి రుణం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా 3.50లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక పొట్టేలుతో పాటు 20 గొర్రె పిల్లలను అందజేస్తారు. దీని విలువ మొదట 1,25,000 రూపాయలుగా నిర్ణయించారు. 75 శాతం సబ్సిడీ పోనూ 25 శాతం లబ్ధిదారుడి వాటా కింద 31,250 రూపాయలు చెల్లించారు. పథకాన్ని ప్రవేశ పెట్టి ఐదేళ్లు గడవడంతో గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్ వ్యయాన్ని 1,75,000కు పెంచారు. లబ్ధిదారుడి వాటా కింద 43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఒక విత్తన పొట్టేలు ధర 7 వేల నుంచి 10 వేలకు, పెద్ద గొర్రె పిల్లల ధర 5,200 నుంచి 7,400 రూపాయలకు పెంచారు. లబ్ధిదారుడి వాటా సొమ్మును గతంలో డీడీల రూపంలో ఇచ్చారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన అధికారులు ఈ-లాభ్ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి రిజిష్టర్ చేశారు. తద్వారా వచ్చే వర్చువల్ ఖాతాకు లబ్ధిదారులు తమ సొమ్మును ఆర్‌టీజీఎస్ ద్వారా గానీ, నెఫ్ట్ ద్వారా గానీ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. రెండవ విడతలో 10,543 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటి వరకు 1200 మంది వరకు తమ వాటా సొమ్మును చెల్లించారు. అందరు ఒకేసారి గాకుండా దశల వారీగా లబ్ధిదారుడి సొమ్మును చెల్లించే విధంగా కలెక్టర్ సంగీతసత్యనారాయణ గ్రామాల వారీగా డ్రాతీశారు. ఆ మేరకు లబ్ధిదారులు వాటా ధనాన్ని చెల్లిస్తూ వస్తున్నారు. ఈ ప్రక్రియ రెండు మాసాల నుంచి కొనసాగుతున్నది. గొర్రెలను కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌ను విడుదల చేయకపోగా, మార్గదర్శకాలను సైతం విడుదల చేయకపోవడంతో డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో మునుగోడు ఉపఎన్నిక రావడంతో తేరుకున్న ప్రభుత్వం లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేసే సమయం లేకపోవడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును జమ చేసింది. దీనిపై వివిధ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ ఆదేశాల మేరకు ఆ సొమ్మును ప్రభుత్వం తిరిగి లాక్కున్నది. ఆ తర్వాత లబ్ధిదారులకు నగదు ఇవ్వాలా, గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలా అనే విషయమై ఎటూ తేల్చలేక పోతున్నది. అసలు గొర్రెలను పంపిణీ చేస్తుందా, లేదా అనే ఆందోళనలో లబ్ధిదారులు ఉన్నారు.
Updated Date - 2022-11-23T00:23:45+05:30 IST