బోడికొండలో భవంతులు
ABN, First Publish Date - 2023-06-05T02:19:02+05:30
బోడికొండ గుట్టను చదును చేసి ఆక్రమించేశారు. ప్లాట్లు వేసి అమ్మేశారు. చాలా కాలం నుంచే అక్కడ ఆక్రమణలు మొదలుకాగా.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కార్పొరేటర్ సహా మరికొందరు భారీ భవనాలను నిర్మించుకున్నారు.
నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లతో చలామణి
గుట్టను ధ్వంసంచేసి ఆక్రమిస్తున్న ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు
మార్చిలోనే బహిర్గతమైనా పట్టించుకోని అధికారులు
మళ్లీ కబ్జాకు యత్నించిన వైనం
పూర్తిస్థాయిలో ఆక్రమణలు ఆగేదెప్పుడో?
బోడికొండ గుట్టను చదును చేసి ఆక్రమించేశారు. ప్లాట్లు వేసి అమ్మేశారు. చాలా కాలం నుంచే అక్కడ ఆక్రమణలు మొదలుకాగా.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కార్పొరేటర్ సహా మరికొందరు భారీ భవనాలను నిర్మించుకున్నారు. ఇందులో పాత్రధారులైన ఇద్దరు కార్పొరేటర్లలో ఒకరు జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరును అధికారుల వద్ద వాడుకుంటూ ఉంటారు. అక్కడ పేదలకు స్థలాలను ఇవ్వాలని ఆ మంత్రి చిత్తూరు ఆర్డీవోకు సిఫార్సు చేసినట్లు ఓ లేఖను సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమణల గుట్టు మార్చిలో వెల్లడైనా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఫలితం.. మళ్లీ నాలుగు రోజుల కిందట ఆ ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు ఆక్రమణలను తెరతీయగా.. బలిజ సంఘం నేతల ఫిర్యాదుతో ఆగింది.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
చిత్తూరు శివారు వరిగపల్లె నుంచి ప్రారంభమయ్యే ఆరు వరుసల జాతీయ రహదారికి ఆనుకుని బోడికొండ ప్రాంతం ఉంది. ఇక్కడ 197 సర్వే నెంబరులో వందల ఎకరాల గుట్ట పోరంబోకు భూమి ఉంది. 2019లో టీడీపీ ప్రభుత్వం రెండు ఎకరాలను కాపు భవన నిర్మాణం కోసం కేటాయించింది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ కాపు భవన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఇక్కడ భూముల విలువ అమాంతం పెరిగింది. దీంతో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్ ఆ బోడికొండ పరిసర ప్రాంతాల మీద దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన ఓ బడా మంత్రి పేరును వాడుకునే ఈయన.. మరో కార్పొరేటర్‌తో కలిసి కాపు భవనానికి కేటాయించిన స్థలం పక్కనే చదును చేసి ప్లాట్లను వేశారు. రూ.5 లక్షలు, రూ.6 లక్షల చొప్పున సుమారు వంద ప్లాట్లను ఇప్పటికే అమ్ముకుని రూ.కోట్లు వెనకేసుకున్నారు. మార్చిలో మరింత భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో వారి ఆక్రమణ తాత్కాలికంగా ఆగింది. అప్పట్లో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ ఇద్దరు కార్పొరేటర్లు నాలుగు రోజుల కిందట రాత్రిళ్లు ఆక్రమణ పనులు మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే కాపు భవనానికి కేటాయించిన భూమిని ఆక్రమించుకున్నారని భావించి ఆ సంఘం నాయకులు.. మిగిలిన స్థలంలో పునాది వేసుకున్నారు. అయినా, ఆక్రమణలు ఆగలేదు. పునాది లోపల నిర్మాణాలు చేపట్టేందుకు బండలు తోలి పెట్టారు. దీంతో ఆ సంఘం నాయకులు ఓఎం రామదాసు, డీకే బద్రినారాయణ, కాజూరు బాలాజీ, పూల చందు తదితరులు ఆక్రమణ జరిగే ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. అక్కడ్నుంచే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను వెంటనే ఆపేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రెవెన్యూ అధికారుల హెచ్చరిక బోర్డు
బోడికొండలో రెండోసారి ఆక్రమణల విషయం శనివారం బహిర్గతం కావడం, ఎమ్మెల్యేకి బలిజ సంఘం నేతల ఫిర్యాదుతో చిత్తూరు ఇన్‌ఛార్జి తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించారు. ‘ఇది ప్రభుత్వ భూమి, ఇందులోకి ప్రవేశిస్తే శిక్షార్హులు’ అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. అక్కడ ఆక్రమణల పనులు చేస్తున్న ఎక్స్‌కవేటర్‌ను సీజ్ చేశారు.
నకిలీ పొజిషన్ సర్టిఫికెట్ల తయారీ
అక్కడ ఇళ్లను నిర్మించుకున్న వారి వద్దనున్న పొజిషన్ సర్టిఫికెట్లన్నీ నకిలీవని రెవెన్యూ అధికారులు తేల్చారు. గతంలో చిత్తూరులో పనిచేసిన తహసీల్దార్ సంతకంతో వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కొన్ని నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అర్హులుంటే ప్రభుత్వమే వారికి పట్టాలను అధికారికంగా ఇస్తోంది. అంతేగానీ, పొజిషన్ సర్టిఫికెట్లను మాత్రం అధికారులు ఎక్కడా ఇవ్వడం లేదు. ఇక్కడ చలామణిలో ఉన్న నకిలీ సర్టిఫికెట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అధికారులకు తెలిసినా..
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిత్తూరులో ఆ పార్టీ నాయకుల భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. కొండను, గుట్టను వదలడం లేదు. గుట్టల్ని చదును చేసి ప్లాట్లుగా వేసి అమ్మేసేవాళ్లు కొందరు.. మొక్కలను నాటుకుని సాగు చేసుకునేవారు మరికొందరు.. ఆ గుట్టల్లో లభించే మట్టిని తరలించి సొమ్ము చేసుకునేవారు ఇంకొందరు. ఇలా వైసీపీ నాయకులు తమ హోదాను బట్టి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.
Updated Date - 2023-06-05T02:19:02+05:30 IST