VijayaShanthi: డెంగీ కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు
ABN, First Publish Date - 2022-11-29T22:02:00+05:30
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (VijayaShanth) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (VijayaShanth) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కారుకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విజయశాంతి హెచ్చరించారు. రాములమ్మ సోషల్ మీడియా పెట్టిన పోస్టు యథాతథంగా...
''తెలంగాణ వ్యాప్తంగా డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది డెంగీ బారిన పడుతున్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందాయి. వాటి ప్రభావం వల్ల జనాలు డెంగీ బారిన పడుతున్నారు. ఈ సీజన్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జూలై నుంచి ఇప్పటి వరకు 800 డెంగీ కేసులు నమోదయ్యాయి. మూడు నెలల్లో 300పైగా కేసులు కొత్తగా నమోదయ్యాయి. నవంబర్ నెలలోనే 49 కేసులు వచ్చాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు, వర్ని, కోటగిరి, నందిపేట మండలాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. అయితే అధికారికంగా నిజామాబాద్ జిల్లాలో 179, కామారెడ్డి జిల్లాలో 38 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కానీ ప్రైవేట్ హాస్పిటళ్లలో దాదాపు 600 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. డెంగీ టెస్టులు చేయడానికి పరీక్ష కేంద్రాలు కూడా ఎక్కువ లేవు. ఇంత జరుగుతున్న కేసీఆర్ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెబుతుంది.'' అని విజయశాంతి అన్నారు.
Updated Date - 2022-11-29T22:09:13+05:30 IST