మత్స్యగిరీశుడి సన్నిధిలో బ్రహ్మోత్సవ శోభ
ABN, First Publish Date - 2022-11-04T01:30:21+05:30
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నలు మూలలనుంచి ప్రజలు తరలిరాగా మత్స్యగిరికొండపై భక్తుల కోలాహలంతో బ్రహ్మోత్సవ సందడి నెలకొంది. లోకకల్యాణం, విశ్వశాంతికోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్య్సాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబుచేశారు.
వలిగొండ, నవంబరు 3: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు నలు మూలలనుంచి ప్రజలు తరలిరాగా మత్స్యగిరికొండపై భక్తుల కోలాహలంతో బ్రహ్మోత్సవ సందడి నెలకొంది. లోకకల్యాణం, విశ్వశాంతికోసం ముక్కోటి దేవతలకు నిలయంగా మత్య్సాద్రి ఆలయాన్ని అందంగా ముస్తాబుచేశారు. యాగశాలకు ద్వారతోరణార్చన జరిపి ఆగమ శాస్త్రరీతిలో బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిని ఆహ్వానించడానికి ధ్వజారోహణతంతు జరిపారు. స్వామివారి గర్భాలయం ఎదుట గరుత్మంతుడి చిత్రపటంవేసి అందంగా అలంకరించారు. వేదమంత్రాలతో దేవతలను కొలిచి గరుత్మంతుడి పటాన్ని ధ్వజపతాకంపై చిత్రీకరించారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. గరుత్మంతుడిని ఆహ్వానించడానికి గరుడ ముద్దను ఎగురవేశారు. ఈ గరుడ ప్రసాదం స్వీకరిస్తే సౌభాగ్యం, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వయంభు నారసింహుడి ప్రధాన గర్భాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగించారు. మత్స్యగిరి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను ఆహ్వానించడానికి గురువారం రాత్రి భేరీ తాండవం, దేవతాహ్వాన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఉత్సవ అతిథులుగా 33కోట్ల మంది దేవతలను ఆహ్వానించి వారిని పంచసూక్తాలతో సంతృప్తిపరిచే హవన కార్యక్రమాలను వైభవంగా కొనసాగాయి. కార్యక్రమంలో శ్రీప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు శాంతికుమార శర్మ, యాదగిరి స్వామి, అనంతాచార్యులు, భరద్వాజాచార్యులు, వేదపండితులు గోపికృష్ణ, సంతోష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-04T01:30:24+05:30 IST