ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్జాగా దోపిడీ...

ABN, First Publish Date - 2023-04-08T00:17:19+05:30

అధికారం ఉందన్న బలుపుతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- అడ్డగోలుగా ఇసుక తరలింపు

- నదులను లూటీ చేస్తున్న అధికార పార్టీ నేతలు

- పేరుకే జేపీ కంపెనీ కాంట్రాక్ట్‌

- అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసైగల్లోనే...

- కర్ణాటకకు తరలిపోతున్న సహజ నిధి

- అనుమతులు ఓ చోట తవ్వకాలు మరోచోట

- రీచుల్లో రోజూ దొంగలెక్కలు

అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. నదీ గర్భాల్లో సహజ నిధి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నాం.. అడ్డొచ్చేదెవరంటూ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. జిల్లాకు జీవనాడిగా ఉన్న ముఖ్య నదులను కొల్లగొట్టేస్తున్నారు. విలువైన ఇసుకను పక్క రాషా్ట్రనికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హిందూపురం, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. చిత్రావతి, జయమంగళి, పెన్నా, కుషావతి, సోమావతి ఇలా జిల్లాలోని నదులన్నింటిపై ఇసుకాసురులు దోపిడీపర్వానికి తెరలేపారు. నిబంధనలను లెక్క చేయకుండా ఇసుక కోసం నదులను అడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రతిరోజూ వందలాది టిప్పర్ల ఇసుకను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, కర్ణాటకకు తరలిస్తున్నారు. రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

పుట్టపర్తి, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): అధికారం ఉందన్న బలుపుతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ముఖ్యమైన నదులను లూటీ చేస్తూ రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలను రైతులు, అధికార, ప్రతిపక్ష ప్రజా సంఘాలు అడ్డుకుంటున్నా పోలీసుల బలగాలతో ఉక్కుపాదం మోపి తవ్వకాలు చేస్తున్నారు. పోలీసుల కళ్లెదుటే ఇసుక దందా చేస్తున్నా అడిగేనాథుడే కరువయ్యారు. చిత్రావతి నది ఉప్పలపాడు ఇసుక రీచ వద్ద తన పొలంలో ఇసుకను తవ్వుతున్న వారిని అడ్డుకోవడంలో విఫలమైన ఓ రైతు నిస్సహాయతతో ఆత్మహత్యకు సైతం యత్నించాడంటే ఇసుకాసురుల దౌర్జన్యం ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. పుట్టపర్తి మండలంలోని రాచువారిపల్లి వద్ద చిత్రావతిలో ఇసుక తవ్వకాలను రైతులు అడ్డుకున్న పోలీస్‌ బందోబస్తుతో నదిలోనే రోడ్డు వేసి ఇసుకను తరలించేస్తున్నారు. తాజాగా పరిగి మండలం జయమంగళినదిలో ఇసుక రీచ పేరుతో చేపడుతున్న తవ్వకాలను టీడీపీ నేతలు అడ్డుతగిలితే అరెస్టు చేసి మడకశిర పోలీస్‌ స్టేషనకు తరలించారు. తర్వాత పోలీస్‌ బలగాలతో ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఇలా రైతులు, ప్రతిపక్షాలు అడ్డుతగిలినా ఇసుకను తరలిస్తున్నారు. జిల్లాలోని ముఖ్యమైన నదుల్లో రాత్రి పగలు తేడాలేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి అడ్డంగా సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రీచల పేరుతో నిబంధనలను ఏమాత్రం లెక్క చేయకుండా రైతుల పొలాలతో సహా నదుల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతలు కావడం, ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు.

