ఓటెత్తిన మునుగోడు
ABN, First Publish Date - 2022-11-05T00:47:58+05:30
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు పోటెత్తాయి. 2018 ఎన్నికల్లో 91.31శాతం పోలింగ్ నమోదుకాగా, ఉప ఎన్నిక లో 93.13శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఉప ఎన్నికలో 1.82శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సంస్థాన్‌నారాయణపూర్ మండలంలో 93.76శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 36,430 ఓట్లు ఉండగా, 34,157 ఓట్లు పోలయ్యాయి.
నియోజకవర్గం వ్యాప్తంగా 93.13శాతం పోలింగ్
అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో 93.76
అత్యల్పంగా మర్రిగూడ మండలంలో 91.41శాతం
నల్లగొండ, మునుగోడు, నవంబరు 4: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు పోటెత్తాయి. 2018 ఎన్నికల్లో 91.31శాతం పోలింగ్ నమోదుకాగా, ఉప ఎన్నిక లో 93.13శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే ఉప ఎన్నికలో 1.82శాతం అధికంగా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సంస్థాన్‌నారాయణపూర్ మండలంలో 93.76శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 36,430 ఓట్లు ఉండగా, 34,157 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పం గా మర్రిగూడ మండలంలో 91.41శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో 28,309ఓట్లు ఉండగా, 25,877ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గం ఓటర్లలో మహిళలు 1,20,126మంది (49.67శాతం) ఉండగా, 1,11,338(92.68శాతం) పోలింగ్ నమోదైంది. పురుషులు 1,21,672మంది (50.31శాతం) ఉండగా, 1,13,853(93.57శాతం) పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్‌లో పురుషుల శాతం అధికంగా నమోదైంది.
జక్కలవారిగూడెం బూత్‌లో అత్యధికం
నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ బూత్‌లు ఉండగా, అత్యధికంగా మునుగోడు మండ లం జక్కలవారిగూడెంలోని 158వ పోలింగ్ బూత్‌లో 98.21శాతం పోలింగ్ నమోదైంది. ఈ బూత్‌లో 392 ఓట్లు ఉండగా, 385 ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లిలోని 240వ పోలింగ్ బూత్‌లో 82.4శాతం పోలింగ్ నమోదైంది. ఈ బూత్‌లో 1,056 ఓట్లు ఉండగా, 873 పోలయ్యాయి. చౌటుప్పల్ మండలంలో మండలంలో మొత్తం 68 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. అత్యధికంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట పోలింగ్ బూత్‌లో 97.83 శాతం పోలింగ్ నమోదైంది. ఈ బూత్‌లో మొత్తం 1,013 ఓట్లు ఉండగా, 991 ఓట్లు పోలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలో అత్యధికంగా చింతబావి తండాలో 98.34శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 241 ఓట్లు ఉండగా, 237 ఓట్లు పోలయ్యాయి. చండూరు మండలంలో అత్యధికంగా ఉడుతలపల్లి పోలింగ్ బూత్‌లో 96.47శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 1,019ఓట్లు ఉండగా, 983 పోలయ్యాయి. మర్రిగూడ మండలంలో అత్యధికంగా తానేదర్‌పల్లి పరిధి ఇందుర్తి పోలింగ్ బూత్‌లో 96.06శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 634 ఓట్లు ఉండగా, 609ఓట్లు పోలయ్యాయి. నాంపల్లి మండలంలో అత్యధికంగా నేరేళ్లపల్లి పోలింగ్ బూత్‌లో 95.91శాతం పోలిం గ్ నమోదైంది. ఇక్కడ 831 ఓట్లు ఉండగా, 797 ఓట్లు పోలయ్యాయి. గట్టుప్పల మండలంలో అత్యధికంగా నామాపురం పోలింగ్ బూత్‌లో 626 ఓట్లు ఉండగా, 607 పోలయ్యాయి. ఇక్కడ 96.96 శాతం పోలింగ్ నమోదైంది.
9 గంటలకు తొలి ఫలితం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అధికారులు నల్లగొండలో ఏర్పాట్లు పూర్తిచేశారు. నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావిలోని పౌరసరఫరాలశాఖ గోదాములో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, కౌటింగ్ కేంద్రంలో 21 టేబుళ్లు ఏర్పా టు చేశారు. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు నిర్వహించనుండగా, ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్లను 21 టేబుళ్లపై లెక్కించనున్నారు. తొలుత అభ్యర్థులు, పోలింగ్ ఏజెం ట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూం ఓపెన్‌చేసి ఈవీఎంలను టేబుళ్లపైకి తరలిస్తారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. వీటి లెక్కింపు అనంతరం ఈవీంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్‌తోపాటు అసిస్టెంట్ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. లెక్కింపు నిర్వహించేందుకు ఇప్పటికే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్వో రోహిత్‌సింగ్‌తోపాటు ఎన్నికల కమిషన్ నియమించిన ముగ్గురు పరిశీలకులు పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటలపాటు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కోసం ప్రతీ అభ్యర్థి 21మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేలా అధికారు లు అనుమతి ఇచ్చారు. కాగా తొలి ఫలితం ఉదయం 9గంటలకు వెలువడనుంది. చౌటుప్పల్ మం డలం జైకేసారం పోలింగ్ బూత్ తొలి ఫలితం వెలువడనుంది. చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1గంటకు నాంపల్లి మండలం మహ్మదాపురం పోలింగ్‌బూత్ ఫలితం వెలువడనుంది. తొలుత చౌటుప్పల్ మండలం, ఆ తరువాత సంస్థాన్‌నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలం ఓట్లను చివరగా లెక్కించనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాం
మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ను పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించామని నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణం ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఉప ఎన్నిక సాధారణ పరిశీలకుడు పంకజ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతంపై అభ్యర్థులకు వివరాలు అందజేశామన్నారు. మాక్ పోలింగ్, పీవో డైరీ, ఏఎ్‌సడీ ఓటర్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్‌లు, సర్వీస్ ఓట్లు తదితర అంశాలపై అభ్యర్థులకు వివరాలు అందజేశామన్నారు. ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీచేసిన అభ్యర్థులకు, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసినందున ఈ నెల 6వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, భాస్కర్‌రావు, మునుగోడు రిటర్నింగ్ అధికారి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్, తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-11-05T00:47:59+05:30 IST