కిడ్నీ రాకెట్ కేసులో వైద్యుడు రాజశేఖర్ అరెస్టు
ABN, First Publish Date - 2023-05-04T03:27:11+05:30
విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, కిడ్నీ శస్త్రచికిత్స చేసిన..
పెందుర్తి, మే 3: విశాఖలో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, కిడ్నీ శస్త్రచికిత్స చేసిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్ల, బ్రోకర్ వెంకటేశ్వరరావులను బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఆ వివరాలను సీఐ గొలగాని అప్పారావు విలేకరులకు తెలిపారు. పెందుర్తి శ్రీతిరుమల ఆస్పత్రిలో ఇటీవల అక్రమంగా రెండు కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆపరేషన్ చేసిన వైద్యులపై దృష్టి సారించారు. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు చెన్నైకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్ల ఈ శస్త్రచికిత్సలు చేసినట్టు గుర్తించారు. మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ అయిన రాజశేఖర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడిలో విశేష అనుభవం ఉంది. విదేశాల్ల్లో కూడా పని చేశారు. ఆపరేషన్‌కు రూ.5 లక్షలు, సూపర్‌వైజింగ్ చేస్తే రూ.3 లక్షలు వసూలు చేసేవారన్నారు. ఈ క్రమంలోనే శ్రీతిరుమల ఆస్పత్రిలో రెండు కిడ్నీ ఆపరేషన్లు చేశాడని తెలిపారు. ఆయన కదలికలపై నిఘా పెట్టి నగరంలోనే అరెస్టు చేశామని చెప్పారు. మరో కీలక నిందితుడు, బ్రోకర్‌గా వ్యవహరించిన వెంకటేశ్వరరావును కూడా అరెస్టు చేశామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కరపకు చెందిన వెంకటేశ్వరరావు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దందాకు తెరతీస్తుంటాడన్నారు. ఒక ముఠాను ఏర్పరచుకుని కిడ్నీ రాకెట్ నిర్వహించేవాడని, గతంలో నగరంలోని శ్రద్ధ ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌లోనూ నిందితుడని సీఐ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీతిరుమల ఆస్పత్రి వైద్యుడు జి.పరమేశ్వరరావు, దళారులు కామరాజు, శ్రీను, శేఖర్, ఎలీనా, కొండమ్మలను అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Updated Date - 2023-05-04T03:27:20+05:30 IST