చంపేశారా..!
ABN, First Publish Date - 2023-01-22T00:42:06+05:30
బసినేపల్లి గ్రామంలో ఓ రైతు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైతు ఒంటిపై మహిళలు ధరించే రవిక, ఎద భాగంలో చుట్టి పెట్టిన మరో రెండు రవికలు ఉన్నాయి. దీంతో ఏం జరిగిందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఎవరైనా చంపేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
రైతు అనుమానాస్పద మృతి
శరీరంపై రవిక.. లోపల మరో రెండు
పొలం వద్ద అపస్మారక స్థితిలో..!
చెన్నేకొత్తపల్లి, జనవరి 21: మండల పరిధిలోని బసినేపల్లి గ్రామంలో ఓ రైతు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైతు ఒంటిపై మహిళలు ధరించే రవిక, ఎద భాగంలో చుట్టి పెట్టిన మరో రెండు రవికలు ఉన్నాయి. దీంతో ఏం జరిగిందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఎవరైనా చంపేశారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు, బసినేపల్లికి చెందిన బీరే వీరనారాయణ(46) వ్యవసాయంతోపాటు (చీనీ తోట) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈయనకు 20 సంవత్స రాల క్రితం అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన నాగమణితో వివాహమైంది. వీరికి కూతురు కల్యాణి, కుమారుడు అరవిందు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు ఏర్పడటంతో 12 ఏళ్ల క్రితం విడిపోయారు. వీరనారాయణ ఎప్పటిలాగే శుక్రవారం కూడా తోటకు వెళ్లి తిరిగొచ్చాడు. కూతురు పుట్టిన రోజు ఉండటంతో శుక్రవారం సాయంత్రం ధర్మవరానికి వెళ్లి కేక్ కొనుగోలు చేశారు. తాను పొలం వద్దకు వెళ్లున్నానని, కేక్‌ను తన ఇంట్లో ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పంపాడు. దీంతో చీకటి పడ్డాక తండ్రికి భోజనం తీసుకుని అరవిందు తోట వద్దకు వెళ్లాడు. అక్కడ తండ్రి కనిపించకపోవడంతో ఫోన చేశాడు. ఎంతసేపటికీ తీయకపోవడంతో తన చిన్నాన్న చిన్న ఆంజనేయులుకు ఫోన చేసి విషయం తెలియజేశాడు. దీంతో చిన్న ఆంజనేయులుకు అనుమానం వచ్చి, మరొకరిని వెంట పెట్టుకుని తోట వద్దకు వెళ్లి గాలించాడు. ఈ క్రమంలో పక్క పొలంలో ఆటో కనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా, వీరనారాయణ అపస్మారక స్థితిలో కనిపించాడు. అతని శరీరంపై పంచె, ఛాతిపై రవిక కనిపించాయి. రవిక లోపల రెండు వైపులా రవికలు చుట్టి పెట్టి, హుక్కులు వేశారు. పక్కనే ఉన్న ఆటోలో మద్యం సీసా, లీటర్ వాటర్ బాటిల్, బనియన, అంగీ ఉన్నాయి. వీరనారాయణను చికిత్స నిమిత్తం వెంటనే ఽధర్మవరం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తన అన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారించాలని చిన్న ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరనారాయణ శరీరంపై ఎక్కడా చిన్న గాయం కూడా లేదని, రవికలు ఎందుకు ధరించాడో అర్థం కావడంలేదని పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక మృతికి కారణాలు తెలుస్తాయని అన్నారు. ఎస్‌ఐ శ్రీధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-01-22T00:42:10+05:30 IST