గ్రామకంఠం భూములపై సర్కారు నజర్
ABN, First Publish Date - 2022-08-17T05:15:28+05:30
గ్రామకంఠం భూముల లెక్కతేల్చేందుకు సర్కారు దృష్టిసారించింది. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించేందుకు కసరత్తును ప్రారంభించింది. గతంలో ఇళ్లు, ప్రహరీ లోపలి భూమి వివరాలను ధరణి పోర్టలో నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామంలోని అన్ని ఖాళీ స్థలాల వివరాలను సేకరించనున్నారు. పాత రివిజన్ రికార్డులను, ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాలను మినహాయించి తాజాగా సేకరించిన భూములను ధరణిలో నమోదు చేయనున్నారు.
ఖాళీ స్థలాల వివరాల సేకరణకు కసరత్తు
నేడు డీపీవోలకు ప్రత్యేక శిక్షణ
గజ్వేల్, ఆగస్టు 16: గ్రామకంఠం భూముల లెక్కతేల్చేందుకు సర్కారు దృష్టిసారించింది. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించేందుకు కసరత్తును ప్రారంభించింది. గతంలో ఇళ్లు, ప్రహరీ లోపలి భూమి వివరాలను ధరణి పోర్టలో నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామంలోని అన్ని ఖాళీ స్థలాల వివరాలను సేకరించనున్నారు. పాత రివిజన్ రికార్డులను, ధరణి పోర్టల్‌లో నమోదైన వివరాలను మినహాయించి తాజాగా సేకరించిన భూములను ధరణిలో నమోదు చేయనున్నారు. ఇందుకోసం నేడు హైదరాబాద్‌లో జిల్లా పంచాయతీ అధికారులకు ఒకరోజు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ భూముల వివరాలు స్పష్టం కావడం, గ్రామాల్లో స్థలాల విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. కానీ గ్రామాల్లో స్థలాల వివరాలపై పట్టున్న వీఆర్వోలు, వీఆర్‌ఏలు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వివరాల సేకరణ అంత సులువుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. పంచాయతీ కార్యదర్శులకు ఈ విషయం పూర్తిగా కొత్తది కావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నది.
తీరనున్న తిప్పలు
గతంలో గ్రామకంఠం భూముల్లో ఇళ్లను నిర్మించుకుంటే పంచాయతీ కార్యదర్శి లేదా సర్పంచ్ ద్వారా ఇంటి నంబర్ తీసుకునేవారు. ధరణి పోర్టల్ వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవడం తప్పనిసరిగా మారింది. తప్పనిసరిగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉండడంతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అలాగే, ఇళ్ల కోసం అన్నదమ్ములు, దయాదులు, పొరుగువారి మధ్య నెలకొన్న తగాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామకంఠం భూముల్లో ఇళ్ల నిర్మాణానికి బ్యాంకులు రుణాలను ఇచ్చేందుకు వెనుకాడుతుండడంతో.. ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
వివరాల సేకరణ సులభం కాదు
గతంలో భూములకు సంబంధించిన పూర్తి వివరాలు వీఆర్వోల వద్ద ఉండేవి. రెవెన్యూ సహాయకులకు గ్రామంలోని స్థలాల వివరాలపై పట్టు ఉండడంతో ఏ భూమి ఎవరిదే చెప్పగలిగేవారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేపి, ఇతర శాఖలకు బదిలీ చేసింది. మరోవైపు సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏలు సమ్మె చేస్తున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, మల్టిపర్పస్ వర్కర్లపై సర్వే భారం పడే అవకాశాలున్నాయి. వీరికి భూ సంబంధిత అంశాలు కొత్త కావడంతో వివరా సేకరణలో ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు చేసిన పనులను పంచాయతీరాజ్ శాఖకు బదలాయిస్తారన్న ఊహాగాహానాలకు ఇది తావిస్తున్నది. గ్రామకంఠం భూములపై కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేసేందుకు సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, పంచాయతీరాజ్ డైరెక్టర్ ఎం.హన్మంతరావు మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్‌లో పర్యటించి రివిజన్ రికార్డులను పరిశీలించాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వారి పర్యటన వాయిదా పడింది.
Updated Date - 2022-08-17T05:15:28+05:30 IST