‘ఓ కేటీఆర్ దొర.. నిన్ను త్వరలో ఓడిస్తాం’.. ఎల్లారెడ్డిపేటలో కలకలం
ABN, First Publish Date - 2022-12-20T18:15:49+05:30
టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (BRS)గా మార్చారు.. మా విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీ చదువద్దా? ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మోసకారి మంత్రి కేటీఆర్.
ఎల్లారెడ్డిపేట: ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (BRS)గా మార్చారు.. మా విద్యార్థులు ఇంటర్ నుంచి డిగ్రీ చదువద్దా? ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన మోసకారి మంత్రి కేటీఆర్. ‘సెస్’ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన డైరెక్టర్ అభ్యర్థులను ఓడించి మంత్రి కేటీఆర్ (KTR)కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఓ కేటీఆర్ దొర నిన్ను కూడా త్వరలో ఓడిస్తాం’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల విద్యార్థుల పేరిట ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ప్రధాన గేటు, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం మూడు ఫ్లెక్సీలు వెలిశాయి. మంత్రి కేటీఆర్ వేములవాడ, సిరిసిల్ల (Sircilla) పర్యటన నేపథ్యంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ‘విద్యార్థుల ద్రోహి మంత్రి కేటీఆర్. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నందుకు మా గోస నీ పార్టీ, ప్రభుత్వానికి తగులుతుంది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించి మనల్ని మోసం చేసిన కేటీఆర్కు బుద్ధి చెప్తాం.. రాజన్నసిరిసిల్ల ప్రజలారా మీ సమస్యలు తీరాలంటే సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించండి. మీరు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి’ అని ఫ్లెక్సీలో పొందు పరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది అక్టోబరు 23వ తేదీన కూడా ‘డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీని యాది మరిచిండ్రా సారు’ అంటూ ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-12-20T18:19:07+05:30 IST