జోగిపేటలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-12-06T00:19:43+05:30
ఆకతాయిలు చేసిన పని రాజకీయ చిచ్చును రేపడంతో జోగిపేటలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది.
టీఆర్‌ఎస్ కార్యకర్తల బైక్ దగ్ధం
కాంగ్రెస్ వారి పనేనంటూ టీఆర్‌ఎస్ ధర్నా
అసత్య ఆరోపణలు : కాంగ్రెస్ నాయకులు
జోగిపేట, డిసెంబరు 5: ఆకతాయిలు చేసిన పని రాజకీయ చిచ్చును రేపడంతో జోగిపేటలో సోమవారం ఉద్రిక్తత నెలకొన్నది. పోటాపోటీ ధర్నాలకు దారి తీసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కాంగ్రెస్ శ్రేణులు జోగిపేటలో ర్యాలీ నిర్వహించాయి. జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి దామోదర్, ఆయన కూతురు త్రిష జీపులో రోడ్‌షోగా సంగుపేటలోని ఓ ఫంక్షన్‌కు వెళ్తుండగా వందలాది బైక్‌లతో కార్యకర్తలు అనుసరించారు. ఈ సమయంలోనే అందోలు పట్టణ శివారులోని జాతీయ రహదారి బ్రిడ్జి కింద కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు కేక్‌ను కట్ చేస్తున్నారు. అదే దారివెంట బైక్‌పై వెళ్తున్న పోతిరెడ్డిపల్లికి చెందిన ముగ్గురు టీఆర్‌ఎ్‌స కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై అందోలు మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి వారు ప్రయాణిస్తున్న బైక్‌కు నిప్పటించారు.
టీఆర్‌ఎస్ నేతల ధర్నా
తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కావాలనే దాడి చేసి బైక్‌ను తగలబెట్టారని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సోదరుడు రాహుల్‌కిరణ్ ఆధ్వర్యంలో వందలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘటనా స్థలికి చేరుకుని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. తమ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని వారి చేతుల్లో ఉన్న ఎమ్మెల్యే బర్త్‌డే పోస్టర్లను లాక్కుని చింపివేసేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న తమ కార్యకర్తలపై వందలాది దాడి చేసి, వారి బైక్‌కు నిప్పంటించారని ఆరోపించారు. కొద్దిసేపట్లోనే మరింతమంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో సంగుపేట క్రాస్‌రోడ్డు వద్ద మరోసారి రాస్తారోకో చేశారు.
ఓర్వలేకనే ఇదంతా..
దామోదర్ ర్యాలీకి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నుంచి ముగ్గురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో తమ ర్యాలీలోకి ప్రవేశించారన్నారు. సంగుపేట క్రాస్‌రోడ్డు వద్ద తాము కేక్ కట్ చేస్తుంటే, అక్కడకు చేరుకుని దామోదర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఫ్లెక్సీలను చింపివేశారని తెలిపారు. తమంతట తామే బైక్‌కు నిప్పంటించుకుని కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అదే జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సంగుపేట వద్ద హైవేపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురెదురుగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో జోగిపేట సీఐ నాగరాజు, ఎస్‌ఐ సామ్యానాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఇరు పార్టీల వారిని శాంతింపజేశారు.
Updated Date - 2022-12-06T00:19:46+05:30 IST