CBN and Pawan: ఎలా ముందుకెళ్దాం?
ABN, First Publish Date - 2023-04-30T02:25:31+05:30
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి, ఏ వ్యూహంతో...
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి?
చంద్రబాబు, పవన్ సమాలోచనలు
అమరావతి, హైదరాబాద్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి, ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధిపతి పవన్‌కల్యాణ్ సమాలోచనలు జరిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసగృహంలో శనివారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ సమాలోచనలు జరిగాయి. జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసానికి పవన్ ఒక్కరే వచ్చారు. చంద్రబాబు కూడా ఒక్కరే ఉన్నారు. మరెవరూ లేకుండా వారిద్దరే ఏకాంతంగా సమావేశమయ్యారు. గతంలో వారిద్దరూ కలిసిన ప్రతిసారీ తమ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేవారు. ఈసారి అటువంటిదేమీ జరగలేదు. తమ భేటీ జరిగినట్లుగా ఫొటోలు, వీడియోలు మాత్రం విడుదలచేశారు. తాజా రాజకీయ పరిణామాలపైనే వారి భేటీ జరిగినట్లు ఆయా పార్టీలవర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితం పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీలోని వివిధస్థాయి నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో వారితో ఆయన కొంత చర్చించారు. ఆ అంశాలు శనివారం వీరి భేటీలో చర్చకు వచ్చాయని సమాచారం. కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రంలో మరింత స్పష్టత వస్తుందని, ఆ ఫలితాల తర్వాత మరోసారి భేటీ కావాలని ఉభయులూ నిశ్చయించుకొన్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, వివిధ వర్గాల వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్, అధికార పార్టీ తన ప్రచారానికి అమలుచేస్తున్న వ్యూహం... దానిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణ కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున రూపొందిస్తున్న కార్యాచరణను కూడా పవన్ వివరించారు.
Updated Date - 2023-04-30T02:30:17+05:30 IST