TTD: తిరుమలలో డ్రోన్ కలకలం
ABN, First Publish Date - 2023-01-21T19:30:31+05:30
శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరా (Drone camera)తో చిత్రీకరించినట్టుగా సోషల్‌మీడియాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి రెండు, మూడురోజుల్లో నిందితుల..
తిరుమల: శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరా (Drone camera)తో చిత్రీకరించినట్టుగా సోషల్‌మీడియాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి రెండు, మూడురోజుల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అవకాశం లేదని, ఆగమశాస్త్రాల ప్రకారం నిషేధించబడ్డాయన్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసినట్టు టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) విభాగం గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో డ్రోన్ ద్వారా చిత్రీకరించారా లేక పాత ఫొటోలతో మార్ఫింగ్ చేసి త్రీడీ విధానంలోకి మార్చి భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా తెలుస్తుందన్నారు.
మహిమాన్విత శక్తి కలిగిన శ్రీవారి ఆలయం
‘తిరుమలలో వేంకటేశ్వరస్వామి కొలువైన ఆలయం మహిమాన్విత శక్తి కలిగినది. వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు. ఆలయంలో శ్రీవారు దివ్యశక్తితో ఉంటారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు ప్రయాణించడం దోషం’ అని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు. ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదని ఆగమశాస్త్రంలో స్పష్టంగా ఉందన్నారు. దీనికి అనుగుణంగానే తిరుమలలో విమానాలు తిరగకూడదని గతంలోనూ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చిత్రీకరించిన శ్రీవారి ఆలయం డ్రోన్ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయని, దీనిపై టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామన్నారు.
డ్రోన్ ఎగరడం భద్రతా సిబ్బంది వైఫల్యం
శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా ఎగరడం తిరుమలలోని భద్రతా వైఫల్యంగా బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేత భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. వేంకటేశ్వరస్వామితో సరిసమానమైన దేవుడు కానీ, తిరుమలతో సరిసమానమైన క్షేత్రం కానీ ఈ భూమండలంలోనే లేవని పురాణాలు చెబుతున్నాయన్నారు. అలాంటి క్షేత్రాన్ని కాపాడడంలో టీటీడీ ఎందుకు విఫలమైందని భక్తులు ప్రశ్నిస్తున్నారన్నారు. నవంబరులో తిరుమల ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టిందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంటే టీటీడీ మాత్రం వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెబుతోందన్నారు. అక్టోపస్, స్పెషల్ ప్రొటెక్షన్ టీం, పోలీసులు, విజిలెన్స్ అంటూ ఇంతమంది ఉండి కూడా డ్రోన్ రావడాన్ని గుర్తించలేకపోవడాన్ని భద్రతా వైఫల్యంగా బీజేపీ భావిస్తోందన్నారు.తీవ్రవాదుల నుంచి తిరుమలకు ముప్పుందని నిఘా వర్టాల నుంచి పదేపదే హెచ్చరికలు వస్తున్నా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇది చిన్నవిషయం కాదని, వెంటనే ఈ వీడియో వెనుక ఉన్న వ్యక్తులను, శక్తులను బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.
Updated Date - 2023-01-21T19:30:32+05:30 IST