రంగారెడ్డి జిల్లా రాష్ర్టానికి బంగారు కొండ
ABN, First Publish Date - 2022-08-26T05:17:25+05:30
కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని
- కొంగర కలాన్‌లో కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్
- రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు చొప్పున మంజూరు
కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. సభకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం వద్ద భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త కలెక్టరేట్, సీఎం బహిరంగ సభా వేదిక వరకు అంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా భారీ కటౌట్లు, ప్లెక్సీలు దర్శనమిచ్చాయి.
రంగారెడ్డి అర్బన్/ఇబ్రహీంపట్నం/ఆదిభట్ల/కందుకూరు/ మహేశ్వరం, ఆగస్టు 25 : రంగారెడ్డి జిల్లా తెలంగాణాకు బంగారుకొండ అని సీఎం కేసీఆర్ తెలిపారు. కొంగరకలాన్‌లో రూ.58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ వస్తే.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అసత్య ప్రచారం చేశారు... కానీ, తెలంగాణ వచ్చాక జిల్లాలో భూముల ధరలు పెరిగాయని, ప్రస్తుతం రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా కోటీశ్వరుడేనని తెలిపారు. జిల్లా ప్రజలు చైతన్య వంతులని కొనియాడారు. పరిపాలన సౌలభ్యం కోసం సమీకృత కలెక్టరేట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు అదనంగా రూ.10కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎమ్మెల్యేలకు రూ.5కోట్లు చొప్పున ఇచ్చినట్లు, అదనంగా రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సభలో ఆయన ప్రకటించారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రశాశ్‌గౌడ్, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, సుధీర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అరికె పూడి గాంధీ, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, రాచకొండ సీపీ మహే్‌షభగవత్, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, ఎమ్మెల్సీలు సురభీవాణి దేవి, మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, టీఆర్‌ఎస్ యువ నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీఎంఎ్‌సచైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్టీ నాయకులు సత్తు వెంకట రమణారెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) ప్రత్యేక చొరవ
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) సీఎం బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాలుగు రోజులుగా ఆయనతోపాటు అనుచరగణం రేయింబవళ్లు సభా ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను చూసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చేందుకు శ్రమించారు. బంటి యూత్ ఫోర్స్ సభ్యులు 400మంది సభా వేదిక వద్ద వాలంటీర్లుగా సేవలందించారు.
జోష్ నింపిన ధూంధాం..
ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచందు, కళాబృందం నిర్వహించిన ధూంధాం కార్యక్రమం సభికులను అలరించింది. వేదికపై ఉన్న మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి) పార్టీ జెండాలు చేత పట్టుకుని ఊపడంతో అభిమానులు, యువత, పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టారు.
ఉత్సాహంగా సీఎం ప్రసంగం
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించిన తీరు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. పంటలు పండే తెలంగాణ కావాలా? మంటలు మండే తెలంగాణ కావాలా..? అంటూ సీఎం సభికులను ప్రశ్నించగా.. లేదు లేదు.. పంటలుపండే తెలంగాణనే కావాలంటూ.. పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో పార్టీశ్రేణులు కేరింతలు కొట్టారు. జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. అంటూ నినాదాలు చేశారు.
భారీగా తరలి వచ్చిన జనం.. ట్రాఫిక్ జాం
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రర్‌నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, శేరిలింగంపల్లి ఎల్‌బీనగర్ నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ జిల్లాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, మహిళా సంఘాల సభ్యులు భారీగా తరలివచ్చారు. సుమారు 20వేల మంది సభకు హాజరయ్యారు. దీంతో సభ ప్రాంగణానికి మూడు కిలోమీటర్ల మేర రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో సభావేదిక వద్దకు చేరుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఐదు పార్కింగ్‌స్థలాలు నిండిపోయాయి. వాహనాలు అధికంగా రావ డంతో మరో రెండు పార్కింగ్ స్థలాలను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు.
రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్
అందరూ కేసీఆర్ హెలీకాప్టర్ ద్వారా నూతన కలెక్టరేట్‌కు చేరుకుంటారని అనుకున్నారు. హెలీప్యాడ్ కూడా సిద్ధం చేశారు. కానీ..
ఆయన రోడ్డు మార్గం ద్వారా కొంగర కలాన్ చేరుకుని కొత్తకలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ నుంచి పక్కనే ఉన్న బహిరంగ సభ వద్దకు ప్రత్యేక వాహనంలో చేరుకున్నారు.
సీఎంకు ఘన స్వాగతం
సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేయగా ఆయనకు రాష్ట్ర మంత్రులు, పి.సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, ప్రకాశ్‌గౌడ్, ఆర్కెపూడి గాంఽధీతో పాటు జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఘన స్వాగతం పలికారు.
గులాబీమయం
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త కలెక్టరేట్, సీఎం బహిరంగ సభ వేదిక వరకు అంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా భారీ కటౌట్లు, ప్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్దఎత్తున కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
పోలీసు బందోబస్తు.. ఊపిరి పీల్చుకున్న అధికారులు
సీఎం పర్యటన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. సీఎం పర్యటనలో సుమారు 1500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.
కొత్త కలెక్టరేట్‌లో కొలువుదీన కలెక్టర్ అమయ్‌కుమార్
కొంగర కలాన్‌లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అమయ్‌కుమార్‌ను తన సీటులో కూర్చోబెట్టి అభినందించారు.
సీఎం సభకు బయల్దేరుతుండగా గుండెపోటుతో వృద్ధుడు మృతి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25 : కొంగరకలాన్‌లో సీఎం కేసీఆర్‌కు సభకు వెళ్లడానికి బయల్దేరుతుండగా ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడకు చెందిన ఏనుగు సత్తిరెడ్డి(74)అనే రైతు కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం సభకు వెళ్లేందుకు సిద్ధమై తన కారులో కూర్చున్నాడు. అదే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత కలెక్టరేట్
-విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పరిపాలన సౌలభ్యంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ హైదరాబాద్‌లో కొనసాగుతుందన్నారు. వివిధ శాఖలు వేర్వేరు చోట్ల ఉండటంతో ప్రజలు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారని తెలిపారు. కొంగర కలాన్‌లో రూ.58.20 కోట్లతో అన్ని హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనం సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో అందుబాటులోకి వచ్చిందన్నారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉంటాయని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పెరిగాయని, అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతుందని ఆమె పేర్కొన్నారు.
దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్
-టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
దేశంలోనే నెంబర్‌వన్‌గా తెలంగాణ అభివృద్ధిలో నిలుస్తుం దని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, అభివృద్ధిలో కూడా దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. జిల్లాకు సాగు నీరు ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని ఆయన చెప్పారు.
Updated Date - 2022-08-26T05:17:25+05:30 IST