రగులుతున్న అనంత
ABN, Publish Date - Dec 29 , 2023 | 12:37 AM
ఉద్యోగులు, కార్మికుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతోంది. ‘ఇచ్చిన మాటకు కట్టుబడు. హామీలను నెరవేర్చు. మా న్యాయమైన డిమాండ్లను అంగీకరించు’ అని డిమాండ్ చేస్తూ అంగనవాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు.. చివరకు వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధి కూలీలు..! అందరూ రోడ్లపైనే కనిపిస్తున్నారు.
రోడ్డెక్కి గర్జించినపంచాయతీ కార్మికులు
సమగ్ర శిక్ష ఉద్యోగులకు షోకాజ్ బెదిరింపులు
వేతనాల కోసం పనిముట్లతో ఉపాధి కూలీల ధర్నా
మున్సిపల్ కార్మికుల సమ్మెతో నీరు, వెలుగు బంద్
ఉద్యోగులు, కార్మికుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతోంది. ‘ఇచ్చిన మాటకు కట్టుబడు. హామీలను నెరవేర్చు. మా న్యాయమైన డిమాండ్లను అంగీకరించు’ అని డిమాండ్ చేస్తూ అంగనవాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు.. చివరకు వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధి కూలీలు..! అందరూ రోడ్లపైనే కనిపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. సమస్యలను పరిష్కరించేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. వీరి ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతోపాటు కార్మిక, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. సీఎం జగన మోసకారి విధానాలను అవలంభిస్తున్నారని నాయకులు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు.
62 మందికి షోకాజ్ నోటీసులు
దహనం చేసిన ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు
అనంతపురం విద్య, డిసెంబరు 28: సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఉక్కుపాదం మోపైనా వారిని కట్డడి చేయాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో తొమ్మిది రోజులుగా సమ్మెలో ఉన్న సమగ్రశిక్ష ఉద్యోగులను నియంత్రించేందుకు సామదానబేధ దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో గడిచిన 48 గంటల్లో పలువురు కేజీబీవీ సిబ్బందికి సమగ్ర శిక్ష అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. రెండు రోజుల నుంచి అనంతపురం సమగ్రశిక్ష ప్రాజక్టు ఉన్నతాధికారి 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. విధులకు గైర్హాజరీపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై సమగ్రశిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ‘సమ్మె నుంచి వెనక్కు రాకుంటే వేటు వేస్తాం’ అని సమగ్రశిక్ష అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.
నియంత్రించేందుకు....
సమగ్రశిక్ష ఉద్యోగులు ఈ నెల 20 నుంచి సమ్మెలోకి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్సీ ఉద్యోగులు మండల వనరుల కేంద్రాలకు తాళాలు వేసి, నిరసన తెలుపుతున్నారు. ఆ తర్వాత కేజీబీవీ ఉద్యోగులు, సీఆర్టీలు సైతం సమ్మెకు దిగారు. కేజీబీవీల నుంచి సమ్మెకు హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం అణచివేతకు దిగుతోంది. రెండు రోజుల నుంచి సమ్మెకు వెళుతున్న కేజీబీవీ ఉద్యోగుల చిట్టా తయారు చేస్తోంది. కేజీబీవీ ప్రిన్సిపాళ్ల ద్వారా సమ్మెకు వెళ్లిన ఉద్యోగుల వివరాలను తెలుసుకుని, సమగ్రశిక్ష ప్రాజక్టు నుంచి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సీఆర్టీలు 57 మంది, హెడ్ కుక్స్ ముగ్గురు, ఒక అకౌంటెంట్, ఒక అటెండర్‌కు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉన్నతాధికారులు, జీసీడీఓ విభాగం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాప్తాడు, పెద్దవడుగూరు, కూడేరు, అనంతపురం కేజీబీవీలలో ఏడుగురికి చొప్పున, గుత్తిలో ఆరుగురికి, కళ్యాణదుర్గం, బొమ్మనహాళ్, ఉరవకొండ కేజీబీవీల్లో నలుగురు చొప్పున, తాడిపత్రి మైనార్టీ కేజీబీవీలో ఆరుగురికి, వజ్రకరూరు, పామిడిలో ఇద్దరు, డి.హీరేహాళ్‌లో ఒకరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సమ్మెకు వెళ్లిన వారు వెనక్కు వస్తే విధుల్లో చేరుకుంటామని, మొండిగా ముందుకెళితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సమగ్రశిక్ష ప్రాజెక్టులోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించినట్లు సమాచారం. ఆయన తనిఖీలకు వెళ్లి మరీ బెదిరింపులకు దిగుతున్నారని తెలిసింది. అధికారులు నోటీసులు ఇచ్చినా, బెదిరించినా ఉద్యోగులు తగ్గడంలేదు. రోజు రోజుకూ సమ్మెకు వెళ్లే ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది.