బినామీ పేర్లతో తరలింపు

జిల్లాలో పెన్నా అటు చిత్రావతి, జయమంగళి, కుషావతి, సువర్ణముఖి, సోమావతి, సీజీ, పెడబల్లి ప్రాజెక్ట్‌లతోపాటు నదిపరివాహక ఉపనదులున్నాయి. ప్రధానంగా చిత్రావతి, పెన్నా నదుల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఇసుక రీచల్లో వైసీపీ నేతల హవాతో స్థానికంగా బినామీ పేర్లతో వైసీపీ నేతలు ముందుకొస్తున్నారు. ఇసుక ఎవరికి కావాలంటే నేరుగా వైసీపీ నేతలను సంప్రదించాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రీచలో ఇస్తున్నట్లు చెబుతున్నా రెట్టింపు ధరతో విక్రయిస్తున్నారు. జయమంగళి, కుషావతి, సువర్ణముఖి, సోమావతి, సీజీ, పెడబల్లి ప్రాజెక్ట్‌లతోపాటు నదీపరివాహక నదుల్లో అధికార పార్టీ నేతలే ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నాణ్యమైన ఇసుక అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. పుట్టపర్తి రీచ వద్ద ట్రాక్టర్‌ ఇసుక రూ.2,375కు నిర్ధారించారు. నది పక్కనే ఉన్నా పుట్టపర్తి వాసులు రూ.4 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సివస్తోంది. ఇక టిప్పర్‌ రూ.15వేలు చెల్లించి కొనుగోలు చేయాల్సివస్తోంది.

పేరుకే జేపీ కంపెనీ కాంట్రాక్ట్‌

పెన్నా, చిత్రావతి నదులు జిల్లాలో వందల కిలోమీటర్ల మేర ఇసుక మేటలు విస్తరించి ఉన్నాయి. ఈ నదుల్లోనే అపారమైన ఇసుక సంపద ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇసుక రీచల్లో తవ్వకాల పేరుతో జేపీ పవర్‌ వెంచర్‌ కంపెనీ కాంట్రాక్ట్‌ అనుమతులను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ నేతలతోపాటు ఆయా ఎమ్మెల్యేలే ఇసుక దందాలకు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి పక్కనే చిత్రావతి నది నీటి ప్రవాహం మధ్యలో ఇసుకను తరలించేందుకు ఏకంగా రోడ్డే వేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం చూసిచూడనట్లు వదిలేస్తోంది. ఈ ఇసుక రీచ ప్రారంభంలోనే రైతులు వ్యతిరేకించినా పోలీసులతో భయపెట్టి తవ్వకాలు చేపట్టారు. చిత్రావతి నది బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ఉప్పలపాడు వద్ద ఇసుక రీచ నుంచి ప్రతి రోజు వందల టిప్పర్లతో లక్షల టన్నుల ఇసుకను ఉమ్మడి జిల్లాలతో పాటు కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ రీచలో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసైగలో సాగుతోందన్న విమర్శలున్నారు. రీచలో అనుచరులతో ప్రతి రోజూ లక్షల్లో ఇసుకపై సంపాదించిన సొమ్ము ఎమ్మెల్యే ఖాతాల్లోకి చేరుతోందని స్థానిక ప్రజలే పేర్కొంటున్నారు. ఉప్పలపాడు రీచ వైపు ఏఒక్కరూ వెళ్లాలన్నా సాహసించని పరిస్థితి. తాజాగా అపారమైన ఇసుక సంపద ఉన్నా పరిగి మండలం జయమంగళి నదిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ప్రభుత్వ ఇసుక రీచ పేరుతో లూటీకి మొదలు పెట్టారు. రీచలో రోజూ దొంగలెక్కలు నమోదు చేసి అనుమతి ఇచ్చిన రీచలో ఇసుక నిల్వలు దోసేసి మరోచోటికి రోడ్డువేసి తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుక దందా వెనుక అనంతపురానికి చెందిన ఓ వైసీపీ నేత కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ నేతకు రీచలు అప్పగించగా ఆయా నియోజక వర్గాల అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి నదులను దోచేస్తున్నారు.

నారా లోకేశ సెల్ఫీ చాలెంజ్‌

యువగళం పాదయాత్రలో రోడ్డుపై ఇసుక టిప్పర్లు పరుగులు పెడుతున్న తీరుపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ సెల్ఫీ తీసి ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు చాలెంజ్‌ విసిరారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇసుక దందాపై నారా లోకేశ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందా చేశారంటూ వారిపై నిప్పులు చెరిగారు.

Updated Date - 2023-04-08T00:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising