YCP State : ఏపీ స్టేటా... సొంత ఎస్టేటా?
ABN, First Publish Date - 2023-11-10T03:31:20+05:30
పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. అంతటితో ఊరుకోకుండా... ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ జెండా ఎగరేశారు. పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న గీతను చెరిపేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే... బరితెగించారు! ఇదీ... ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి?’
ప్రభుత్వ పాలనలో ఎన్నడూలేని బరితెగింపు
‘ఏపీకి జగనే ఎందుకు’ అంటూ హడావుడి
ప్రభుత్వ సిబ్బందితో రాజకీయ అజెండా అమలు
సచివాలయాల ముందు వైసీపీ జెండాల ఆవిష్కరణ
నిస్సహాయంగా చూస్తూ నిల్చున్న అధికారులు, సిబ్బంది
సిగ్గుతో నిలబడ్డ కొందరు, ఫొటోలకు దూరంగా ఇంకొందరు
ఆదినుంచీ అదే పంథాలో సాగుతున్న జగన్ సర్కారు
వలంటీర్లతో రాజకీయం.. వారిపై గృహసారథుల పెత్తనం
ఇప్పుడు కలెక్టర్ల నుంచి వలంటీర్ దాకా ప్రభుత్వ సేవలోనే
పార్టీ కార్యక్రమమైతే ప్రభుత్వ సిబ్బంది పాల్గొనకూడదు. ప్రభుత్వ కార్యక్రమమైతే పార్టీ జెండా ఎగరేయకూడదు. కానీ.. ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి?’ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు తమ పార్టీ జెండా ఎగరేశారు. మరి... ఇది ఏ రకమైన కార్యక్రమం?
జాతీయ జెండా ఆవిష్కరిస్తే.. పౌరులుగా గౌరవ వందనం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమక్షంలో పార్టీ జెండాను ఎగరేశారు. మరి... ఉద్యోగులు ఏం చేయాలి? సెల్యూట్ చేయాలా? చప్పట్లు కొట్టాలా?
ఏమిటి వారికీ ఖర్మ?
గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లలో కొన్నిచోట్ల ‘ఫ్యాన్’ గుర్తు కూడా ముద్రించారు. మరి... ఇది ప్రభుత్వ కార్యక్రమం ఎందుకవుతుంది?
‘మా నమ్మకం నువ్వే జగన్’ అనేది రాజకీయ నినాదం. ఆ స్టిక్కర్లను బలవంతంగా ఇంటింటికీ అతికించారు. ఇప్పుడు... ప్రభుత్వ ఖర్చుతో ముద్రించిన బ్రోచర్ మీద అదే నినాదం కనిపిస్తోంది. ఇలాగే వదిలేస్తే... అన్ని ఇళ్లకూ వైసీపీ రంగులు పులిమినా పులిమేస్తారు.
గురువారం సచివాలయాల వద్ద ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బోర్డులు ఆవిష్కరించి... ‘జగనే ఎందుకు కావాలి!’ పై సమావేశాలు నిర్వహించాలని ఉద్యోగులకు ఆదేశాలు అందాయి. కానీ... ఏకంగా సచివాలయాల వద్ద వైసీపీ జెండాలు కూడా ఎగరేశారు. అంటే... పార్టీ కార్యాలయం నుంచి ఆ మేరకు ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. అంతటితో ఊరుకోకుండా... ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ జెండా ఎగరేశారు. పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య ఉన్న గీతను చెరిపేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే... బరితెగించారు! ఇదీ... ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి?’ కార్యక్రమం మొదలైన తీరు! గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సచివాలయాల ముందు వైసీపీ ప్రజాప్రతినిధులు తమ పార్టీ పతాకాలను ఎగురవేశారు. ఏం చేయాలో, ఎలా అడ్డుకోవాలో తెలియక అధికారులంతా బిక్కమొహం వేసుకుని చూస్తూ నిల్చున్నారు. ఇక... ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి!’ అనే బ్రోచర్‌తో ప్రభుత్వ ఉద్యోగులు ఫొటోలు దిగారు. వారిని వైసీపీ నేతలు పార్టీ కార్యకర్తల్లాగా మార్చేశారు. ఇంకా చెప్పాలంటే... ముఖ్యమంత్రిగా బాధ్యతాయుత పాలన సాగించాల్సిన జగన్... ఏపీ స్టేట్‌ను తన సొంత ఇడుపులపాయ ఎస్టేట్‌గా భావిస్తున్నారు.