ఏం విన్నావ్..? ఎక్కడున్నావ్..?
‘నేను విన్నా.. నేను ఉన్నా..’ అంటూ మాయ మాటలు చెప్పిన జగన, సమగ్రశిక్ష ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ ఉన్నాడో, ఏం విన్నాడో చెప్పాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సమగ్రశిక్ష ఉద్యోగులు 9వ రోజు కూడా అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. వారికి కాలవ మద్దతు తెలిపారు. కనీస హక్కుల సాధన కోసం, వేతనాల కోసం సమ్మె చేయాల్సిన దుస్థితి ఉద్యోగులకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనను నమ్మి సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఆయన సీఎం అయితే తమ బతుకులు బాగుంటాయని ఆశపడిన ఉద్యోగులే ఇప్పుడు జగన దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో మూడుసార్లు వేతనాలు పెరిగాయని, జగన వచ్చిన తర్వాత ఎందుకు పెరగలేదని ఆయన ప్రశ్నించారు. సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెకు టీడీపీ బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల జీవితాలను మార్చే ప్రభుత్వం, బాగోగులు చూసే ప్రభుత్వం రావాలని, అందరూ కలసికట్టుగా ఆ ప్రయత్నం చేయాలని కోరారు. మూడు నెలల తర్వాత చంద్రబాబునాయుడు సీఎం అవుతారని, న్యాయమైన డిమాండ్లను అంగీకరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఉద్యోగులు జేఏసీ జిల్లా చైర్మన విజయ్, ఇతర నేతలు సమస్యలపై కాలవ శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు.
షోకాజ్ నోటీసుల దహనం
సమ్మె నేపథ్యంలో కేజీబీవీ ఉద్యోగులకు సమగ్రశిక్ష ప్రాజక్టు అధికారులు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు వాటిని దహనం చేసి నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెను అణచివేయడానికే నోటీసులు ఇస్తున్నారని, ఏ ఉద్యోగీ భయపడాల్సిన పనిలేదని జేఏసీ చైర్మన విజయ్ అన్నారు. మహిళలు కదం తొక్కాలని, సమగ్రశిక్ష ఉద్యోగుల సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపాలని పిలుపునిచ్చారు. సమ్మెకు టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలు మండలాల నుంచి వచ్చిన సీఆర్టీలు, మండల అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంటీ ఆపరేటర్లు, కేజీబీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జగనతో ఎన్నికల్లో ఆడుకుంటాం.. అంగనవాడీల హెచ్చరిక
అనంతపురం విద్య: తమను రోడ్డుపైకి తెచ్చిన సీఎం జగనతో ఎన్నికల్లో ఆడుకుంటామని అంగన్వాడీలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగుల సమస్యలను వదిలేసి ‘ఆడుదాం ఆంధ్రా’ అంటున్న జగన వైఖరిని నిరసిస్తూ అనంతపురంలో ఆందోళనకు దిగారు. ‘ప్రభుత్వంతో ఆడుదాం అంగన్వాడీ అక్కాచెల్లెళ్లూ’ అంటూ రోడ్డుపై కబడ్డీ ఆడుతూ నిరసన తెలిపారు. ‘వేతనం రూ.26 వేలకు పెంచాలి.. గ్రాట్యుటీ ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన సెంటర్లుగా ప్రకటించాలి’ అని కూత పెట్టారు. జిల్లావ్యాప్తంగా గురువారం 17వ రోజు సమ్మె కొనసాగించారు. ఉరవకొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. బొమ్మనహాళ్, బెళుగుప్ప, శింగమనల తదితర ప్రాంతాలలో తమ సమస్యలను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రి చిరునామాకు పంపించారు. శింగమనల తహసీల్దారు కార్యాలయం వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. కలెక్టరేట్ దీక్షా శిబిరం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీలు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంగనవాడీల డిమాండ్లు న్యాయమైనవేనని అన్నారు. సీఎం జగన ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగనవాడీలు అడుగుతున్నారని గుర్తు చేశారు. అయినా చర్చల పేరుతో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని జగనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ కూడా అంగనవాడీల ఆందోళనకు మద్దతు తెలిపారని అన్నారు. పాదయాత్ర సభలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు సైతం అంగనవాడీల సమస్యలను ప్రస్తావించారని గుర్తుచేశారు.
