Wrong Route : రాంగ్ రూటులో దూసుకొచ్చి.. కారును ఢీకొని!
ABN, First Publish Date - 2022-11-04T05:32:11+05:30
రాంగ్ రూట్‌లో ఓ ఆర్టీసీ బస్సు వారి పాలిట మృత్యువై దూసుకొచ్చింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు మధ్య ఏమీ కనిపించని ..
ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు.. కారులోని నలుగురి మృతి
మరో ప్రమాదంలో ఐదుగురు..
జోగిపేట, జీడిమెట్ల, ధారూరు, మహబూబ్‌నగర్, నవంబరు 3: రాంగ్ రూట్‌లో ఓ ఆర్టీసీ బస్సు వారి పాలిట మృత్యువై దూసుకొచ్చింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు మధ్య ఏమీ కనిపించని స్థితిలో ఆ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురూ దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని రాంసాన్‌పల్లి శివారులో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు, వారి కుమార్తె, ఏడాది వయసున్న మనుమరాలు ఇలా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో రెండుచోట్లా ఘోర ప్రమాదాలు సంభవించాయి. వికారాబాద్ జిల్లా ధారురు మండలం బాచారం వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 35 మంది ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడటంతో ఆరుగురికి తీవ్రగాయాలు, 12మందికి స్వల్పగాయాలయ్యాయి.
మహారాష్ట్రలోని దెగ్‌లూర్ తహసీల్ పరిధిలోని షాపూర్‌కు చెందిన దిలీప్ (50) ఎలక్ట్రీషియన్. భార్య వినోద (44)తో కలిసి హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నాడు. ఈ దంపతులకు సుప్రతీక (24), కొడుకు వంశీ (17) ఉన్నారు. సుప్రతీకకు ప్రదీప్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు పాప ప్రతీక (1) ఉంది. గత వినాయక చవితి నుంచి సుప్రతీక-ప్రదీప్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రతీకకు ప్రదీప్ విడాకుల నోటీసు పంపాడు. దీనిపై చర్చించేందుకు దిలీప్ సొంతూకు వెళ్లాలనుకున్నాడు. కుమారుడు వంశీకి పరీక్షలు ఉండటంతో అతడిని ఇంట్లో ఉంచి కూతురు, భార్య, మనుమరాలిని వెంటబెట్టుకొని స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడే మూడు రోజులు ఉన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం రాంసాన్‌పల్లి శివారులోకి రాగానే ప్రమాదం బారినపడింది. హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళుతున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. పొగమంచు కారణంగా బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న కారును గుర్తించలేకపోయారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు మూడువంతుల భాగం బస్సు ముందు చక్రాల కిందికి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న దిలీప్, పక్కనే కూర్చున్న సుప్రతీక, ప్రతీక, వెనుక సీటులో కూర్చున్న వినోద అక్కడికక్కడే మృతి చెందారు.
ఇక వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన హేమ్లా నాయక్ (45), వర్త్యా రవి (40), నేనావత్ కిషన్ (40), నేనావత్ వినోద్ (24), నేనావత్ చందర్, రాథోడ్ కిషన్, వర్త్యా సోనీబాయి, లిల్లిగడ్డ తండా కు చెందిన ముడావత్ సుమిత్రా బాయి, రేగొండి గ్రామానికి చెందిన రమేశ్ వికారాబాద్‌లోని క్రషర్ వద్ద కూలీ పని చేసేందుకు రేగొండి గ్రామానికి చెందిన జమీల్ (35) ఆటోలో బయలుదేరారు. కాగా అదే క్రషర్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ బాచారం వద్ద ఆటో ఎక్కాడు. 11మంది ప్రయాణిస్తున్న ఈ ఆటో బాచారం దాటి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురైంది. వికారాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ జమీల్, హేమ్లానాయక్, రవి అక్కడికక్కడే మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిషన్, వినోద్ మృతిచెందారు. మిగతా వారంతా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏపీ కడపలోని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద బోల్తాపడింది. మరమ్మతు పనులు సాగుతుండటంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్నవారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Updated Date - 2022-11-04T05:32:50+05:30 IST