ఖనన వేదన
ABN, First Publish Date - 2023-02-17T00:04:18+05:30
మూడు వేలకుపైగా ఇళ్లు, పది వేలకు పైగా జనాభా.. వందల ఏళ్ల చరిత్ర బత్తలపల్లి సొంతం. అలాంటి ఊరిలో ఎవరైనా చనిపోతే మాత్రం దిక్కులు చూడాల్సిందే. ఖననం చేసేందుకు కాసింత చోటు లేదు. రహదారి వెంబడి స్థలంలో పూడ్చుకోవాల్సిందే. రహదారిని విస్తరిస్తే.. ఆ జాగా కూడా లేకుండా పోతుంది.
బత్తలపల్లిలో శ్మశానానికి స్థలం కరువు
ప్రజలకు తప్పని తిప్పలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
బత్తలపల్లి
మూడు వేలకుపైగా ఇళ్లు, పది వేలకు పైగా జనాభా.. వందల ఏళ్ల చరిత్ర బత్తలపల్లి సొంతం. అలాంటి ఊరిలో ఎవరైనా చనిపోతే మాత్రం దిక్కులు చూడాల్సిందే. ఖననం చేసేందుకు కాసింత చోటు లేదు. రహదారి వెంబడి స్థలంలో పూడ్చుకోవాల్సిందే. రహదారిని విస్తరిస్తే.. ఆ జాగా కూడా లేకుండా పోతుంది. తరాలుగా మండలకేంద్రం వాసులకు ఈ తిప్పలు తప్పట్లేదు. పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు.
బత్తలపల్లి తొలుత గ్రామంగా వందల ఏళ్ల క్రితం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు శ్మశానానికి స్థలం లేదు. మండల కేంద్రంలో ఎవరైనా చనిపోతే తాడిపత్రి రోడ్డులోని రహదారి పోరంబోకు స్థలంలో ఖననాలు చేస్తున్నారు. రోడ్డు విస్తరణ జరిగితే అక్కడ ఏర్పాటు చేసుకున్న సమాధులు నేలమట్టమవడంతోపాటు ఆ స్థలం కూడా లేకుండా పోతుంది. తమ పూర్వీకులు, పెద్దల జ్ఞాపకాలు చెరిగిపోయే పరిస్థితులు నెలకొన్నాయని పలువురు స్థానికులు వాపోతున్నారు. రోడ్డుస్థలం కొద్దిగా ఉండటంతో ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని ఖననం చేయాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం సమాధులు నిర్మిస్తుండటంతో వాటిని తొలగించే పరిస్థితి కూడా లేదు. ఎవరైనా మృతిచెందితే వారిని ఎక్కడ పూడ్చాలని గంటల కొద్దీ దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్నదే కొంత రోడ్డు పోరంబోకు స్థలం.. దానిని కూడా కబ్జారాయుళ్లు వదల్లేదు. శ్మశాన స్థలంలోనూ కొంత ఆక్రమించేశారు. దీంతో కబ్జాకోరల నుంచి స్థలాన్ని రక్షిస్తేనైనా అంతో.. ఇంతో.. స్థలం ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.
రోడ్డుపక్కన పడేయాల్సి వస్తుందేమో..:
శ్మశానం లేక ఎవరైనా చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరిని పూడ్చినచోటే మరొకరిని పూడ్చాల్సి వస్తోంది. భవిష్యతలో మృతదేహాలను రోడ్డుపక్కన పడేయాల్సి వస్తుందేమో?
- యోగానందాచారి, బత్తలపల్లి
స్థలం చూపేవారే లేరు
బత్తలపల్లి రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. మనిషి చనిపోతే మాత్రం పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేదు. సమస్యను వినే అధికారి, ప్రజాప్రతినిధి లేరు.
- పాళ్యం సతీష్, బత్తలపల్లి
స్థలం సేకరించే పనిలో ఉన్నాం
బత్తలపల్లిలో శ్మశానానికి స్థలాన్ని అన్వేషిస్తున్నాం. భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎవరైనా ఇస్తే వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపుతాం.
- యుగేశ్వరిదేవి, తహసీల్దార్
Updated Date - 2023-02-17T00:04:21+05:30 IST