రంగులు వేయడమే
ABN, Publish Date - Dec 31 , 2023 | 04:10 AM
విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చానని సీఎం జగన్ అంటున్నారు. స్కూల్ బిల్డింగులకు రంగులు వేయడం విప్లవమా? విద్యలో నాణ్యత పెంచి, ఉద్యోగాలు సృష్టించడం విప్లవమా?’’ అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.
విద్యలో నాణ్యత పెంచి, ఉద్యోగాల సృష్టే అసలైన విప్లవం
హాస్టళ్లలో తిండిలేక విద్యార్థులు విలవిల
ఇంత చేతకాని ప్రభుత్వాన్ని చూడలేదు
మతిస్థిమితం సరిలేని జగన్ అవసరమా?
పాత పథకాలకే కొత్తగా బటన్ల నొక్కుడు
పాసుపుస్తకాల్లో జగన్ ఫొటోలెందుకు
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. అందరికీ న్యాయం
రాష్ట్రంలో పాలనను గాడిలో పెడతా
టీటీడీ బోర్డు మెంబరుగా కురబలకు చాన్స్
రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి
టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి
కుప్పంలో ముగిసిన 3 రోజుల పర్యటన
కుప్పం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చానని సీఎం జగన్ అంటున్నారు. స్కూల్ బిల్డింగులకు రంగులు వేయడం విప్లవమా? విద్యలో నాణ్యత పెంచి, ఉద్యోగాలు సృష్టించడం విప్లవమా?’’ అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విద్యలో నాణ్యత పెంచి, ఉద్యోగాలు సృష్టించినప్పుడే నిజమైన విప్లవం వచ్చినట్టని ఉద్ఘాటించారు. ‘‘జగన్ పత్రికకు అడ్వర్‌టైజ్‌మెంట్ కోసం మాత్రమే పాత పథకాలకు కొత్తగా బటన్లను నొక్కుతున్నారు. వస తి గృహాల్లో విద్యార్థులకు మంచాలు, సరైన తిండి లేదు. ఆస్పత్రుల్లో రోగులకు తిండి పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు’’ అని విమర్శించారు. సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన శనివారం ముగిసింది. ఈ మూడు రోజులు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ ఆయన పర్యటించి బహిరంగ సభలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలను నిర్వహించారు. చివరి రోజు కుప్పంలోని మల్లానూరులో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో బాబు ప్రసంగించారు.
జగన్ మనిషే కాదు
‘‘2019లో వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు గుండెపోటు అని చెప్పారు. తర్వాత మాటమార్చి రక్తపు వాంతులన్నారు. తల మీద కొడితే లోపల మెదడు చిట్లిపోయిందని పోస్టుమార్టంలో తెలిసిపోయింది. అప్పుడు గొడ్డలిపోటుగా ప్రకటించి, నింద మా మీద వేశారు. తండ్రి యాక్సిడెంట్‌లో చనిపోయాడని.. బాబాయిని హత్య చేశారని జగన్ సింపతీ గేమ్ ఆడి ఓట్లు గుంజుకున్నారు. మీరంతా మోసపోయి ఓట్లేశారు. హత్య వాస్తవాలు చెప్పేందుకు మా ప్రభుత్వం విచారిస్తుంటే వద్దని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సీబీఐ విచారణ కోరారు. ఇప్పుడు మళ్లీ వద్దంటున్నారు. బెంగళూరులో ఆస్తి తగాదాలు, సెటిల్‌మెంట్ల వల్ల చంపేశారని.. రెండో వివాహం వల్లే చంపేశారని.. సొంత అల్లుడు ఆస్తి కోసం చంపేశారని.. కూతురు సునీత చంపేందుకు సహకరించిందని.. కూడా కోర్టులకు వెళ్లారు. ఈ హత్యకు కారణమైన వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయకుండా సర్వశక్తులూ ఒడ్డారు. హత్య చేసినవారిని పక్కనపెట్టుకుని అమాయకులను వేధిస్తున్న జగన్ మనిషే కాదు. వివేకా కేసు తిరిగిన మలుపులు చూస్తుంటే రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేదని తెలుస్తోంది’’ అన్నారు.
