Chandrababu: సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం..
ABN, First Publish Date - 2023-05-27T13:12:59+05:30
తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు (Mahanadu) వేడుకలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababunaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు (NTR Centenary Celebrations) ఘనంగా నిర్వహించామన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కర వేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు తెలిపారు.
తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీఅని.. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో రూ. 2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఏపీలో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకున్నారని విమర్శించారు. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసునని, అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీయేనని అన్నారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది కూడా టీడీపీనే అన్నారు.
టీడీపీ విజన్ ఏంటో హైదరాబాద్ చూస్తే తెలుస్తుందని, ఇరిగేషనుకు రూ.64 వేల కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు తెలిపారు. నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. ఒక్క ఛాన్స్ అన్నాడు, కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్స్ టెర్రరిజం పెరిగింది. పెట్టుబడులు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదన్నారు. లేని దిశా చట్టాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానన్నారని, కేసుల కోసం ప్రధానికి సాష్టాంగం చేశారని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం పెడతానన్న పెద్ద మనిషి మద్య ఆదాయాన్నే తాకట్టు పెట్టారని విమర్శించారు. 0.2 శాతం మేర మాత్రమే సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని, అన్ని రంగాల్లోనూ ఏపీ వెనుకడుగులోనే ఉందన్నారు.
పుట్టబోయే బిడ్డపైనా అప్పు వేసేలా ఉన్నారని, ఇసుక లేకపోవడం వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్ముకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి టీడీపీ సైకిలుకున్న రెండు చక్రాలని, నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడినా ఎవ్వరూ భయపడలేదన్నారు. జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. వినకుండా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలూ ఉన్నారన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని, భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated Date - 2023-05-27T14:39:11+05:30 IST