జగన్ అక్రమాస్తుల కేసులోభారతీ సిమెంట్స్‌కు సుప్రీం నోటీసులు
ABN, First Publish Date - 2023-07-06T03:25:47+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్,..
జగతి, విజయసాయిరెడ్డికి కూడా సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసులు
విచారించాలని గతంలో టీ హైకోర్టు ఆదేశం
సీబీఐ కేసుల్లో తీర్పు వచ్చేవరకు..
ఈడీ కేసుల్లో తుది తీర్పు నిలిపివేతకు నిర్దేశం
దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఈడీ
తదుపరి విచారణ సెప్టెంబరు 5కి వాయిదా
న్యూఢిల్లీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ దాఖలుచేసిన కేసుల్లో తీర్పు వెలువడ్డాకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుల విచారణ చేపట్టాలని.. ఒకవేళ సీబీఐ, ఈడీ కేసులను సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పులు వెలువడేవరకు ఈడీ కేసుల్లో తీర్పులను నిలిపి ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలు చేసింది. వీటన్నిటిపై బుధవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ‘ఒకవేళ ప్రధాన కేసుల్లో నిర్దోషులుగా తేలినా.. మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ ట్రయల్‌ను కొనసాగించవచ్చు కదా! దీనిని కూడా తేల్చాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు స్పందిస్తూ.. శాంక్షన్ ఆర్డర్ సరిగా లేదన్న కారణంతో నిర్దోషిగా తేల్చితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘రెండు ట్రయల్స్ సమాంతరంగా జరుపవచ్చని కూడా హైకోర్టు పేర్కొంది. దాని తీర్పు మొత్తం తప్పని మేమనడం లేదు. అన్ని పార్టీల వాదనలూ వింటాం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. భారతి సిమెంట్స్ తరఫు న్యాయవాది జ్ఞానేంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఈడీ కేసుల్లో ట్రయల్ జరుపకూడదని హైకోర్టు తీర్పులో లేదని, ప్రధాన కేసు పరిష్కారమయ్యేంత వరకు తుది తీర్పును నిలుపుదల చేయాలని మాత్రమే ఆదేశించిందని తెలిపారు. విజయ్ మదన్‌లాల్ చౌధురి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆ కేసు కేవలం నిర్దోషిత్వానికే పరిమితం కాదని, డిశ్చార్జ్‌కు కూడా వర్తిస్తుందని జ్ఞానేంద్రకుమార్ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘విజయ్ మదన్‌లాల్ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇవ్వాలా అన్నది ఇక్కడ ప్రశ్న. ఆ స్పష్టత మేమివ్వాలా.. లేదంటే త్రిసభ్య ధర్మాసనానికే దీనిని పంపించాలా అన్న అంశాలపై వాదనలు విని నిర్ణయిస్తాం’ అని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసి.. తదుపరి విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేసింది. అయితే ఈ ఐదు పిటిషన్లలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి ప్రతివాదిగా ఉన్న కేసులో తీర్పు వేరుగా ఉన్న రీత్యా ఈ పిటిషన్ల నుంచి దాన్ని వేరు చేసింది. దానిపై ఈనెల 14న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్‌కు జారీచేసిన నోటీసులను ఆ సంస్థ తరఫు న్యాయవాదులు అక్కడే స్వీకరించారు. సమాంతరంగా ట్రయల్ జరుపవచ్చని హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాన్ని సవాల్ చేస్తూ తాము దాఖలుచేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని కోర్టుకు తెలిపారు.
Updated Date - 2023-07-06T03:25:47+05:30 IST