ఉపాధి కూలీల ఉసురు తప్పదు
అనంతపురం క్లాక్‌టవర్: ఉపాధి కూలీల సొమ్మును పక్కదారి పట్టించిన సీఎం జగనకు గ్రామీణ పేదల ఉసురు తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి అన్నారు. ఉపాధి పనులు కల్పించి, కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి డ్వామా పీడీ కార్యాలయం ఎదుట గురువారం పనిముట్లుతో నిరసన తెలిపారు. ఉపాధి కూలీల నిధులను పక్కదారి పట్టిస్తున్న సీఎం జగనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. యంత్రాలతో పనులు చేయడం ఆపి, కూలీలతోనే పనులు చేయించాలని డిమాండ్ చేశారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి ఉపాధి కూలీకి ఏడాదికి 200 రోజులు పనిదినాలు కల్పించి, కనీస వేతనం రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు. వేసవి అలవెన్సులు, పనిముట్లు, కనీస వసతులు కల్పించాలని అన్నారు. అనంతరం డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉరితాళ్లతో ఉద్యమం
అనంతపురం న్యూటౌన: అనంతపురం నగరంలో పంచాయతీ కార్మికులు మెడకు ఉరితాళ్లను బిగించుకుని గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి.. ధర్నా చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు వారికి మద్దతు తెలిపారు. పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కాలవ అన్నారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని పంచాయతీ కార్మికులు నిరంతరం శ్రమపడుతున్నారని కార్మిక సంఘం నాయకులు నాయకులు గోపాల్, నాగేంద్ర, శివప్రసాద్ అన్నారు. అలాంటి కార్మికుల సమస్యలను గాలికి వదిలేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క విధంగా రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనాలు అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు స్వచ్ఛభారత కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా తమకూ రూ.6 వేల హెల్ అలవెన్స చెల్లించాలని కోరారు. పీఎఫ్, ఈఎ్‌సఐ అమలు చేయాలని, యూనిఫాం పనిముట్లు తదితరాలను సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు, సాధారణ మరణాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించి, బాధిత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని కోరారు. పంచాయతీల పరిధిలోని కార్మికులందరినీ రెగ్యులర్ చేసి... ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీపీఓ కార్యాలయ ఏఓ విశ్వనాథ్‌రెడ్డికి వినతి ప్రతం సమర్పించారు.
చెవిలో పూలతో నిరసన
అనంతపురం క్రైం: నగరంలో పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం మూడోరోజుకు చేరుకుంది. కార్పొరేషన కార్యాలయం ఎదుట కార్మికులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, నాయకులు భవానీ రవికుమార్ మద్దతు తెలిపారు. సీఐటీయూ పోరాటాలు చేస్తూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని, కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నాయకులు విమర్శించారు. అందుకే కార్మికులు రోడ్డెక్కారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు బండారు స్వామి, తిరుమలేష్, ఓబుళపతి, పోతులయ్య, మల్లికార్జున, సంజీవరాయుడు, సురేష్, నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
చెత్త తరలింపు అడ్డగింత
ప్రైవేట్ ట్రాక్టర్లలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికారులు చెత్తను తరలించే ప్రయత్నం చేశారు. ఈ వాహనాలను క్లాక్ టవర్ సమీపంలో కార్మికులు అడ్డుకుని, వెనక్కు పంపారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, మూడో డివిజన కార్పొరేటర్ కుమారమ్మకు వేర్వేరుగా మున్సిపల్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణ రోజా పూలు ఇచ్చారు. సమ్మెకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లున్న ప్రాంతాలు, నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలలో గురువారం రాత్రి వీధి దీపాలు వేయకుండా నిరసన తెలిపారు.
Updated Date - Dec 29 , 2023 | 12:37 AM