ఉప్పొంగిన ఉత్సాహం
ABN, First Publish Date - 2023-06-21T02:34:48+05:30
ఎటు చూసినా జనమే.. అడుగడుగునా పూలవర్షం.. భారీ గజమాలలో స్వాగతం.. కేక్‌లు కోసి పండుగ వాతావరణం.. మేళతాళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 132వరోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రాపూరు శివారులోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది.

నాలుగు నెలల తర్వాత జిల్లాలోకి ‘యువగళం’ ప్రవేశం
నెల్లూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఎటు చూసినా జనమే.. అడుగడుగునా పూలవర్షం.. భారీ గజమాలలో స్వాగతం.. కేక్‌లు కోసి పండుగ వాతావరణం.. మేళతాళాలు, బాణసంచా పేలుళ్ల మధ్య యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 132వరోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రాపూరు శివారులోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. దారి పొడవునా మహిళలు, యువత, వృద్ధులు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కరెంటు చార్జీల పెంపు, నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరల పెరుగుదలపై మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ ధైర్యం చెబుతూ, టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. తొలుత రాపూరు పట్టణంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ముందుగా దళితులు తమ బాధలు చెప్పుకున్నారు. పాదయాత్ర బస్టాండ్ సెంటర్‌కు చేరుకునే సరికి అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి మద్దెలమడుగు సెంటర్‌కు పాదయాత్ర చేరుకుంది. యువనేతను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ లోకేశ్‌కు విజయ సంకేతం చూపిస్తూ ఆయన చేత కేక్ కట్ చేయించారు. భారీ గజమాలతో సత్కరించారు. మహిళలు హారతులు పట్టి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సెంటర్లోనే జోరేపల్లి గ్రామస్తులు సమస్యలు తెలియజేస్తూ లోకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. అక్కడి నుంచి యువగళం పాదయాత్ర రాపూరు మండలంలోని చివరి గ్రామమైన సిద్ధవరం చేరుకుంది. ఇక్కడ కూడా యువత కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగారు. సిద్ధవరం గ్రామ ప్రజలు తమ సమస్యలను లోకేశ్‌కు తెలియజేశారు. జిల్లాకు సరిహద్దు కావడంతో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. డక్కిలి మండలం మాధవాయపాలెం వద్ద యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లాలోకి ప్రవేశించింది.
మాధవాయపాళెంలో అపూర్వ స్వాగతం
డక్కిలి, జూన్ 20: డక్కిలి మండలం మాధవాయపాళెం రోడ్డు వద్దకు లోకేశ్ పాదయాత్ర చేరుకోగానే టీడీపీ శ్రేణుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. నాలుగు నెలల క్రితం ఫిబ్రవరిలో పుత్తూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరిలో యువగళం పాదయత్ర ఆద్యంతం దిగ్విజయంగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అదే జోష్‌తో పాదయాత్ర మొదలైంది. డక్కిలి మండలంలోకి ప్రవేశించగానే బాణాసంచా పేలుళ్లు, డీజే వాయిద్యాలు, యువత కేరింతల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాధవాయపాళెం తెలుగుగంగ బ్రిడ్జివద్ద నుంచి మొదలైన పాదయాత్ర వెలికల్లు, కొత్తపల్లి రోడ్డు, వెలికల్లు ఎస్సీకాలనీ, మార్లగుంట, మార్లగుంట ఎస్టీ కాలనీ, సంగనపల్లి రోడ్డు, కమ్మపల్లి రోడ్డు, డక్కిలి వరకు సాగింది. పాదయాత్ర సాగిన గ్రామాల వద్ద జనం సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ ఓపిగ్గా సమాధానం చెప్పారు. రోడ్డుకిరువైపులా బారులు తీరిన మహిళలను ఆప్యాయంగా పలకరించారు. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు జరిగాయి. లోకేశ్‌వెంట కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి, పనబాక కృష్ణయ్య, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పరసా రత్నం, ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్, డాక్టర్ మస్తాన్ యాదవ్, కొండేపాటి గంగాప్రసాద్, ఆనం కైవల్యారెడ్డి, కొండేపాటి లక్ష్మీసాయి ప్రసన్న, డాక్టర్ జడ్ శివప్రసాద్, కేవీకే ప్రసాద్ తదితరులు తదితరులున్నారు. డక్కిలికి చేరుకున్నాక రాత్రికి ఓ దాబాలో తటస్థులతో లోకేశ్ సమావేశమయ్యారు. వివిధ వర్గాలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు.
డక్కిలిలో 1700 కి.మీ పైలాన్
పాదయాత్ర డక్కిలి వద్దకు చేరుకునేసమయానికి 1700 కిలోమీటర్లు మైలురాయికి చేరుకుంది. దాంతో డక్కిలిలో 1700 కిలోమీటరు వద్ద యువగళం పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రజల హర్షద్వానాల మధ్య లోకేశ్ ప్రారంభించారు.
ఆప్కో హ్యాండ్‌లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ
డక్కిలిలో ఆప్కో హ్యాండ్‌లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు లోకేశ్ అన్నారు. పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. దీనివల్ల ఈ ప్రాంత చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.
ఆగస్టులో ఆనం చేరిక?
యువగళం పాదయాత్రలో లోకేశ్ వెంట వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నడిచారు. యాత్రలో తన అనుచరులను లోకేశ్‌కు పరిచయం చేస్తూ ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను అక్కడక్కడ లోకేశ్ దృష్టికి తీసుకోచ్చారు. మొన్నటివరకు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీ నుంచి బైటకు రావడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరికకు ఆగస్టు మాసం వరకు పట్టవచ్చని అక్కడ చర్చ జరిగింది. అలాగే ఆనం ఆధ్వర్యంలో డక్కిలి మండలానికి చెందిన 22మంది వైసీపీ నాయకులు లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో వెంకటగిరి నుంచి 70శాతం మంది, ఆత్మకూరు నుంచి 80శాతం వైసీపీ నాయకులు టీడీపీలో చేరనున్నట్లు ఆనం ప్రకటించారు.
ఇప్పటి వరకు నడిచిన దూరం : 1703.7 కి.మీ
ఈరోజు నడిచిన దూరం : 16.9 కిలోమీటర్లు
తిరిగిన గ్రామాలు : రాపూరు, రాపూరు ఆంజనేయపురం, మద్దెలమడుగు, సిద్ధవరం, మాధవాయపాలెం, వెలికల్లు, వెలికల్లు దళితవాడ, మర్లగుంట, డక్కిలి
నేటి పాదయాత్ర వివరాలు
వెంకటగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లా
మధ్యాహ్నం 2:00 : డక్కిలి విడిడి కేంద్రంలో చేనేతలతో ముఖాముఖి
4:00 : డక్కిలి క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభం
4:50 :లింగసముద్రం
5:20 : మాపూరు పాయింట్ వద్ద స్థానికులతో మాటామంతీ
6:40 : నాగవోలులో స్థానికులతో సమావేశం
7:00 : మిట్టపాలెం
9:00 : వెంకటగిరి శివారు కమ్మపాలెంలో బస
Updated Date - 2023-06-21T02:34:48+05:30 IST