నేడు రాజధాని గ్రామాల్లో నిరసనలు
ABN, First Publish Date - 2023-05-26T03:11:45+05:30
మాట తప్పను.. మడం తిప్పను అని చెప్పుకునే సీఎం జగన్ రాజధాని విషయంలో
నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలు, నల్ల బెలూన్లతో రావాలని పిలుపు
ప్రతి ఇంటికీ వెళ్లి ఆహ్వానం పలికిన మహిళలు, రైతులు
తుళ్ళూరు(తాడికొండ), మే 25 : మాట తప్పను.. మడం తిప్పను అని చెప్పుకునే సీఎం జగన్ రాజధాని విషయంలో అధికారంలోకి రాకముందు చెప్పిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు మార్చారని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్న ఆయన బయటివారికి సెంటు భూమి పంపిణీ కార్యక్రమం తలపెట్టడంతో శుక్రవారం నిరసనలు వ్యక్తం చేయడానికి రాజధాని రైతులు సిద్ధమయ్యారు. రాజధాని 29 గ్రామాలలో ఉన్న రైతు ధర్నా శిబిరాలలో నల్లరిబ్బన్లు, నల్ల కండువాలు, నల్ల బెలూన్లతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. తప్పనిసరిగా ఇంటికొకరు చొప్పున శిబిరానికి వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, రైతులు ఆహ్వానం పలికారు. ‘మన భూములను పేదలకు సెంటు భూమి పేరుతో పంచుతున్నారు. దీనిపై మనం నిరసన వ్యక్తం చేసి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది’ అని స్పష్టం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఐదుకోట్ల మందికి దాని ఫలాలు అందించాల్సింది పోయి, నానా రకాలుగా సీఎం జగన్ నాశనం చేస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకొని తగిన గుణపాఠం చెప్పకపోతే తెలుగు జాతికే ముప్పు వాటిల్లుతుందని తేల్చిచెప్పారు.
వైసీపీ ర్యాలీకి 30 యాక్టు.. 144 వర్తించవా
3రాజధానుల శిబిరం నుంచి శుక్రవారం సెంటు భూమి పంపిణీ జరిగే సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించిన కొందరు వైసీపీ నాయకులు జగన్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కటౌట్‌లకు పాలాభిషేకం చేశారు. సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30 అమలులో ఉన్నాయంటున్న పోలీసులు వైసీపీ ర్యాలీకి ఎలా అనుమతిచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది చట్ట ఉల్లంఘన కాదా? అని నిలదీశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ భూములను అప్పనంగా పంచి పెడుతూ.. పుండు మీద కారం చల్లినట్టు చేయడం సిగ్గుచేటని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-26T03:11:45+05:30 IST