తత్కాల్ కష్టాలు
ABN, First Publish Date - 2023-03-16T00:03:51+05:30
అనంతపురం రైల్వే స్టేషనలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. ఏదైనా సమస్య తలెత్తితే సిబ్బంది కొరత పేరుతో ఉన్నతాధికారులు సైతం దాన్ని దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.
అన్ని టిక్కెట్లకు ఒకటే రిజర్వేషన కౌంటర్
నాలుగు ఉన్నా ఒకటే వాడకం
టిక్కెట్ దొరుకుతుందో లేదోనని ప్రయాణికుల ఆందోళన
అనంత రైల్వే స్టేషనలో అవస్థలు
అనంతపురం న్యూటౌన, మార్చి 15: అనంతపురం రైల్వే స్టేషనలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి. ఏదైనా సమస్య తలెత్తితే సిబ్బంది కొరత పేరుతో ఉన్నతాధికారులు సైతం దాన్ని దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన ప్రాంగణంలో రిజర్వేషన కౌంటర్ కోసం నూతన భవనాన్ని నిర్మించారు. అందులో 4కౌంటర్లు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించారు. అయితే నిర్వహణ మాత్రం అందుకు విరుద్ధంగా అమలవుతోంది. గతంలో పాత రిజర్వేషన కౌంటర్ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల వరకు అయిన కనీసం రెండు కౌంటర్లు అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం సౌకర్యాలు పెంచారు. దీనికి తోడు ప్రయాణికుల రద్దీ పెరిగింది. కానీ రిజర్వేషన కౌంటర్ మాత్రం ఒక్కటే అందుబాటులో ఉంటోంది. ఆఖరికి తత్కాల్ సమయంలో అయిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుం దా అంటే అదీ లేదు. అందరూ ఎవరికీ ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేరుకు మాత్రం తత్కాల్ సమయంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియ మిస్తున్నామని చెబుతున్నారు. నిర్వహణ మాత్రం మరుస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా రెండు కౌంటర్లు తీయడంలేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 సమయంలో ఒక్క రిజర్వేషన కౌంటర్ మాత్రమే అందుబాటులో ఉంది. తత్కాల్ కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమకు వరకు టిక్కెట్ వస్తుందో లేదో అని బిక్కు బిక్కుమంటూ లైనలో నిలబడాల్సిన పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో పలువురు అనంతపురం సమీపంలోని స్టేషన్లుకు వెళ్తున్నారు. అలా వెళ్లలేని వారు దళారులను ఆశ్రయించడం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉన్నతాధికారులు స్పందించి కనీసం తత్కాల్ సమయం రెండు గంటల పాటు అయిన ప్రయాణికుల సౌకర్యార్థం రెండు రిజర్వేషన కౌంటర్లు అందుబాటులో ఉండేలా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
Updated Date - 2023-03-16T00:03:51+05:30 IST