ఆయిల్‌పాం సాగు ఆశలు ఆవిరి
ABN, First Publish Date - 2022-10-27T23:51:46+05:30
ఆయిల్‌పాం సాగు ఆశ మెదక్ జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సమానంగా ప్రోత్సాహించాల్సి ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపుతున్నాయి.
మంజీరా తీరాన్ని చేరని ఆయిల్‌పాం సాగు పథకం
మెదక్ జిల్లాలో 20వేల ఎకరాలు అనుకూలం
పట్టించుకోని సర్కారు, అధికారులు
అర్బన్ ప్రాంతంగా మెతుకుసీమ
మెదక్, అక్టోబరు 27: ఆయిల్‌పాం సాగు ఆశ మెదక్ జిల్లా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సమానంగా ప్రోత్సాహించాల్సి ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపుతున్నాయి. మంజీరా తీరం వెంట ఉన్న మెదక్ జిల్లా ఆయిల్‌పాం సాగుకు అనువుగా ఉన్నా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రెండు పంటలు పండే భూములున్న మెదక్ జిల్లాను అర్బన్ ప్రాంతంగా గుర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి
దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని చేపడుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రూ.4,800 కోట్ల వ్యయంతో ఆయిల్‌పాం పంట విస్తరణ ప్రాజెక్టును చేపట్టారు. ఆసక్తి కలిగిన రైతులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాలోనూ ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నారు.
మెదక్ జిల్లా అనుకూలం
జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు వాతావరణం, నీటి వనరులు, భూములు అనుకూలంగా ఉన్నాయి. వరి సాగు చేయగలిగే ప్రాంతాల్లో ఆయిల్‌పాం సాగు చేయవచ్చని నేషనల్ రీ అసె్‌సమెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఘనపూర్ ప్రాజెక్టు కాలువల పరివాహక ప్రాంతాల్లో పుష్కలంగా నీరుంది. రైతులు రెండు సీజన్లలోనూ విస్తారంగా పంటలు పండిస్తున్నారు. ఈ ప్రాంతాలు ఆయిల్‌పాం సాగుకు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఉద్యానశాఖ మాత్రం ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకపోవడంపై, రైతులకు అవగాహన కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్‌పాం పురోగతి, నూనెగింజల సాగు, యాసంగి పంటల సాగుపై ఈనెల 21న హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మెదక్ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగు అవకాశాలపై కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం.
సిద్దిపేట జిల్లాలో జోరుగా సాగు
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సిద్దిపేట జిల్లాలోనే ఆయిల్‌పాం సాగుకు సర్కారు రైతులకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నది. రైతులంతా ఆయిల్‌పాంను పెద్దఎత్తున సాగుచేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం ఇస్తోంది. సబ్సిడీపై డ్రిప్పు పరికరాలు అందజేస్తున్నది. మొక్కల పంపిణీ, చెట్టు నాటడం, ఎరువుల వాడకం, క్రాప్ కట్టింగ్, మార్కెటింగ్ ఇలా అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా నిలుస్తున్నారు. పామాయిల్ తయారీ కోసం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ లిమిటెడ్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
బ్యాంకుల నుంచి రుణాలు
ఆయిల్‌పాం సాగుతో అనేక ప్రయోజనాలున్నాయి. ఒకసారి పంట వేసుకుంటే 30 సంవత్సరాల పాటు నిరంతరం దిగుబడి వస్తుంది. ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు రూ.4 లక్షలు పెట్టుబడి అవసరమవుతుంది. దీంట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రతి ఏటా రూ. లక్ష సబ్సిడీ రూపంలో అందజేస్తాయి. మిగిలిన పెట్టుబడి 4 ఏళ్ల తరువాత చెల్లించేలా బ్యాంకుల నుంచి రైతులకు రుణం ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ పథకాన్ని మెదక్ జిల్లాలో కూడా అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
జిల్లాలో భూములు అనుకూలం : నర్సయ్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి, మెదక్
మెదక్ జిల్లాలో 3 లక్షల ఎకరాలు వ్యవసాయ భూములు ఉండగా.. 20 వేల ఎకరాల పరిధిలో ఆయిల్‌పాం సాగు చేయవచ్చు. నిజాంపేట మండలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగు చేయగా విజయవంతంగా పంట వస్తున్నది. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ రైతులకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి, అధికారులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం.
Updated Date - 2022-10-27T23:51:48+05:30 IST