ప్రాణం తీసిన భూ తగాదా
ABN, First Publish Date - 2022-12-03T23:15:35+05:30
భూమి విక్రయించగా వచ్చిన డబ్బు విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన తగాదా తమ్ముడి హత్యకు దారితీసింది.
తమ్ముడిని హతమార్చిన అన్న కుటుంబం
హత్యకు దారితీసిన భూ విక్రయ డబ్బులు
కొండాయిపల్లిలో ఘటన
దోమ, డిసెంబరు 3: భూమి విక్రయించగా వచ్చిన డబ్బు విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన తగాదా తమ్ముడి హత్యకు దారితీసింది. ఈ ఘటన దోమ మండలం కొండాయిపల్లిలో జరిగింది. హతుడి బంధువులు, పరిగి సీఐ వెంకటరామయ్య, ఎస్సై విశ్వజాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిపల్లికి చెందిన నెత్తి బాలకిష్టయ్య-రాములమ్మ దంపతులకు కుమారులు బాల్‌రాజ్, నర్సిములు(40), ఒక కూతురు సంతానం. తల్లిదండ్రుల పేరిట ఉన్న భూమిలో కూతురి పెళ్లికి ఎకరా అమ్మేశారు. మిగిలిన 23గుంటల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో 13గుంటలు అమ్మాలని అడ్వాన్స్‌గా రూ.లక్షా80వేలు తీసుకున్నారు. ఈ డబ్బులో బాల్‌రాజ్ రూ.లక్షా60వేలు తీసుకొని తమ్ముడు నర్సిములుకు రూ.20వేలు ఇచ్చాడు. నర్సిములు తనకు సమాన వాటా ఇయ్యాలని చెల్లెలు లక్ష్మి, బావ బాబయ్యతో పలుమార్లు మాట్లాడించాడు. శుక్రవారం రాత్రి అన్నదమ్ములు మరోసారి గొడవపడి పరస్పరం దాడిచేసుకున్నారు. నర్సిములు గొడ్డలితో కొట్టగా బాల్‌రాజ్ ముఖానికి గాయాలయ్యాయి. బాల్‌రాజ్ సైతం తమ్ముడిపై దాడిచేశాడు.గ్రామస్తులు వారిని విడిపించి బాల్‌రాజ్‌ను అక్కడి నుంచి దూరం తీసుకెళ్లారు. కాగా బాల్‌రాజ్ కొన్నేళ్లుగా కుటుంబంతో కొడంగల్‌లో ఉంటున్నాడు. దాడి విషయం అతడి భార్య సునీత, కొడుకు హరికి తెలియడంతో వారు వెంటనే కొండాయిపల్లికి చేరుకొని బాల్‌రాజ్‌తో కలిసి నర్సిములు తలపై రోకలిబండతో కొట్టగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింములుకు 15సంవత్సరాల క్రితం పెళ్లి కాగా.. భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. తల్లితో కలిసి ఉంటున్నాడు. భూమి మొత్తం తమకే చెందుతుందనే బాల్‌రాజ్ కుటుంబం నర్సిములును హత్య చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని శనివారం పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, సీఐ, ఎస్సై పరిశీలించారు. నర్సిములు బావ బాబయ్య ఫిర్యాదు మేరకు బాల్‌రాజ్, సునీత, హరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-12-03T23:15:37+05:30 IST