heart attack: మరో రోజులో లక్ష్యం చేరుకుంటాడనగా..
ABN, First Publish Date - 2022-12-24T03:41:36+05:30
విహార యాత్రలంటే చిన్ననాటి నుంచే ఆయనకు అమితమైన ఆసక్తి. ఆ కుతూహలంతోనే దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈసారి ఎవరెస్ట్ బేస్ క్యాంపును సందర్శించాలని నిర్ణయించుకున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణం తీసిన పర్వతారోహణ
ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు నల్లగొండ యువకుడు
మార్గమధ్యంలో లోబూచె పర్వతంపై గుండెపోటు
మరో రోజులో లక్ష్యం చేరుకుంటాడనగా మృతి
నల్లగొండ, డిసెంబరు 23 : విహార యాత్రలంటే చిన్ననాటి నుంచే ఆయనకు అమితమైన ఆసక్తి. ఆ కుతూహలంతోనే దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈసారి ఎవరెస్ట్ బేస్ క్యాంపును సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పర్వతారోహణలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకున్నారు. ఆపై నేపాల్ వెళ్లి బేస్ క్యాంపు దిశగా అడుగులు వేశారు. అయితే, మార్గమధ్యంలో చలికి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల రాజశేఖర్‌రెడ్డి(32) హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏడాదిన్నర క్రితం ఆయనకు వివాహమైంది. స్నేహితులతో కలిసి ఐదేళ్లుగా జూబ్లీహిల్స్‌లో సాఫ్ట్‌వేర్ ఫోరెన్స్‌సె్‌స సైంటిస్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచే విహార యాత్రలంటే ఆసక్తి చూపే రాజశేఖర్‌రెడ్డి పర్వతారోహణకు సంబంధించి గత ఏడాది అసోంలో రెండు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని బేస్ క్యాంపు నుంచి చూడాలని ఉందని తల్లిదండ్రులతో చెప్పారు. అయితే, ఎవరెస్టు శిఖరానికి వెళ్లే మార్గంలో డిసెంబరులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో సుశిక్షితులైన పర్వతారోహకులు తప్ప సాధారణ పర్యాటకులు అటు వైపు యాత్రలకు వెళ్లరని వారు వారించారు. అయితే, రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులను ఒప్పించి ఈ నెల 3న నేపాల్ వెళ్లారు. ఖాట్మండు నుంచి వాహనంలో బయలుదేరి సల్లేరు చేరుకున్నారు.
అది సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి పది రోజుల పాటు నడిచి ఈ నెల 21న 4,900 మీటర్ల ఎత్తులో ఉన్న లోబూచె పర్వతాన్ని చేరుకుని, అక్కడ లాడ్జిలో బస చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో మంచుతో పాటు చలి అధికంగా ఉండటంతో రాజశేఖర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం గుండెపోటుతో చనిపోయారు. గమనించిన లాడ్జి సిబ్బంది రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌లో ఉన్న నంబర్లతో కుటుంబ సభ్యులకు ఈ నెల 22న సమాచారమిచ్చారు. వెంటనే వారు నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. శనివారం ఖాట్మండులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకురానున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు వెళ్లాలంటే 5,500 మీటర్లు ఎక్కాల్సి ఉంటుంది. మరో రోజు ప్రయాణించి 600 మీటర్లు ఎక్కితే రాజశేఖర్‌రెడ్డి బేస్ క్యాంపునకు చేరేవారని, ఈలోగా తీవ్ర అస్వస్థతతో చనిపోయారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Updated Date - 2022-12-24T08:58:49+05:30 IST