ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: బీసీలే టీడీపీకి వెన్నెముక

ABN, First Publish Date - 2022-11-11T04:17:12+05:30

వెనకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో పార్టీ అధ్యక్షులుగా బీసీలు ఉండడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెనకబడిన వర్గాలకు పార్టీ రుణపడి ఉంటుంది..

తెలుగు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా బీసీలు

హైటెక్‌సిటీ కట్టకపోతే తెలంగాణకు ఇంత తలసరి ఆదాయం సాధ్యమేనా?: టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆకాంక్ష.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని బాధ్యతల స్వీకరణ

కళకళలాడిన ఎన్టీఆర్‌ భవన్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి పలువురి చేరిక

హైదరాబాద్‌/రాంనగర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వెనకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో పార్టీ అధ్యక్షులుగా బీసీలు ఉండడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లతో నాంది పలికింది టీడీపీనే అన్నారు. బీసీలకు పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. 74 కులాలను ఏకతాటిపైకి తెచ్చి బడుగులకు ఎనలేని సేవలందించిన కాసాని జ్ఞానేశ్వర్‌ నాయకత్వంలో తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. నాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాది కారణంగానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే (ఢిల్లీ, గోవా మినహాయిస్తే) అత్యధికంగా ఉందని, ఇక్కడ భూమి విలువ కూడా అనూహ్యంగా పెరిగిందని చంద్రబాబు చెప్పారు. హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అభివృద్ధి పనులు చేపట్టకపోతే ఇంత తలసరి ఆదాయం (రూ.2,78,833) సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. తాను ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలను రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యతో పాటు ప్రస్తుత సీఎం కేసీఆర్‌ కొనసాగించడం అభినందనీయమన్నారు. తాను చేపట్టాను కాబట్టి, వాటిని వారు కూల్చివేస్తే పరిస్థితి ఎలా ఉండేదని అన్నారు.

తెలంగాణ గడ్డపై టీడీపీని ఆశీర్వదించాలని కోరారు. గురువారం ఎన్టీఆర్‌భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి కాసాని సేవలు ఉపయోగపడతాయన్నారు. బక్కని నర్సింలు కూడా పార్టీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేశారని చెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా బీసీలు, మహిళలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశామని తెలిపారు. అప్పట్లో కాసాని లాంటివాళ్లు జడ్పీ ఛైర్మన్లు కాగలిగారంటే అది టీడీపీ వల్లేనని చెప్పారు. ‘‘నేను హైదరాబాద్‌ నిర్మించానని కొంతమంది అంటున్నారు. అది కరెక్టు కాదు. నేను అభివృద్ధి చేసిందీ, పేరు పెట్టిందీ సైబరాబాద్‌. ఆ తర్వాత హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోయాయి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆది నుంచీ తెలంగాణలో గట్టి పునాదులున్న పార్టీ తెలుగుదేశం అని.. ఊరూరా పసుపు జెండా ఎగరేయాలని, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను కేంద్రం, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాల్సి ఉందన్నారు. వైఎస్‌ డాక్టర్‌ కాబట్టి హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చి ఆయన పేరు పెట్టామని జగన్‌ ప్రభుత్వం ప్రకటించిందని, వైఎస్‌ క్రికెట్‌లో ఎన్ని సెంచరీలు కొట్టారని ఆయన పేరు విశాఖ స్టేడియానికి పెట్టారని ప్రశ్నించారు. తనకు ఏ పదవీ అక్కర్లేదని, చంద్రబాబుతో ఉంటే చాలని బక్కని నర్సింలు అన్నారు.

చంద్రబాబుతోనే సాధ్యం: నన్నూరి

ఆరు.. (ఆరంకెల జీతం), ఐదు.. (వారానికి ఐదు రోజులే పని), నాలుగు.. (నాలుగు చక్రాల వాహనం.. కారు), మూడు.. (ట్రిపుల్‌ బెడ్‌రూం ఇల్లు) రెండు.. (ఇద్దరు పిల్లలు), ఒకటి.. (ఒక్క భార్య).. ఇవన్నీ ఉండాలంటే ఐటీ ఉద్యోగం ఉండాలని, అది రావాలంటే చంద్రబాబు నాయకత్వం ఉండాలన్నది యువత ఆకాంక్ష అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అన్నారు. ప్రవేశ పరీక్షలో ఫెయిలైన విద్యార్థికి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీటు ఇచ్చినట్లుగా, కేసీఆర్‌ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన తన కూతుర్ని ఎమ్మెల్సీ చేసుకున్నడు తప్ప రాష్ట్రంలోని నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ నుంచి పలువురి చేరిక

టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కార్యకర్తలు, నాయకులు టీడీపీలో చేరారు. టీఆర్‌ఎస్‌ కార్మిక, యువజన విభాగాలకు చెందిన నాయకులకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి, ఆహ్వానించారు.

కళకళలాడిన ఎన్టీఆర్‌భవన్‌

కాసాని జ్ఞానేశ్వర్‌ తొలుత పెద్దమ్మ గుడిలో పూజలు జరిపారు. అక్కడనుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆయనతో కలిసి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. జానపద కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఎన్టీఆర్‌ భవన్‌ మార్మోగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కాసాని అనుచరులతో ఎన్టీఆర్‌ భవన్‌ కిటకిటలాడింది. పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

తెలంగాణ అభివృద్ధి ఘనత ఎన్టీఆర్‌, చంద్రబాబుదే: కాసాని

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్‌, చంద్రబాబులకే దక్కుతుంది.. మంచి చెప్పే, చేసే పార్టీ టీడీపీ’’ అని అన్నారు. సూర్యచంద్రులున్నంత కాలం తెలుగుదేశం ఉంటుందని.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కాపా కృష్ణమోహన్‌ పార్టీకి రూ.లక్ష విరాళం అందజేశారు.

Updated Date - 2022-11-11T04:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising