టీడీపీ జెండాలు తీసేయండి
ABN, First Publish Date - 2023-05-11T01:18:06+05:30
‘డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గ్రామానికి వస్తున్నప్పుడు టీడీపీ జెండాలు ఇలా ఉంటే ఎలా? వాటిని తీసేయండి’ అంటూ యువకులను పోలీసులు ఆదేశించారు.
గంగాధరనెల్లూరు, మే 10: ‘డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గ్రామానికి వస్తున్నప్పుడు టీడీపీ జెండాలు ఇలా ఉంటే ఎలా? వాటిని తీసేయండి’ అంటూ యువకులను పోలీసులు ఆదేశించారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గంగాధరనెల్లూరు మండలం కొండేపల్లె పంచాయతీలో బుధవారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించారు. పద్మాపురం గ్రామంలో సత్యమ్మ గుడిపక్కన టీడీపీజెండాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏఎ్‌సఐ ఆంజినేయులురెడ్డి, కానిస్టేబుల్ గోపాల్, మరో ఇద్దరు మఫ్టీలో ఉన్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న యువకులను పిలిచారు. ఇంకొంతసేపటికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రామంలోకి వస్తున్నారని, వెంటనే ఆ మూడు టీడీపీ జెండాలను తొలగించాలని ఆదేశించారు. నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కట్టిన జెండాలని.. తమ గ్రామంలోని టీడీపీ అభిమానులు కట్టారని, వాళ్లు చెప్పందే తాము తీస్తే గొడవలు వస్తాయని వారు పోలీసులకు తేల్చిచెప్పారు. కావాలంటే మీరే జెండాలను తొలగించుకోవచ్చని, తాము అడ్డు చెప్పబోమని వారు పోలీసులకు సూచించారు. డిప్యూటీ సీఎం వచ్చి వెళ్ళేవరకైన ఆ టీడీపీ జెండాలను తీసేసి తర్వాత కట్టుకోవాలని, లేదంటే తాము మాట పడాల్సి వస్తుందని పోలీసులు అన్నారు. ‘డిప్యూటీ సీఎంతో పాటు వైసీపీ కార్యకర్తలు, నేతలు వచ్చి టీడీపీ జెండాలను చింపేయడం, పీకేయడం లాంటివి జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. అప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తేగాని మీకు తెలిసిరాదు. ముందస్తుగా చెప్పినా పట్టించుకోరా’ అంటూ యువకులపై విరుచుకుపడ్డారు.
జెండా తీయం.. ఏం చేస్తారో చేస్కోండి
పోలీసుల ఒత్తిడితో ఓ యువకుడు ఒక స్తంభానికి ఉన్న టీడీపీ జెండాను తొలగించారు. మరో స్తంభంపైకి ఎక్కి జెండాను తీస్తుండగా అంతలోనే మొబైల్స్‌లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని యువకులు గుర్తించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ జెండాలను తొలగించేదిలేదని పోలీసులకు తేల్చిచెప్పేసి వెళ్ళిపోయారు. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలుసుకున్న పోలీసులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
Updated Date - 2023-05-11T01:18:06+05:30 IST