Addanki Dayakar: నోరు జారాను..? క్షమాపణలు
ABN, First Publish Date - 2022-08-06T23:41:18+05:30
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Mp Komatireddy Venkat Reddy)కి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు..
హైదరాబాద్ (Hyderabad): ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Mp Komatireddy Venkat Reddy)కి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన మాటల నుంచి తప్పు దొర్లిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్.. చండూరు సభలో అసభ్యపదం మాట్లాడారు. దీంతో ఆయనపై సీనియర్లు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు పలుచోట్ల అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో అద్దంకి దయాకర్ వెనక్కి తగ్గారు. తన మాటను వెనక్కి తీసుకున్నారు.. తాను మాట్లాడిన మాట తెలంగాణలో వాడుక భాష అని.. దానిపై కొందరు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకు వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నానని ఆయన చెప్పారు. పార్టీకి నష్టం చేయొద్దని తాను చండూరు సభలో ఆ ప్రకటన చేశానని తెలిపారు. అదే మాట మీడియాలో ప్రచారం అయిందని.. దాంతో పార్టీకి నష్టం జరగొద్దని క్షమాపణ చెబుతున్నానని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేసే ఏ పనిని కూడా తాను చేయనని వెల్లడించారు. పార్టీ విధానాలు దాటి వ్యక్తుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని భావించనని.. మరొకసారి ఇలా జరగదని అద్దంకి దయాకర్ తెలిపారు.
కాగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Munugodu Congress Mla Rajagopal Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 21న బీజేపీ (Bjp)లో చేరనున్నారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో ప్రకంపనలు చెలరేగాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడంతో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరిగి తన సత్తా చాటాలని భావించింది. ఈ మేరకు చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు భారీగా జనసేకరణ చేశారు. ఈ సభలో టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై హాట్ కామెంట్ చేశారు. అయితే అద్దంకి దయాకర్ మాత్రం.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటంతో వెంటనే అదే జిల్లాకు చెందిన తెలంగాణ ఇంటి పార్టీ చీఫ్ చెరుకు సుధాకర్ (Telangana Inti Party Chief Cheruku Sudhakar)ను టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. దీంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు చెరుకు సుధాకర్ ప్రయత్నాలు చేశారని.. ఆయన్ను కాంగ్రెస్లోకి తీసుకున్న రేవంత్ రెడ్డి తీరును తప్పు బట్టారు. ఇకపై రేవంత్ రెడ్డి ముఖాన్ని సైతం చూడనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-08-06T23:41:18+05:30 IST