ఇంత అడ్డగోలుగానా...
‘అధికారాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాం’ అని వేదికలు ఎక్కి సుద్దులు చెప్పే ముఖ్యమంత్రి జగన్... పార్టీ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి... మా నమ్మకం నువ్వే జగన్’ అనేవి అచ్చంగా రాజకీయ నినాదాలు. ఇవే నినాదాలతో అనేక అబద్ధాలు, అర్ధసత్యాలతో 24 పేజీల కరదీపికను ముద్రించారు. నిజానికి... ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో దీనిని రాజకీయ కార్యక్రమంగానే చేపడుతున్నట్లు తొలుత ప్రకటించారు. నెల రోజుల కిందట తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షా్‌పను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నవంబరు వరకు పొడిగిస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రతినిధుల సభలో... సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. అలాగే... నవంబరు 9వ తేదీ నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్?’ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. అంటే.. ఇది వైసీపీ కార్యక్రమంగానే పార్టీ నేతలందరూ భావించారు. ‘గడప గడపకూ’లో జనం నిలదీతలు పెరగడంతో దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. బస్సు యాత్ర కూడా తుస్సుమనడంతో... రూటు మార్చేశారు. ఈ నెల 6వ తేదీన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని ఆదేశించారు. ఐఏఎ్‌సలు, సీనియర్ ఐఏఎ్‌సలు ఎంతోమంది పాల్గొన్న ఈ సమీక్షలో ఒక్కరంటే ఒక్కరూ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ‘‘ఇది కరెక్ట్ కాదు. ఇది ఫక్తు రాజకీయ కార్యక్రమం. కనీసం పేరు మార్చండి’’ అని ఒక్కరంటే ఒక్కరూ సూచించలేదు. అలాంటి సలహా ఇస్తే ఏం జరుగుతుందో తెలిసి భయపడ్డారో... ‘ఎస్ బాస్’ అనడానికి అలవాటు పడ్డారో తెలియదుగానీ... అందరూ తలలూపారు. దాని ఫలితమే... గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు పార్టీ జెండాలు ఎగిరాయి. పార్టీ జెండాల ముందు అధికారులు చేతులుకట్టుకుని నిలబడ్డారు. కొన్నిచోట్ల మాత్రం సిగ్గుపడిన సిబ్బంది... ఫొటోల్లో పడకుండా దూరంగా నిల్చున్నారు.
ఈ బరితెగింపు ఇదే తొలిసారి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర వరకు... ఎంతోమంది ముఖ్యమంత్రులు పని చేశారు. కానీ... జగన్‌లాగా ఎవ్వరూ పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య గీతను చెరిపివేయలేదు. ఇలాంటి బరితెగింపు చర్యలకు దిగలేదు. జగన్ వచ్చీ రాగానే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు పులిమారు. హైకోర్టు తిట్టిపోయడంతో వేసిన రంగులు మార్చేశారు. ఎన్నికలముందు మరోసారి మళ్లీ రంగుల బాట పట్టారు. ఇక... ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించే ‘బటన్ నొక్కుడు’ కార్యక్రమాలను ఫక్తు రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలముందు అన్ని విలువలూ వదిలేస్తున్నారు. పార్టీ కార్యక్రమంగా నిర్వహించాల్సిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు.
