Rushikonda Palace : రుషికొండను మింగే అనకొండ!
ABN, First Publish Date - 2023-10-13T03:02:00+05:30
విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సలలో జగన్ ఎన్నాళ్లు కాపురం ఉంటారు? ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మాత్రమే.... ఆ తర్వాత అవి ఖాళీ చేయాల్సిందే... ఎందుకంటే అవి ప్రభుత్వ
ప్రస్తుతానికే అక్కడ సీఎం కార్యాలయం, నివాసం
33 ఏళ్లు లీజుకు దక్కించుకునేలా పావులు
రీడెవల్‌పమెంట్ పేరిట పాత రిసార్టు కూల్చివేత
ఇప్పుడు రూ.500 కోట్లతో కొత్త భవనాలు
ప్రజాధనంతో విలాసవంతమైన సోకులు
అస్మదీయ కంపెనీకు లీజుకిచ్చే వీలు
అదే జరిగితే దర్జాగా 33 ఏళ్లపాటు కబ్జా
అధికారంలో ఉన్నా, లేకున్నా కొండపైనే పాగా
మిగిలిన టూరిజం రిసార్టులపై నిర్లక్ష్యం
రుషికొండ ఒక్కటే ‘రీ డెవల్‌పమెంట్’
ఇది మామూలు ప్లాన్ కాదండోయ్! య‘మహా’ ప్లాన్! వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలైనా, అధికారంలోకి రాలేకపోయినా సరే.. ‘రుషికొండ’ను దర్జాగా కబ్జా పెట్టే ప్లాన్! ఏవో కూల్చారు, ఇంకేవో కట్టారు, అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారు.. ఇవన్నీ పైపైకి కనిపించేవే! లోపల.. బంగాళాఖాతమంత లోతైన ‘ప్లాన్’ ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో కట్టుకున్న ‘ఇంధ్ర భవనం’లాంటి ప్యాలె్‌సలను లీజుపేరిట 33 ఏళ్లపాటు తన గుప్పిటపెట్టుకోవడం! పర్యాటక శాఖలో తీసుకున్న నిర్ణయాలు, తెరవెనుక కదిలిన ఫైళ్లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సలలో జగన్ ఎన్నాళ్లు కాపురం ఉంటారు? ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మాత్రమే.... ఆ తర్వాత అవి ఖాళీ చేయాల్సిందే... ఎందుకంటే అవి ప్రభుత్వ భవనాలు కదా... అని అనుకుంటున్నారా!? అయితే... మీరు తప్పులో కాలేసినట్లే! ఇప్పటిదాకా బయటిప్రపంచానికి తెలిసింది కూడా అంతే! కానీ... లోలోపల చాలా జరుగుతోంది. రుషికొండ ప్యాలె్‌సలను పర్యాటక శాఖ నుంచి లీజు పేరిట 33 ఏళ్లు గుప్పిట పెట్టుకునే ప్రణాళిక అమలవుతోంది. 2021 నుంచే తెరవెనుక తతంగం నడుస్తోంది. టూరిజం భవనాల ‘రీడెవల్‌పమెంట్’పై 2021 మార్చిలో కేబినెట్ ఒక తీర్మానం చేసింది. కానీ... రుషికొండ మినహా ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పర్యాటక భవనాల కోసం చేయాల్సిన ఖర్చంతా రుషికొండపైనే గుమ్మరించారు. ఇప్పటికే దీనిపై రూ.430 కోట్లు ఖర్చుపెట్టారు. మరో 50-60 కోట్ల ఖర్చుతో కూడిన పనులు మిగిలి ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేపట్టి, దాదాపు పూర్తి చేసిన ఏకైక టూరిజం ప్రాజెక్టు ఇది. అమరావతిని నాశనం చేసి, రాష్ట్రం మొత్తాన్ని గాలికొదిలేసి ఈ ఒక్క ప్రాజెక్టుపైనే సీఎం జగన్ ఎందుకు అంత ప్రేమ చూపించారు?
ఇదీ అసలు ‘పథకం’
రాష్ట్రంలో అమలులో ఉన్న పర్యాటక విధానం ప్రకారం... టూరిజం భవనాలను లీజుకు ఇవ్వొచ్చు. దీనికోసం ఓపెన్ బిడ్డింగ్ పిలవాలి. అధిక లీజు ఆఫర్ చేసే వాళ్లకు భవనాలను 33 ఏళ్లపాటు అద్దెకు ఇవ్వొచ్చు. వీటిని పర్యాటక అవసరాలకు ఉపయోగించాలి. ఈ పాలసీని ఉపయోగించుకుని ఆ ప్రకారమే రుషికొండ భవనాలను 33 ఏళ్లపాటు అధికారికంగా ‘కబ్జా’ చేసేందుకు ప్రణాళిక రచించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే... రుషికొండపైన టూరిజం శాఖ కట్టిన భవనాలు కూడా ‘లీజు’కు వెళ్లిపోతాయి. గుట్టుచప్పుడు కాకుండా బిడ్డింగ్‌లు ఆహ్వానిస్తారు. ఏదో ఒక బినామీ కంపెనీ పేరుతోనో, అస్మదీయుల సంస్థ పేరుతోనే లీజును దక్కించుకుంటారు. ఓపెన్ బిడ్డింగ్ కదా... పోటీ లేకుండా ఉంటుందా అని అనొచ్చు. పెద్దలే రంగంలోకి దిగిన తర్వాత... పోటీకి వచ్చేదెవరు? వచ్చినా వారి ముందు నిలిచేది ఎందరు?
