సమస్యల నడుమ చదువులు..
ABN, First Publish Date - 2022-12-28T23:27:51+05:30
విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోంది.
ఫ వసతులు లేక విద్యార్థుల అవస్థలు
ఫ తరగతి గదుల్లోనే వంటకాలు
ఫ విద్యార్థులకు మూత్రశాలలు లేక ఇబ్బందులు
ఫ ప్రారంభానికి నోచుకోని భవన నిర్మాణాలు
బాన్సువాడ టౌన్, డిసెంబరు 28: విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోంది. విద్యా సంవత్సరం మొదలు కాకముందే ఆయా పాఠశాలలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కానీ బాన్సువాడ పట్టణంలో నిఽధులు ఉన్నా పనులు సున్నా అన్న చందంగా తయారైంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు సమస్యల నడుమ సదువును కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఏడాది కాలంగా పాఠశాల భవన నిర్మాణాలు లేక ఒకేచోట మూడు పాఠశాలలను నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నాలుగు గదులు.. మూడు పాఠశాలలు
బాన్సువాడ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం అరాఫ త్ కాలనీ, ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం వీక్లీ మార్కెట్ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్త భవన నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భవన నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు ఇస్లాంపురలోని ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోకి విద్యార్థులను మార్చారు. సెప్టెంబరు 2021 నుండి నేటి వరకు పాఠశాల భవన నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఫలితంగా విద్యార్థులకు తరగతి గదులు లేక నానా అవస్థలు పడుతున్నారు. యూపీఎస్ ఇస్లాంపుర ఉర్దూ మీడియం పాఠశాలలో 60 మంది విద్యార్థులు, అరాఫత్ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం పాఠశాలలో 47 మంది విద్యార్థులు, వీక్లీ మార్కెట్ తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మూడు పాఠశాలలు కలిపి 171 మంది విద్యార్థులకు గాను కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. తరగతి గదులు లేక విద్యార్థుల సదువులు సక్రమంగా సాగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాలుగు గదుల్లోనే కొన్ని తరగతుల విద్యార్థులకు విద్యా బోధన చేస్తుండగా మిగతా తరగతుల వారికి ఆరుబయటే తరగతులను కొనసాగిస్తున్నారు. అరకొర వసతుల మధ్య విద్యార్థులకు చదువులు చెప్పాలంటేనే ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. గదులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు.
వంట గదులు లేక అవస్థలు..
ఇస్లాంపుర ప్రాథమికోన్నత పాఠశాలలో గల మూడు పాఠశాలలకు సం బంధించి వంట గదులు కూడా కరువయ్యాయి. ఇక్కడ ముగ్గురు భోజన ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. వంటలు ఎక్కడ వండాలో కూడా భోజన ఏజెన్సీ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. చేసేదేమి లేక తరగతి గదుల్లోనే వంటకాలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విధ్యార్థులు నానా పాట్లు పడాల్సి వస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పాఠశాల భవనం మెట్ల కింద వంటలు వండే ప్రాంతమంతా అధ్వానంగా మారింది. బండలు పూర్తిగా పోవడంతో పాములు కూడా సంచరిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. భయం గుప్పిట్లో చదువులు చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
మూత్రశాలలు లేక ఇబ్బందులు
పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఒంటికి, రెంటికి ఆరుబయటకు వెళ్లాల్సిన పరిస్థితి. పాఠశాల పక్కనే కెనాల్ ఉండండంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వచ్చి తమ పిల్లలు కెనాల్‌లో ప్రమాదవశాత్తు పడతారనే భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. కనీసం ప్రహరీ కూడా కరువవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
చదువులు సక్రమంగా సాగడం లేదు
ఫ చంద్రశేఖర్, హెచ్‌ఎం
ఒకే పాఠశాలలో మూడు బడులు ఉండడంతో విద్యార్థుల చదువు లు సక్రమంగా సాగడం లేదు. విద్యార్థులకు ఏ పాఠ్యాంశాన్ని భోధించాలన్నా ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఉర్దూ మీడియం, తెలుగు మీడియం విద్యార్థులు తికమక పడుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణాలు త్వరితగతిన చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
భవన నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు
ఫ నాగేశ్వరరావు, ఎంఈవో
ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం అరాఫత్ కాలనీ, ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం వీక్లీ మార్కెట్ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్త భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణం గా భవన నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. త్వరలోనే పాఠశాల భవన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటాం.
Updated Date - 2022-12-28T23:27:51+05:30 IST