అనంతపురం జిల్లా యాడికి పంచాయతీ కార్యాలయంలో బుక్‌లెట్ ఆవిష్కరిస్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, సర్కిల్‌లో ఎంపీడీఓ లక్ష్మినారాయణ, ఈవోపీఆర్డీ వెంకటేశ్
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం సచివాలయం వద్ద వైసీపీ జెండాను ఎగురవేస్తున్న మాజీ మంత్రి అవంతి
అధికారులా... కార్యకర్తలా?
ప్రభుత్వ కార్యక్రమాలను అధికారుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ప్రజలకు, ప్రభుత్వానికీ మధ్య వారే వారధులు. ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే సరిచేయాల్సిందీ, పాలకులదృష్టికి తీసుకెళ్లాల్సిందీ అధికారులే. కానీ... ‘మళ్లీ జగనే కావాలి’ అనేది ఫక్తు రాజకీయ కార్యక్రమం. ‘నన్నే మళ్లీ ఎన్నుకోండి’ అని ప్రజలను జగన్ కోరవచ్చు. కానీ... ‘జగన్‌నే మళ్లీ గెలిపించండి’ అని అధికారులు చెప్పడం కుదరదు. ఎందుకంటే... వాళ్లు ప్రజా సేవకులేగానీ, పార్టీ కార్యకర్తలు కాదు. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన వారంతా ఈ స్పృహతోనే మెలిగారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మాత్రమే ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. అంతే తప్ప... సొంత డబ్బా కొట్టుకోవడానికి కానే కాదు. ఇప్పుడు జగన్ తొలిసారి ఆ గీత దాటారని రిటైర్డ్ బ్యూరోక్రాట్లు పేర్కొంటున్నారు. పాలకుడి హోదాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో ఉంటుంది. అంత మాత్రాన... ప్రభుత్వ సిబ్బంది ఆయన సేవకులని కాదు. ఆయన పార్టీ జెండా మోయాలనీ కాదు.
ఆది నుంచీ అదే వ్యూహం...
అధికారంలోకి వచ్చిన రోజు నుంచే జగన్ రాజకీయాన్నీ, ప్రభుత్వ కార్యక్రమాలనూ కలిపేసి కలగాపులగం చేస్తున్నారు. వచ్చీ రాగానే వలంటీర్లను నియమించారు. ‘వాళ్లంతా మా పార్టీ కార్యకర్తలే’అని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు నిర్వహించే పార్టీ సమావేశాలకు వలంటీర్లు రావాల్సిందే. ఒకవైపు వలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూనే... వాళ్ల మీద పెత్తనానికి పార్టీ తరఫున గృహ సారథులను నియమించారు. ఇప్పుడు... ‘మళ్లీ జగనే ఎందుకు?’ అంటూ కలెక్టర్ నుంచి వలంటీర్ దాకా మొత్తం ప్రభుత్వ సిబ్బందితో పార్టీ సేవ చేయించుకుంటున్నారు. ‘మా ఓటర్లు వేరు. మా స్ట్రాటజీ వేరు’ అని వైసీపీ నేతలు తరచూ చెబుతుంటారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ సేవలకు వాడటమే వారి ‘స్ట్రాటజీ’ అని అర్థమవుతోంది.
ఉద్యోగుల ఆక్రోశం...
రాజకీయ కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రాజకీయ నినాదాలతో కూడిన బ్రోచర్లను తమతో పట్టించి ఫొటోలు తీయడం, నినాదాలు చేయించడంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ, రె వెన్యూ ఉద్యోగులు లోలోపలే కుమిలిపోతున్నారు. నిన్న మొన్నమొన్నటి వరకు ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరుతో ఇంటింటికీ తిప్పారని, ఇప్పుడు ‘జగనే ఎందుకు కావాలి?’ అని మళ్లీ రోడ్డెక్కిస్తున్నారని ఆక్రోశిస్తున్నారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమం పేరుతో రాజకీయ అజెండా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మాకు ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి?’’ అని ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-11-10T03:31:25+05:30 IST