వైసీపీలో నైరాశ్యం
ABN, First Publish Date - 2023-11-17T00:07:53+05:30
హిందూపురంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర జనం చూసిన తరువాత అధికార పార్టీలో నైరాశ్యం నెలకొంది. కంచుకోట కాదుకదా.. అధికార పార్టీలోని ముఖ్య నాయకులనే సభకు పిలుచుకోలేకపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
జనం రాకపోవడంతో అంతర్మథనం
బస్సు యాత్రకు ముఖ్య నాయకులే డుమ్మా
ఇంత ఖర్చుచేసినా ప్రయోజనం ఏంటి?
సభ ఫ్లాప్‌పై రెండు వర్గాల్లో తీవ్ర చర్చ
హిందూపురం, నవంబరు 16: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ప్రారంభమై నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి ఈసారి జగనకు గిఫ్ట్‌గా ఇస్తామనీ, అందుకు తగ్గట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద స్కెచ వేశాడని వైసీపీ నాయకులు మూడు నెలలుగా ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. ఇక్కడున్న మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఇక్బాల్‌ను పంపించేసి, ఆ స్థానంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వేణురెడ్డిని వివాహం చేసుకున్న కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను సమన్వయకర్తగా నియమించారు. జగన గీసిన ప్లానతో టీడీపీపై మహిళతో పోటీకి దింపి కంచుకోటను బద్దలు కొడతామని వైసీపీ నాయకులు మొన్నటి వరకు చెప్పుకున్నారు. బుధవారం హిందూపురంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర జనం చూసిన తరువాత అధికార పార్టీలో నైరాశ్యం నెలకొంది. కంచుకోట కాదుకదా.. అధికార పార్టీలోని ముఖ్య నాయకులనే సభకు పిలుచుకోలేకపోయారన్న అపవాదు మూటగట్టుకున్నారు. వారం రోజులుగా నియోజకవర్గానికి చెందిన మండలాల్లో జనాన్ని సమీకరించేందుకు నాయకులపై ఒత్తిళ్లు తెచ్చి, అధికారుల ద్వారా బెదిరించినా ప్రయోజనం లేదన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. వైసీపీ నాయకుల మాటలు, అక్కడకు వచ్చిన జనాలకు ఏమాత్రం పోలికలేదు. దీనినిబట్టి హిందూపురంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలంటే అంత సులువు కాదని సభకు వచ్చిన వైసీపీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం.
జనం రాకపోవడంతో అంతర్మథనం
వైసీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హిందూపురంలో తమ తడాకా చూపించాలని సామాజిక సాధికార బస్సుయాత్ర పెట్టారు. వారు 25వేల మంది వస్తారని అంచనా వేశారు. అవి తల్లకిందులయ్యేలా పదోవంతు కూడా సభకు రాకపోవడంతో నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. ముఖ్య నాయకుల వద్ద ఉన్న కొంతమంది భజనపరులు అధిక శాతం వచ్చారని చెప్పుకుంటున్నా పార్టీ కోసం పనిచేసే కొంతమంది బహిరంగంగా జనం రాలేదని చెప్పుకోవడం ఆ పార్టీలో వంతైంది. ఇంత ముందుగా ప్లానచేసినా, అందరికీ చెప్పినా జనం రాకపోవడానికి కారణం ఏంటని అన్వేశించే పనిలో ముఖ్య నాయకులు పడ్డారు.
ముఖ్య నాయకులే డుమ్మా
సామాజిక సాధికార బస్సుయాత్రకు నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులే డుమ్మా కొట్టడంపై అందరిలో కలవరం మొదలైంది. అసలు ఆ నాయకులు రాకపోవడానికి కారణాలు ఏమిటని అధికార పార్టీలోని ముఖ్య నేతలు ఆరాతీస్తున్నారు. అధిక శాతం మంది ముఖ్య నాయకులు ఈ సభకు ఆహ్వానించలేదన్న ప్రచారం వైసీపీలో మొదలైంది. అందరినీ కలుపుకుని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుకదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సభ ఫ్లాప్‌పై తీవ్ర చర్చ
హిందూపురం సభ ఫ్లాప్ అయినట్లు అధికార పార్టీలోని రెండు వర్గాల నాయకుల అనుచరులు తీవ్ర చర్చకు తెరలేపారు. ఓ నాయకుడి అనుచరులైతే ఏకంగా సభ జరిగిన ప్రాంతం నుంచి వీడియో తీసి, వెయ్యి మంది కూడా జనం రాకపోయినా పదివేల మంది వచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతోపాటు బుధవారం సభా ప్రాంగణంలో అధికార పార్టీలోని రెండువర్గాల నాయకులు దగ్గరుండి సభ ఎలా జరిగిందనే తీరుపై ఎప్పటికప్పుడు వారి ముఖ్య నాయకులకు సమాచారం చేరవేశారు. ఆ రెండు వర్గాల నాయకులు ఈ సభ సక్సెస్ కాకూడదని కోరుకున్నారు. వారనుకున్నదే జరగడంతో వారిలో పట్టరాని ఆనందం మొదలైంది. ఏది ఏమైనా సభ జరిగి అధికార పార్టీలో నైరేశ్యం నెలకొందనడంలో సందేహం లేదు.
ఇంత ఖర్చు చేసినా ప్రయోజనం ఏంటి?
వైసీపీ సమన్వయకర్త దీపికను నియమించిన తరువాత హిందూపురంలో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం ఇదే. ఈ సభను సక్సెస్ చేయడం తద్వారా అధికార పార్టీలో కొంతమంది నెలకొన్న అనుమానాలను తొలగించాలని దీపిక వర్గం తీవ్రంగా కష్టపడింది. జనం మాత్రం అందుకు తగ్గట్టుగా రాలేదు. బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్రకు సుమారు 70లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చయినట్లు అధికార పార్టీలోని కొంతమంది ముఖ్య నాయకులు లెక్కలు వేశారు. పట్టణంలో కొంతమంది కౌన్సిలర్లు టోకన్లు వేసుకుని రూ.500చొప్పున నగదు ఇచ్చి మద్యం బాటిళ్లు అందజేసినా వారు సభకు వచ్చింది మాత్రం కొందరే అంటూ కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఖర్చుచేసినా జనం రాకపోవడంతో వైసీపీ ముఖ్య నేతలు మండిపడినట్లు సమాచారం.
Updated Date - 2023-11-17T00:07:56+05:30 IST