సొంతం చేసుకునేందుకే సోకులా?:
రుషికొండపై ఉన్న గదులు కూల్చేసి... ఇప్పుడు కట్టిన భారీ భవనాలు పర్యాటకుల కోసం కాదని ఇప్పటికే తేలిపోయింది. ఇన్నాళ్లు ఉన్న ముసుగు కూడా తొలగించారు. ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం కోసమే నాలుగు బ్లాకులను కట్టినట్లు తేల్చేశారు. నిజానికి... ముఖ్యమంత్రి కోసం అక్కడ రూ.500 కోట్లు ఖర్చు పెట్టనక్కర్లేదు. కానీ... బాగా ‘ముందు చూపు’తోనే ప్రభుత్వం చేత అన్ని వందల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రజాధనంతో ఆ భవనాలను అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇప్పుడు... 33 ఏళ్లకు ‘లీజు’కు తీసేసుకుంటారు. అంటే... సొమ్ము ప్రజలది. సోకు... పెద్దలది! అధికారంలో ఉన్నా లేకపోయినా విశాఖను, అందునా పర్యాటకపరంగా కాసులు కుమ్మరించే రుషికొండ వారి అడ్డాగా మారిపోతుంది. విశాఖకు రాజధానిని తరలించడం, ఉత్తరాంధ్రను ఉద్ధరించడం అంతా ఉత్తిదే!
మిగిలినవన్నీ వెలవెల
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. నిర్వహణ వ్యయం అందక, సిబ్బంది లేక కళ తప్పాయి. రుషికొండ తరహాలోనే బీచ్ రిసార్టులు పర్యాటక శాఖకు మరిన్ని ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటీ కనీస మరమ్మతులకు నోచుకోలేదు. చాలా చోట్ల ప్రభుత్వ టూరిజం యూనిట్లు నిర్వహిస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు ప్రభుత్వానికి డబ్బు చెల్లించలేక వదిలేసి వెళ్లిపోతున్నారు. టూరిజం కార్పొరేషన్ ఎన్నిసార్లు వారిని సంప్రదించినా వారు తిరిగి రావడం లేదు. ఉదాహరణకు, బాపట్ల సమీపంలో సూర్యలంక బీచ్‌లో టూరిజం రిసార్టు ఉంది. దీనికి ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి గతంలో ఎక్కువగా ఉండేది. ఉప్పు నీరు, గాలుల కారణంగా... కాటేజీలకు తరచూ మరమ్మతులు అవసరమైనా పట్టించుకోవడంలేదు. దీంతో చీరాల-బాపట్లలో ప్రైవేటు రిసార్టులు భారీగా పుట్టుకొచ్చాయి. ఖర్చెక్కువైనా పర్యాటకులంతా అటే తరలివెళ్లిపోతున్నారు. ఇదీ... రాష్ట్రంలోని టూరిజం రిసార్టుల పరిస్థితి. ఇలా అన్నింటినీ బలి చేసి... రుషికొండపై మాత్రం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు.
‘ఒబెరాయ్’ కోసం కోటిన్నర ఖర్చు ?
తిరుపతి, వైజాగ్, అన్నవరం, గండికోట ప్రాంతాల్లో టూరిజం శాఖకు చెందిన విలువైన భూములను ఒబెరాయ్ హోటల్స్‌కు అప్పజెప్పారు. పీపీపీ విధానంలో ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఒబెరాయ్‌దే. కానీ... మూడేళ్లుగా అతీగతీ లేదు. గండికోటలో పర్యాటక శాఖ భూమిని ఒబెరాయ్‌కి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన రెండేళ్లకు ఇటీవల అక్కడ ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జగన్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి శంకుస్థాపన, భూమి పూజ ఖర్చు ఒబెరాయ్ చూసుకోవాలి. కానీ... ప్రభుత్వం దాదాపు రూ.కోటిన్నర ఖర్చు చేసినట్లు తెలిసింది.ఇది మామూలు ప్లాన్ కాదండోయ్! య‘మహా’ ప్లాన్! వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలైనా, అధికారంలోకి రాలేకపోయినా సరే.. ‘రుషికొండ’ను దర్జాగా కబ్జా పెట్టే ప్లాన్! ఏవో కూల్చారు, ఇంకేవో కట్టారు, అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారు.. ఇవన్నీ పైపైకి కనిపించేవే! లోపల.. బంగాళాఖాతమంత లోతైన ‘ప్లాన్’ ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో కట్టుకున్న ‘ఇంధ్ర భవనం’లాంటి ప్యాలె్‌సలను లీజుపేరిట 33 ఏళ్లపాటు తన గుప్పిటపెట్టుకోవడం! పర్యాటక శాఖలో తీసుకున్న నిర్ణయాలు, తెరవెనుక కదిలిన ఫైళ్లు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Updated Date - 2023-10-13T03:39:27+05:30 IST