అన్యాయం జరిగిందని చెప్పుకొనే ధైర్యం రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ‘‘కుప్పం నియోజకవర్గంలోనూ 500మంది మీద అక్రమ కేసులు పెట్టి నెల రోజులు జైల్లో పెట్టారు. పోలీసులు కూడా నేరస్థులు చెప్పినట్లు పనిచేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థుడు.. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్నవాడు.. బాబాయిని చంపుకున్నవాడు సీఎం కాబట్టే రాష్ట్రం ఇలా అథోగతిలో ఉంది. మతిస్థిమితం లేని ఇలాంటి సీఎం మనకు అవసరం లేదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే.. భయపడాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు.
ఎంతో మందిని చూశా
‘‘వైసీపీ వాళ్ల అరాచకాలకు హద్దూపద్దూ లేదా? నేను ఇందిరాగాంధీని చూశాను. రాజీవ్ గాంధీని చూశాను. జనార్దన్‌రెడ్డిని చూశాను. ఆఖరికి రాజశేఖర్‌రెడ్డిని కూడా చూశాను. ఈ సైకో దగ్గర వేగుతున్నా. వాళ్లే నాకు లెక్కలేదు. ఈయనో లెక్కా? గాడితప్పిన పాలనను గాడిలో పెడతా. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా’’ అని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 35 ఏళ్లలో కుప్పాన్ని ఎంత అభివృద్ధి చేశానో.. వచ్చే ఐదేళ్లలో అంతకు సమాన అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని ప్రకటించారు.
కురబలకు టికెట్లు
కుప్పంలోని కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ‘‘రాష్ట్రంలో కురబలకు ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్తా. సామాజికంగా శక్తిమంతమైన జాతిగా తయారు చేస్తా. కనకదాసుకు, వేంకటేశ్వరస్వామికి అవినాభావ సంబం ధం ఉంది కాబట్టి టీడీపీ వచ్చాక కురబలకు టీటీడీ బోర్టు మెంబరుగా అవకాశం కల్పిస్తా. కురబలకు స్ఫూర్తినిచ్చేలా కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లిచ్చి పోటీ చేయిస్తాం. ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తాం. టీడీపీ వచ్చాక గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా ఇస్తాం. ‘జయహో బీసీ’ కార్యక్రమంలో కురబలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కుప్పంలో 80శాతం పూర్తయిన కురబ సంఘం భవనాన్ని పూర్తి చేయలేనివాడు, మూడు రాజధానులు కడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ వచ్చాక ఇక్కడ రూ.3 కోట్లతో భవనాన్ని పూర్తి చేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.
అంగన్వాడీలకు సంఘీభావం
కుప్పంలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన చంద్రబాబు వారికి సంఘీభావం తెలిపారు. టీడీపీ హయాం లో అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచగా, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
జనవరి 3న పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సు
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘జనవరి 3న మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ నందు రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం చంద్రబాబు హాజరవుతారు’ అని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు... సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల నిధులను దారి మళ్లించడం, వారి హక్కులను కాలరాయడంతో మూడున్నర కోట్ల గ్రామీణ, పట్టణ ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని వైవీబీ అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ ఐక్యమై 16 రకాల స్థానిక సంస్థల సమస్యల సాధన కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఈ రాష్ట్ర సదస్సులో రూపొందిస్తారని ఏపీ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసపల్లి లక్ష్మీముత్యాలరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,918 గ్రామాల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రస్తుత, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను కమిటీ ఆహ్వానిస్తోందని వాసపల్లి తెలిపారు.
ఆద్యంతం ఉత్సాహంగా
కుప్పం పర్యటనలో చంద్రబాబు ఆద్యంతం ఉత్సాహంగా కనిపించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి కుప్పం అన్నా క్యాంటీన్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ పేదలకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం కొత్తపేటలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. స్థానిక మసీదుకు వెళ్లి ముస్లిం సోదరులతో దువా చేసి వారితో మాట్లాడారు.
మల్లానూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని అట్నుంచి అటే బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకుని హైదరాబాదు వెళ్లారు. దీంతో కుప్పంలో మూడు రోజుల చంద్రబాబు పర్యటన ముగిసింది.
మల్లానూరులో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అక్కడి మసీదులో అజా ఇచ్చారు. దీంతో తన ప్రసంగాన్ని ఆపేసి అన్ని మతాలను గౌరవించి అజా అయ్యే వరకు మౌనం పాటించాలని ఆయన కోరారు.
మల్లానూరులో ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, అంబులెన్సు వచ్చింది. కాసేపు ప్రసంగాన్ని ఆపేసి అంబులెన్సుకు దారివ్వాలని శ్రేణులకు చంద్రబాబు సూచించారు.
Updated Date - Dec 31 , 2023 | 04:10 AM