Sri Saraswathi Vidya Peetham: కన్హా శాంతి వనంలో బాలికా శక్తి సంగమం
ABN, First Publish Date - 2022-11-25T22:15:31+05:30
శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో మూడు రోజుల పాటు బాలికా శక్తి సంగమం జరుగుతోంది...
హైదరాబాద్: చదివే సమయంలో విద్యార్థులు కేవలం చదువుపైనే శ్రద్ధ చూపించాలని, ప్రపంచంలో జరుగుతున్న అనవసర విషయాలపై విముఖత చూపాలని భారతీయం వ్యవస్థాపకురాలు సత్యవాణి చెప్పారు. బాలికలను నిర్వీర్యం చేసే ప్రతి పనీ సమాజంలో జరుగుతోందని, అత్యంత జాగరూకతతో వుండాలన్నారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం స్వర్ణోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో మూడు రోజుల పాటు బాలికా శక్తి సంగమం జరుగుతోంది. తెలంగాణ నలు మూలల నుంచి వచ్చిన 2 వేల మంది విద్యార్థినులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయం సత్యవాణి మాట్లాడుతూ... మన సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర తదితర అంశాలను చిన్నతనంలోనే అధ్యయనం చేసి, ఆచరణలో పెట్టాలన్నారు. సమాజంలో, కుటుంబంలో స్ర్తీయే ప్రధాన బిందువని...బాలికా దశ నుంచే వీటిపై శ్రద్ధ వహిస్తే కుటుంబాలు, దేశం బాగుంటాయని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతీయ సంస్కృతిని ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు. సరస్వతీ శిశు మందిరాల్లో బోధించే వాటిని ఆచరిస్తే సమాజం పూజించే స్థాయికి ఎదుగుతారని సత్యవాణి తెలిపారు.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం సంఘటనా మంత్రి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ పై ఎందరు దాడులు చేసినా.. భారత్ భారత్ గానే వుందంటే మన సంస్కృతే అందుకు కారణమని పేర్కొన్నారు. చాలా రకాలుగా భారతీయులను ప్రలోభ పెట్టడానికి యత్నాలు జరిగినా సఫలీకృతం కాలేకపోయారని.. అందుకు కారణం మన సంస్కృతి అనే వేళ్ళు బలంగా పాతుకుపోవడమేనన్నారు. భూమి మనకు తల్లి అని, ఆ పూజ్య భావనే అనాదిగా ఆచరిస్తున్నామని తెలిపారు.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం అధ్యక్షులు చామర్తి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. బాలికా శక్తికి ఈ సంగమం ఓ సంకేతమని అభివర్ణించారు. కుటుంబ విషయాల్లో, సమాజ పరంగా తీసుకునే నిర్ణయాల్లో స్త్రీ భాగస్వామ్యం కచ్చితంగా వుండాలన్నారు. స్త్రీలు వారి కుటుంబాల నిర్ణయాల్లో భాగస్వాములుగా వుండటం...సముచితంగా సమాజాన్ని, కుటుంబాన్ని నడపగలిగితే సాధికారత వచ్చినట్లే అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాలికా విద్య తెలంగాణ అధ్యక్షురాలు అనఘా లక్ష్మీ, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం సంఘటనా మంత్రి లింగం సుధాకర్ రెడ్డి, తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రి పతకమూరి శ్రీనివాసరావు, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, తెలంగాణ ప్రాంత సేవికా సమితి కార్యవాహిక శ్రీపాద రాధ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-25T22:15:32+05:30 IST