తాలుతో తంటాలు
ABN, First Publish Date - 2022-11-18T23:59:46+05:30
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు సహకరించకపోగా దోచుకునేవారికి వంత పాడుతున్నారు!! ఫలితంగా ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు నిరాశే ఎదురవుతున్నది.
కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్ల కొరత
కొత్తవి సమకూర్చకపోగా ఉన్న వాటికి మరమ్మతులు చేయించని వైనం
తేమ అధికంగా ఉండడంతో క్వింటాకు 6 కిలోల అధిక తూకం
అడ్డగోలుగా దండుకుంటున్న రైస్‌మిల్లర్లు
తీవ్రంగా నష్టపోతున్నామని రైతుల ఆవేదన
సిద్దిపేటరూరల్, నవంబరు 18 : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని వసతులు కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులకు సహకరించకపోగా దోచుకునేవారికి వంత పాడుతున్నారు!! ఫలితంగా ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు నిరాశే ఎదురవుతున్నది. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసినా వాటిలో రైతులకు కావాల్సిన ప్యాడీ క్లీనర్లను ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు ఏర్పాటు చేయడం లేదు. ఉన్న ప్యాడీ క్లీనర్లకు మరమ్మతులు చేయడం లేదు. దీంతో ధాన్యంలో తాలు(పొల్లు) పట్టడం ఇబ్బందిగా మారిందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో 19శాతం తేమ ఉంటే మిల్లులకు తరలించేందుకు మొదట ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ప్యాడీ క్లీనర్లకు మరమ్మతులు చేయకుండా ఉండేందుకు అధికారులు రైస్‌మిల్లర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేటరూరల్ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 8, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఒకటి, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆరు ప్యాడీ క్లీనర్లు ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రజాప్రతినిధుల గోల్‌మాల్
గోనె సంచి బరువు సుమారు 700 గ్రాములు ఉంటుంది. దానికి బరువుకు తగినట్టుగా అధికంగా ధాన్యం తూకం వేయాలి. కానీ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం క్వింటాకు 5 కిలోలు తూకం వేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం 5 కిలోలు కోత విధింపునకు వంతపాడుతున్నారు. చేసేదేమీ లేక రైతులు కూడా అందుకు ఒప్పుకోక తప్పడం లేదు. అయితే కొనుగోలు కేంద్రాలు వద్ద తూకం సమయంలో హమాలీలు అదనంగా మరో కిలో అధికంగా తూకం వేస్తూ మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదేమీటని ప్రశ్నిస్తే తేమను సాకుగా చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానికంగా రాజకీయ నాయకులుగా చలామణి అయ్యే కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. వారు ధాన్యం శుభ్రం చేసే సమయం, ఓపిక లేక పొల్లుతో కూడిన ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. రైతులకు బాసటగా నిలవాల్సిన నేతలే తమ పబ్బం గడుపుకునేలా ప్రవర్తిస్తుండడం గమనార్హం. మరోవైపు రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా అధికారులు మాటల తీరు మరింత విస్మయం గొల్పేలా ఉంది. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, రైతులే నేరుగా రైస్‌మిల్లులకు విక్రయించుకుంటారని కొందరు అధికారులు అసహనం వ్యక్తం చేస్తుండడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. మండలంలోని 14 కొనుగోలు కేంద్రాలకు గాను తోర్నాలలోని ఓ వ్యక్తి తెచ్చుకున్న ప్యాడీ క్లీనర్‌ను అద్దెకు తెచ్చుకుని కొందరు రైతులు ధాన్యం శుభ్రం చేసుకుంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రజాప్రతినిధులు రైస్‌మిల్లుల యజమానులకు వంతపాడుతుండడంతో రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్యాడీ క్లీనర్లకు మరమ్మతులు చేయించకపోగా మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాలకు మధ్యవర్తిత్వం వహించి నష్టం చేకూర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేయాలని, దళారుల్లా మారిన ప్రజాప్రతినిధులు, మిల్లర్ల ఆగడాలను అరికట్టి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2022-11-18T23:59:47+05:30 IST