చిత్తూరులో మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్
ABN, First Publish Date - 2023-04-20T00:31:11+05:30
చిత్తూరులో బుధవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్‌లో ‘మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించారు.
చిత్తూరు (సెంట్రల్), ఏప్రిల్ 19: చిత్తూరులో బుధవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్‌లో ‘మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించారు. పలమనేరు, గుడిపాల, బంగారుపాళ్యం, జీడీ నెల్లూరు, చిత్తూరు రూరల్, పూతలపట్టు, ఐరాల, పులిచెర్ల మండల సమాఖ్యల ఆధ్వర్యంలో సభ్యులు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, సాములు, ఊదలు, అరికెలతో తయారు చేసిన వంటకాలను ఇందులో ప్రదర్శనకు ఉంచారు. వీటిని కలెక్టర్ షన్మోహన్ తన సతీమణితో కలిసి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఆర్‌డీఏ ముద్రించిన ‘మన చిరుధాన్యాలు.. మన వంటకాలు’ పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. చిరుధాన్యాలతో చేసిన వంటలు ఆరోగ్యానికి మేలని పేర్కొన్నారు. సేంద్రియ సాగుతో పండించిన చిరుధాన్యాలతో చేసిన వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్వో రాజశేఖర్, డీఆర్‌డీఏ పీడీ తులసి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మి, డీఆర్‌డీఏ ఏపీడీ రవి, డీపీఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-20T00:31:11+05:30 IST