అంధకారంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి
ABN, First Publish Date - 2023-06-04T01:09:35+05:30
చిత్తూరు ప్రభుత్వాస్పత్రి శనివారం అంధకారమైంది. దీంతో వైద్యం కోసం వచ్చినవారు, వార్డులోని రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం తొమ్మిది నుంచి మధాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వైద్యులు కూడా వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొంది.
- ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరెంటు కట్
- తీవ్ర ఇబ్బందిపడ్డ రోగులు
చిత్తూరు రూరల్, జూన్ 3: చిత్తూరు ప్రభుత్వాస్పత్రి శనివారం అంధకారమైంది. దీంతో వైద్యం కోసం వచ్చినవారు, వార్డులోని రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం తొమ్మిది నుంచి మధాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వైద్యులు కూడా వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అవుట్ పేషెంట్లు కరెంటు కోసం వేచి చూసి.. చివరకు వెనుదిరిగారు. అలాగే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నా కంప్యూటర్ స్లిప్ తీసుకోవాలి. కరెంటు లేక కంప్యూటర్లూ పనిచేయడం లేదని గదికి తాళం వేశారు.
ఫిర్యాదు చేసినా..
ఓపీ గదిని ఆనుకుని ఉన్న డీసీహెచ్‌ఎ్‌సకు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి అయినప్పటికీ జనరేటర్ కూడా లేకుండా నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ ఆగ్రహించినా..
మూడ్రోజుల కిందట చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంటు కట్ అవ్వడంతో క్షతగాత్రులను సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ వెలుతురులో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సీఎంసీకి రెఫర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వైదులు, అధికారులపై కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది జరిగి ఒక్క రోజు కూడా గడవకు ముందే మళ్లీ ఇలా జరగడం గమనార్హం.
దూర ప్రాంతం నుంచి వస్తే కరెంటు లేదంటున్నారు
బంగారుపాళ్యం నుంచి కంట్లో నొప్పంటే డాక్టర్‌కు చూపిద్దామని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చా. ఇక్కడ చూస్తే కరెంటు లేదు. ఆస్పత్రిలో కరెంటు లేదని వినడం ఇదే మొదటిసారి. తెల్లారి 10 గంటలకు వచ్చా.. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతోంది. అయినా కరెంటు రాలేదు. కంటి పరీక్ష చేసే మిషను కరెంటు ఉంటేనే పనిచేస్తుందంట. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంటికి పోవాలి. మా ముసలోడికి అన్నం పెట్టాలని గొణుగుకుంటూ ఆవేదనతో వెనుదిరిగింది. అన్ని ఓపీల్లోనూ ఇదే పరిస్థితి.
- కమలమ్మ
Updated Date - 2023-06-04T01:09:35+05:30 IST