Viveka case: అవినాశ్‌రెడ్డికి డ్రైవర్ దస్తగిరి సవాల్
ABN, First Publish Date - 2023-04-19T20:57:34+05:30
సీఎం జగన్ (CM Jagan), ఎంపీ అవినాశ్‌రెడ్డిల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మాజీమంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు షేక్ దస్తగిరి..
కడప: సీఎం జగన్ (CM Jagan), ఎంపీ అవినాశ్‌రెడ్డిల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని మాజీమంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవరు షేక్ దస్తగిరి (Driver Dastagiri) ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని కోరేందుకు బుధవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) కుటుంబ సభ్యులు అరెస్టు అవుతున్నందున పులివెందుల (Pulivendula) వైసీపీ నేతలు తనపై కక్ష కట్టారని, తనకుటుంబానికి ఏమైనా చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ సీబీఐ (CBI) విచారించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. దీన్ని జీర్ణించుకోలేనిఅవినాశ్‌రెడ్డి తనపై రెచ్చగొట్టే విధంగా మీడియాలో ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారని, దీంతో వారి అనుచరుల వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశాడు.
దస్తగిరి డబ్బులకు అమ్ముడుపోయాడని అవినాశ్‌రెడ్డి పదే పదే ఆరోపించడం సరైంది కాదన్నారు. డబ్బులకు అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే జైలుశిక్షకైనా సిద్ధమేనని, ఒకవేళ నిరూపించకపోతే మీ పదవులకు రాజీనామా చేసి జైలుకెళతావా అంటూ దస్తగిరి సవాల్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు ఏ స్థాయిలో విచారణ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని దస్తగిరి పేర్కొన్నాడు.
Updated Date - 2023-04-19T20:57:34+05:30 IST