బిచ్కుందలో ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది
ABN, First Publish Date - 2022-10-14T05:20:52+05:30
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందతో పాటు పలు మండలాల్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఇందుకు స్థానికంగా ఉండే కొందరు అధికారులు, సిబ్బంది కూడా సహకరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
- అధికార పార్టీకి చెందిన నేతలే ఇసుక దందా చేస్తున్నారు
- నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడు
- లిక్కర్ స్కాంలో తన కూతురుని తప్పించేందుకు లాబీయింగ్
- అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశాడు
- కాళేశ్వరం అవినీతిపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం
- మునుగోడు వీధుల్లో మూడు పార్టీలు కుక్కల్లా కొట్లాడుతున్నాయి
- రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి అందరు మునుగోడు మీద పడ్డారు
- బిచ్కుంద సభలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
కామారెడ్డి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందతో పాటు పలు మండలాల్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని స్థానికంగా ఉండే అధికార పార్టీకి చెందిన నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఇందుకు స్థానికంగా ఉండే కొందరు అధికారులు, సిబ్బంది కూడా సహకరిస్తున్నారంటూ వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా గురువారం బిచ్కుంద మండలంలోని బండ రెంజల్,గుండె నెమలి, పుల్కల్, పెద్దదేవాడ, చిన్నదేవాడ, గోపన్‌పల్లి మీదుగా బిచ్కుంద మండలానికి 22 కి.మీ వరకు సాగింది. అనంతరం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండకుండా తమ అనుచరులకు మండలాన్ని పంచేస్తాడని, అసలు స్థానిక సమస్యలు పట్టించుకున్న పరిస్థితిలేదని ప్రజలు వివరిస్తున్నారని అన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తానని ఇచ్చిన హామీ మరిచాడని అన్నారు. ఇసుక మాఫియాలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షనేతలు, పోలీసులకు వాటాలు పంచి నోరు మూపిస్తాడట కదా అని అన్నారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితుల పక్షాన ఏనాడు స్థానిక నిల్వలేదని అన్నారు. ఇక ఢిల్లీలో లిక్కర్‌స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ తన కూతురుని తప్పించేందుకే కేసీఆర్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాడని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశాడని అన్నారు. లిక్కర్‌స్కాంలో కేసీఆర్ కూతురు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ స్కాంలో ఉన్న కేసీఆర్ కూతురుకు సంబంధించిన ఇద్దరు బినామీలను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే కేసీఆర్ కూతురు కూడా అరెస్టు అవుతారనే ప్రచారం జోరందుకోవడంతో కేసీఆర్ ఈ కేసు నుంచి కూతురుని తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలుచేస్తున్నాడని షర్మిల విమర్శించారు. మునుగోడు వీధుల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు వీధి కుక్కలా కొట్లాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రపాలన మొత్తం గాలికి వదిలేసి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ మంత్రులను ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రఽధాన పార్టీలు వేలు ఖర్చు చేస్తూ మందు తాగిస్తు ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 118 నియోజకవర్గాల్లో పాలన గాలికి వదిలేసి మునుగోడు ఒక నియోజకవర్గం మీదనే పడ్డారని అన్నారు. కాళేశ్వరం, మిషన్‌భగీరథ పేరు చెప్పి కేసీఆర్ లక్షల కొట్లు కొల్లగొట్టారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు 17 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు కేంద్రం నుంచి అనుమతి లేదంటూ పనులు చేపట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్న సీఎం కేసీఆర్‌పై ఎందుకు విచారణ జరపడం లేదని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే కాళేశ్వరం అవినీతిపై జాతీయ స్థాయిలో వైఎస్‌ఆర్‌టీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు మెఘ క్రిష్ణారెడ్డికి అమ్ముడుపోయారని ఆరోపించారు. తెలంగాణలో రైతులు పండించిన పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను కల్పించలేకపోతున్నాయని అన్నారు. రైతులంటే ఈ రెండు ప్రభుత్వాలకు విలువ లేదని అన్నారు. బీజేపీ మత అగ్నిజ్వాలలను రాజేసీ ఆ మంటల్లో చలికాచుకునే ప్రయత్నం చేస్తుందని, కాంగ్రెస్ మరో దొంగ పార్టీ అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ప్రతిపక్ష పాత్రను పోషించడం లేదని అన్నారు. అందుకే వైఎస్‌ఆర్‌టీపీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు ముందుకు వస్తున్నామని అన్నారు.
Updated Date - 2022-10-14T05:20:52+05:30 IST